అమ్మో.... మేనమామ సారెనా... మజాకా..
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:40 PM
ఓ మేనమామ తన అక్క కుమార్తె, కుమారుడికి సమర్పించిన సారే అందరినీ ఆకట్టుకుంది. అక్క, చెల్లి పిల్లలకు చెవులు, ముక్కు కుట్టే కార్యక్రమాలకు సారెను తీసుకురావడం ఆనవాయితీ. అయితే.. ఇక్కడ మాత్రం అందరూ ఆశ్చర్యపడేలా చేసి ఔరా అనిపించుకున్నాడు ఓ మేనమామ. ఇక వివరాల్లోకి వెళితే..
- పది ఎద్దుల బండ్లు, పది ట్రాక్టర్లలో తరలింపు
చెన్నై: వివాహ వేడుకల ఊరేగింపునకు ధీటుగా మేనమామ తీసుకొచ్చిన సారే ఊరేగింపు చూపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. అక్క కుమార్తె, కుమారుడికి చెవులు కుట్టే సమయంలో మేనమామ సారె సమర్పించడం ఆనవాయితీ. ఆ ప్రకారం, దిండుగల్ గాంధీ మార్కెట్లో టమోటా వ్యాపారి అయిన సంతోష్ కుమారుడు యువన్ శ్రీహరి(Yuvan Srihari)కి చెవులు కుట్టే వేడుక దిండుగల్‌లోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. యువన్ శ్రీహరి మేనమామ ముత్తుకుమార్ ప్రేమతో సారెగా 1,008 రకాల వస్తువులు తీసుకొచ్చారు.

పది ఎడ్ల బండ్లు, పది ట్రాక్టర్లలో ఏడాదికి సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాలు, స్వీట్లు, కూరగాయాలు, పలురకాల పండ్లు, కొత్త బట్టలు, నగదు, బంగారు ఆభరణాలతో ఊరేగింపుగా తరలివచ్చాడు. ఊరేగింపు ముందు పల్లకీలో యువన్ శ్రీహరిని కూర్చుండబెట్టి గరగాట్టం, ఓయిలాట్టం, చెక్క గుర్రం సహా పలు ప్రదర్శనలతో తరలివచ్చారు.

అలాగే, పొన్ ముత్తురామలింగ దేవర్, ముఖ్యమంత్రి స్టాలిన్, నటులు రజనీకాంత్, కమల్‌హాసన్(Rajanikanth, Kamal Hasan), వడివేలు తదితర రుల వేషధారణతో కళాకారులు ముందు నిలిచారు. సారెలో మూడు జల్లికట్టు ఎద్దులు, గొర్రెలు, మేకలు కూడా ఉన్నాయి. అనంతరం యువన్ శ్రీహరిని మేనమామ ముత్తుకుమార్ ఒడిలో కూర్చోబెట్టి చెవులు కుట్టే కార్యక్రమం నిర్వహించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే
రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి
Read Latest Telangana News and National News