Indian Languages: సంస్కృతాన్ని ప్రోత్సహించడానికి 11ఏళ్లలో 2,532కోట్లు ఖర్చు
ABN , Publish Date - Jun 25 , 2025 | 06:53 AM
సంస్కృత భాషను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014-15 నుంచి 2024-25 వరకు రూ.2,532.59 కోట్లు వెచ్చించింది.
తెలుగుకు 12 కోట్లు.. తమిళానికి 113 కోట్లు మాత్రమే
సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో వెల్లడి
న్యూఢిల్లీ, చెన్నై, జూన్ 24(ఆంధ్రజ్యోతి): సంస్కృత భాషను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2014-15 నుంచి 2024-25 వరకు రూ.2,532.59 కోట్లు వెచ్చించింది. ఇది ఇతర 5 భారతీయ ప్రాచీన భాషల(తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఒరియా)కు వెచ్చించిన రూ.147.56 కోట్ల కంటే 17 రెట్లు అధికం. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) దరఖాస్తు ద్వారా ఒక ఆంగ్ల పత్రిక ఈ వివరాలను సేకరించింది. ప్రాచీన భాషగా తొలుత(2004లో) గుర్తింపు పొందిన తమిళానికి గత 11 ఏళ్లలో జీపీఐఎల్(భారతీయ భాషల ప్రోత్సాహక గ్రాంట్లు) కింద రూ.113.48 కోట్లు మాత్రమే ఇచ్చారు.
తెలుగుకు రూ.12.65 కోట్లు, కన్నడకు రూ.12.28 కోట్లు, ఒరియాకు రూ.4.63 కోట్లు, మలయాళానికి రూ.4.52 కోట్లు మంజూరు చేశారు. ఇదే సమయంలో ఉర్దూకు రూ.837.94 కోట్లు, హిందీకి రూ.426.99 కోట్లు, సింధీకి రూ.53.03 కోట్లు వెచ్చించారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలపై సంస్కృత భాషను రుద్దడమే బీజేపీ అసలు లక్ష్యమని, హిందీ అనేది దానికి ఒక ముసుగు మాత్రమేనని అన్నారు. బీజేపీ పాలకులు తమిళంపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.