Share News

Tragic Stampede During Vijays Rally: కల్లోల కరూర్‌..!

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:29 AM

చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. చిరిగిన పార్టీ జెండాలు.. విరిగిన స్తంభాలు.. నలిగిపోయిన మంచినీటి బాటిళ్లు.. తమిళనాట కరూర్‌లోని వేలుచ్చామిపురం ప్రాంతంలో ఆదివారం నెలకొన్న పరిస్థితి ఇది....

Tragic Stampede During Vijays Rally: కల్లోల కరూర్‌..!

  • తొక్కిసలాటలో 40కి పెరిగిన మృతులు..ఆస్పత్రిలో 50 మందికి చికిత్స

  • బాధితులకు సీఎం స్టాలిన్‌ పరామర్శ

  • 2 లక్షల పరిహారం ప్రకటించిన మోదీ

  • మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున అందజేస్తానన్న విజయ్‌

చెన్నై, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. చిరిగిన పార్టీ జెండాలు.. విరిగిన స్తంభాలు.. నలిగిపోయిన మంచినీటి బాటిళ్లు.. తమిళనాట కరూర్‌లోని వేలుచ్చామిపురం ప్రాంతంలో ఆదివారం నెలకొన్న పరిస్థితి ఇది. సినీనటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌ పర్యటన సందర్భంగా శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. కరూర్‌ ప్రభుత్వాస్పత్రి అత్యవసర చికిత్సా విభాగంలో చికిత్స పొందుతున్న కవిన్‌(31) ఆదివారం మధ్యాహ్నం మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 50మంది వరకూ క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలను కలుసుకుని ఓదార్చేందుకు, గాయపడినవారిని పరామర్శించేందుకు అనుమతించాలంటూ పోలీసులను విజయ్‌ కోరారు. ఈ ఘటన సమాచారం తెలియగానే సీఎం స్టాలిన్‌ శనివారం రాత్రి 11 గంటలకు సచివాలయానికి వెళ్లి అధికారులతో సమీక్షించారు. ఆదివారం వేకువజాము కరూర్‌ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం విభాగం వద్ద మృతులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించారు. కాగా, మృతులకు నివాళులర్పిస్తూ కరూర్‌లో వ్యాపారులు ఆదివారం స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు.

నివేదిక కోరిన అమిత్‌షా

కరూర్‌ దుర్ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వు జారీ చేశారు. సభ కోసం స్థలం ఎంపిక, పోలీసులు కల్పించిన భద్రతా ఏర్పాట్లు, టీవీకే పార్టీకి విధించిన నిబంధనలు, తొక్కిసలాట జరగటానికి గల కారణాలు తదివివరాలతో సమగ్రమైన నివేదికను పంపాలని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించారు.


ఎలా ఓదార్చాలో తెలియడం లేదు: విజయ్‌

కరూర్‌ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు రూ.20లక్షలు, గాయపడినవారికి రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు విజయ్‌ ప్రకటించారు. ఈ ప్రమాదం తనకు తీవ్ర దిగ్ర్భాంతిని, మనోవేదనను కలిగించిందని పేర్కొన్నారు. ఆత్మీయులను కోల్పోయి బాధపడుతున్నవారిని తలచుకుని తీవ్రంగా ఆవేదన చెందుతున్నానని, వారిని ఎలా ఓదార్చాలో తెలియక కన్నీటి పర్యంతమవుతున్నానని తెలిపారు. ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి ప్రకటించిన ప్రధాని మోదీ.. బాధిత కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇక తమిళనాడు కాంగ్రెస్‌ పార్టీ కూడా మృతుల కుటుంబీకులకు, క్షతగాత్రులకు కలిపి మొత్తం రూ.కోటి సాయం ప్రకటించింది.

రాజకీయాలు వద్దు: సీఎం స్టాలిన్‌

కరూర్‌ దుర్ఘటనపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయదలచుకోలేదని, బాధితులను కాపాడటం, మృతుల కుటుంబాలను ఓదార్చి, వారిని అన్ని విధాలా ఆదుకోవడమే తన కర్తవ్యంగా భావిస్తున్నానని సీఎం స్టాలిన్‌ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా చెన్నై నీలాంగరైలోని టీవీకే నేత విజయ్‌ నివాసగృహాన్ని ఆదివారం ఉదయం డీఎంకే విద్యార్థి విభాగం కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా 50మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కరూర్‌లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, తగిన భద్రత కల్పించలేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించారు.

సీబీఐ విచారణకు ఆదేశించండి: టీవీకే పిటిషన్‌

కరూర్‌ దుర్ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీవీకే కోరింది. చెన్నైలోని హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ దండపాణి నివాసగృహానికి వెళ్లిన ఆ పార్టీ డిప్యూటీ కార్యదర్శి నిర్మల్‌కుమార్‌ ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేశారు. విజయ్‌ పర్యటన సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయని, పోలీసులు తగినంత భద్రత కల్పించలేదని అందులో ఆరోపించారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. సోమవారం మధ్యాహ్నం హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌లో విచారణ జరిపేందుకు అంగీకరించారని నిర్మల్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Sep 29 , 2025 | 03:29 AM