Celina Jaitly Brother: యూఏఈ జైల్లో సోదరుడు.. విడిపించమంటూ నటి కన్నీటి రిక్వెస్ట్..
ABN , Publish Date - Nov 24 , 2025 | 07:00 PM
బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ సోదరుడు మాజీ ఆర్మీ మేజర్ విక్రాంత్ జైట్లీని 2024లో యూఏఈ అదుపులోకి తీసుకుంది. అప్పటినుంచి ఆయన యూఏఈ జైల్లోనే ఉన్నాడు. సోదరుడి కోసం సెలెనా పోరాటం చేస్తోంది.
యూఏఈ జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించమంటూ బాలీవుడ్ నటి సెలెనా జైట్లీ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ కన్నీటి పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘నా సోదరుడు మేజర్ విక్రాంత్ జైట్లీని యూఏఈ జైల్లో పెట్టి సంవత్సరం పైనే అవుతోంది. మొదటి సారి విక్రాంత్‌ను అదుపులోకి తీసుకున్నపుడు 8 నెలల పాటు ఎవరితోనూ టచ్‌లో లేకుండా నిర్బంధంలో ఉంచారు. తర్వాత మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఎక్కడో ఉంచారు. నేను భయంతో అల్లాడిపోతున్నాను. అతడి స్వరం వినడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అతడి ముఖం చూడ్డానికి పరితపిస్తున్నాను.
విక్రాంత్‌ను ఏం చేశారోనని భయంగా ఉంది. ఆర్మీలో పని చేసినపుడు అతడు ఎన్నో గాయాలపాలయ్యాడు. తన యవ్వనాన్ని, శక్తిని, బుద్ధిని, ఆఖరికి తన జీవితాన్ని కూడా భారత దేశం కోసం త్యాగం చేశాడు. మన జెండా కోసం రక్తం చిందించాడు. అన్నా.. నిన్ను వెతకటం కోసం అన్నిటినీ పోగొట్టుకున్నాను. నేను ఈ పోరాటాన్ని ఆపను. నిన్ను ఈ భారత గడ్డపైకి తీసుకువచ్చే వరకు నా పోరాటం ఆపను. కాళికా మాతాకీ జై..’ అంటూ ఎమోషనల్ అయ్యింది.
సెలెనా అన్న విక్రాంత్ ఆర్మీలో మేజర్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఓ కేసులో ఆయనను యూఏఈ అదుపులోకి తీసుకుంది. 2024 నుంచి యూఏఈలోని జైల్లోనే ఉన్నారు. కానీ, ఆయన్ను ఎక్కడ ఉంచారన్నది తెలియరాలేదు. సెలెనా తన సోదరుడి కోసం గతంలో ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. సెలెనాకు సాయం చేయాలని విదేశీ వ్యవహారాల శాఖను కోర్టు ఆదేశించింది. అన్ని రకాలుగా విదేశీ వ్యవహారాల శాఖ సాయం చేసినా కూడా లాభం లేకుండా పోయింది.
ఇవి కూడా చదవండి
నగరంలో ఈ ప్రాంతాల్లో నిలిచిపోనున్న మంచినీటి సరఫరా..
శీతాకాలంలో రక్తపోటు పెరగకుండా ఈ 5 జాగ్రత్తలు తీసుకోండి.!