Chandrakant Jha: పోలీసులకు చిక్కిన18 హత్యల దోషి చంద్రకాంత్
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:21 AM
పరారీలో ఉన్న కరుడుకట్టిన హంతకుడు చంద్రకాంత్ ఝా (57) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
న్యూఢిల్లీ, జనవరి 18: పరారీలో ఉన్న కరుడుకట్టిన హంతకుడు చంద్రకాంత్ ఝా (57) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శుక్రవారం పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఉండగా పోలీసులు పట్టుకున్నారు. 2006-07 మధ్య వరుసగా 18 హత్యలు చేసి దేశ రాజధానిని వణికించాడు. 2013లో మూడు కేసుల్లో నేరం రుజువు కావడంతో కోర్టు రెండు మరణశిక్షలు విధించింది. కానీ 2016లో వాటిని విడుదలకు అవకాశం లేని యావజ్జీవ కారాగారశిక్షలుగా మార్చుతూ క్షమాభిక్ష లభించింది. 2023 అక్టోబరులో పెరోల్‌పై విడుదలయి, అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. హత్యలు చేసి రక్తం బయటకు కనిపించకుండా శవాన్ని ప్లాస్టిక్ సంచెలో మూట కట్టి తిహాడ్ జైలు సమీపంలో పారివేయడం అతడి ప్రత్యేకతగా ఉండేది. ‘ఈ హత్య చేశాను. చేతనయితే పట్టుకోండి’ అని పోలీసులను ఉద్దేశించి చీటీ కూడా రాసి పెట్టేవాడు. ఇతడిపై ‘బుచర్ ఆఫ్ ఢిల్లీ’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ కూడా విడుదలయింది.