Anna University: అన్నా వర్సిటీ విద్యార్థినిపై రేప్ కేసు.. బిర్యానీ మాస్టరే దోషి
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:33 AM
చెన్నై మహిళా కోర్టు అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార కేసులో నిందితుని యావజీవ కారాగార శిక్ష మరియు రూ.90వేల జరిమానా విధించింది. ఈ తీర్పులో నిందితుని తేల్చి, బాధితకు న్యాయం అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
తేల్చిన చెన్నై మహిళా కోర్టు
నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష
చెన్నై, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం కేసులో చెన్నై మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొదటినుంచి నిందితునిగా ఉన్న వ్యక్తే దోషి అని తేల్చిన కోర్టు.. అతనికి యావజ్జీవ కారాగారశిక్ష, రూ.90వేల జరిమానా విధించింది. ఈ తీర్పు ప్రకారం ముద్దాయి జ్ఞానశేఖరన్ ఎలాంటి జైలు రాయితీలు లేకుండా 30 ఏళ్లపాటు ఏకబిగిన కఠినకారాగార శిక్ష అనుభవించాలని, అపరాధ సొమ్మును బాధిత విద్యార్థినికి అందజేయాలని స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ 23 రాత్రి అన్నా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న పీజీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని కోట్టూరుపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఆ ప్రాంతంలో బిర్యానీ షాపు నడుపుతున్న జ్ఞానశేఖరన్(37)ను డిసెంబర్ 24న అరెస్టు చేశారు. నిందితునికి డీఎంకే నేతలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ కేసును సీబీఐకి అప్పగించాలని అన్నాడీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. మహిళా ఐపీఎస్ అధికారులు స్నేహప్రియ, బృందా, ఐమాన్ జమాల్‌తో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ దర్యాప్తు బృందం విచారణ జరిపి గత ఫిబ్రవరి 24న సైదాపేట 9వ క్రైం కోర్టులో ఛార్జిషీటు సమర్పించింది. విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో జ్ఞానశేఖరన్ తప్ప ఇతరులెవరికీ సంబంధంలేదని నివేదించింది. గత మార్చి 7న ఈ కేసు విచారణను చెన్నై మహిళా కోర్టుకు బదిలీ చేశారు. అక్కడ కేసు విచారణ ముగియడంతో న్యాయాధికారి ఎం.రాజలక్ష్మి సోమవారం తీర్పు వెలువరించారు.
ఇవీ చదవండి:
కేంద్రం హెచ్చరిక.. వెనక్కు తగ్గిన రైడ్ హెయిలింగ్ యాప్స్
పాక్‌కు గూఢచర్యం.. భారత యుద్ధ నౌకల వివరాలను చేరవేసిన ఇంజినీర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి