Share News

BrahMos: బ్రహ్మాస్త్రం ధాటికి బెంబేలు

ABN , Publish Date - May 12 , 2025 | 05:13 AM

పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులు కీలక పాత్ర పోషించాయి. ఈ దాడుల్లో పాక్ కీలక వైమానిక స్థావరాలు నేలమట్టం కావడంతో, అమెరికా జోక్యంతో చివరికి పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకుంది.

BrahMos: బ్రహ్మాస్త్రం ధాటికి బెంబేలు

పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ సర్వనాశనం

90 నిమిషాల్లో 10 వైమానిక స్థావరాలు నేలమట్టం

బ్రహ్మాస్త్రం ఎంత పనిచేసింది..? అదెంత తిరుగులేని అస్త్రమో రామాయణ, మహాభారతాల్లో చదివాం. కానీ భారత్‌.. రష్యాతో కలిసి రూపొందించిన బ్రహ్మోస్‌ క్షిపణి ఇప్పుడు పాకిస్థాన్‌ పాలిట బ్రహ్మాస్త్రమై.. దాని సైనిక పాటవాన్ని బదాబదలు చేసింది. ఉగ్ర దాడులతో పేట్రేగుతున్న దాయాదిని కాళ్లబేరానికి తీసుకొచ్చింది. తనంత తాను కాల్పుల విరమణకు ప్రాధేయపడేలా చేసింది. తెరవెనుక ఏం జరిగింది..? పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా భారత్‌ ప్రారంభించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మూడ్రోజులకే ఎలా ముగిసింది..? టర్కీ ఇచ్చిన డ్రోన్లు, క్షిపణులు, చైనా ఇచ్చిన జేఎఫ్‌-17 యుద్ధవిమానాలు, అమెరికా నుంచి కొన్న ఎఫ్‌-16 ఫైటర్లతో దాడులు చేసిన పాకిస్థాన్‌.. ఇంత తక్కువ వ్యవధిలోనే ఎందుకు శరణుజొచ్చింది..? శనివారం భీకర దాడులకు దిగుతామని భీషణ ప్రతిజ్ఞచేసిన పాక్‌ సైన్యాధికారులు తోకముడిచి కాల్పులు విరమిద్దామంటూ ఇండియాను వేడుకోవడానికి కారణమేంటి? ఈ ద్వైపాక్షిక సమరంతో తమకు సంబంధం లేదన్న అమెరికా.. ఆకస్మికంగా యుద్ధవిరమణకు ప్రయత్నాలు సాగించడానికి ప్రేరేపించింది ఏమిటి? ఇవి అందరి మెదళ్లనూ తొలుస్తున్న ప్రశ్నలు. వీటన్నిటికీ ఏకైక సమాధానం బ్రహ్మాస్త్రమే!


భారత్‌ ప్రయోగించిన బ్రహ్మోస్‌ క్షిపణులు పాకిస్థాన్‌ ఉగ్ర, సైనిక స్థావరాలను నేలమట్టం చేశాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఏడో తేదీ (మంగళవారం) మొదలైంది. ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరు (పీవోకే)ల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. కీలక నేతలు సహా 150 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. మరో 70 మంది గాయపడ్డారు. కేవలం 25 నిమిషాల ఆ ఆపరేషన్‌ కేవలం ఉగ్ర స్థావరాలకే పరిమితమైంది. అయినా భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో 8వ తేదీ అర్ధరాత్రి తర్వాత పాక్‌ సైన్యం ప్రతీకారంగా భారతీయ సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫల యత్నం చేసింది. ఇది ముందే ఊహించి సర్వసన్నద్ధంగా ఉన్న భారత సైన్యం.. ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో వాటన్నిటినీ నేలకూల్చింది. లాహోర్‌, సియాల్‌కోట్‌ సహా పాకిస్థాన్‌కు చెందిన తొమ్మిది ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సర్వనాశనం చేసింది.

GHK.jpg

కరాచీ పోర్టుపైనా విరుచుకుపడింది. 12 భారీ నౌకలను ధ్వంసం చేసి పాక్‌ను చావుదెబ్బ తీసింది దీంతో గురువారం పాక్‌ మరింత రెచ్చిపోయింది. సుమారు 400 టర్కీ డ్రోన్లతో 36 భారతీయ నగరాల్లోని సైనిక శిబిరాలపై దాడులకు యత్నించింది. సుఖోయ్‌, మిగ్‌ యుద్ధవిమానాల స్థావరమైన సిర్సా ఎయిర్‌ స్టేషన్‌పై ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దానిని భారత్‌ ఎస్‌-400 రక్షణ వ్యవస్థ నిర్వీర్యం చేసింది.


అయితే దీనిని ప్రధాని మోదీ తీవ్రంగా పరిగణించారు. పాక్‌ వైమానిక స్థావరాలన్నిటినీ నేలమట్టం చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. ఆయన నిర్దేశంతో 10వ తేదీన భారత సైన్యం నిర్ణయాత్మక దాడికి దిగింది. సుదూర లక్ష్యాలను ఛేదించే బ్రహ్మోస్‌ క్షిపణులతో రాఫెల్స్‌ పాక్‌ గగనతలంలోకి దూసుకెళ్లాయి. ఆ దేశవ్యాప్తంగా పది కీలక వైమానిక స్థావరాలను సర్వనాశనం చేశాయి. వీటిలో ఇస్లామాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో.. రావల్పిండి పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ సమీపాన ఉన్న నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ కీలకమైనది. ఇది సమూలంగా నాశనమైందని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ తన కథనంలో పేర్కొంది. అలాగే పాక్‌ యుద్ధవిమానాలకు నిలయమైన రఫికీ స్థావరం కూడా నేలమట్టమైనట్లు తెలిపింది. రాఫెల్‌ ఫైటర్లకు అమర్చిన బ్రహ్మోస్‌ క్షిపణులు.. హ్యామర్‌, స్కాల్ప్‌ మిస్సైళ్ల తోడ్పాటుతో కేవలం 90 నిమిషాల్లో ఈ రెంటితోపాటు పంజాబ్‌లోని మురీద్‌, సియాల్‌కోట్‌, పస్రూర్‌, సర్గోధా.. సింధ్‌లోని సుక్కూర్‌, జాకోబోబాద్‌ (సింధ్‌), కరాచీ సమీపంలోని భొలోరీ, పీవోకేలోని స్కర్దూ ఎయిర్‌బే్‌సలలో బీభత్సం సృష్టించాయి. రన్‌వేల ఆనవాళ్లు కూడా కనబడనంతగా ధ్వంసం చేసేశాయి. పాక్‌ సేనలకు గగనతల సంబంధాలను తెంచేశాయి. అలాగే శత్రువుల క్షిపణులు, ఫైటర్లను పసిగట్టే పంజాబ్‌ చునియాన్‌లోని రాడార్‌ కేంద్రాన్ని కూడా నేలమట్టంచేశాయి. గతంలో యుద్ధాల సమయంలో కూడా ఇంత అసాధారణ రీతిలో భారత్‌ దాడిచేయలేదు. దీంతో పాక్‌ నేతలు బెంబేలెత్తారు. సైన్యాధికారులు కూడా స్థైర్యం కోల్పోయారు. ఈ వైమానిక స్థావరాలన్నీ పాక్‌ సేనలకు ఆయువుపట్టులాంటివే. మురీద్‌ ఎయిర్‌బే్‌సలోనే దాని క్షిపణులన్నీ ఉంటాయి. ఇక్కడే ఫైటర్‌ పైలట్ల శిక్షణ కేంద్రం కూడా ఉంది. ఫైటర్‌ షెల్టర్లు, రన్‌వే, తదితర మౌలిక వసతులన్నీ నాశనమయ్యాయి. దీంతో భారత్‌కు వ్యతిరేకంగా వైమానిక దాడులకు దిగే సామర్థ్యం పాక్‌ కోల్పోయింది.


సర్గోధా బేస్‌ ధ్వంసం కచ్చితంగా వ్యూహాత్మక మాస్టర్‌స్ట్రోకేనని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడే పాక్‌ కంబాట్‌ కమాండర్స్‌ స్కూలు, నూక్లియర్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలు, ఎలెట్‌ స్క్వాడ్రన్లకు నిలయం. వీటి నాశనంతో పాక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ స్ట్రక్చర్‌ను బలహీనపరచింది. స్కర్దూ స్థావరం ఉత్తరాన నియంత్రణ రేఖ వెంబడి పాక్‌కు నిఘా కేంద్రం.

సుక్కూర్‌ బేస్‌ దక్షిణాన ఎయిర్‌ కారిడార్‌. సింధ్‌, బలూచిస్థాన్‌లలో బలగాలు, ఆయుధాల రవాణాకు ముఖ్యమైన స్థావరం. భొలోరీ స్థావరం నేలమట్టం కావడంతో కరాచీ రేవుపై అవలీలగా దాడులు చేసే వెసులుబాటు ఏర్పడింది.

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌ పాక్‌ మిలిటరీ కీలక రవాణా హబ్‌లలో ఒకటి. యుద్ధవిమానాలకు ఇంధనం నింపే కేంద్రం. యుద్ధ సమయాల్లో పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధిపతులకు, ఆపరేషన్‌ యూనిట్లతో సంధానపరిచే స్థావరమిది. రఫికీ ఎయిర్‌బే్‌సలోనే పాక్‌ ఫ్రంట్‌లైన్‌ ఫైటర్‌ జెట్లన్నీ ఉంటాయి. దీనికి కూతవేటు దూరంలోనే పాక్‌ అణ్వస్త్రాలను సంరక్షించే స్ట్రాటజిక్‌ ప్లాన్స్‌ డివిజన్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఉంది.


అమెరికా, పాక్‌ నేతల్లో కలవరం..

రఫికీ, నూర్‌ఖాన్‌ ఎయిర్‌ బేస్‌లను ఎప్పుడైతే బ్రహ్మోస్‌ క్షిపణులు నాశనం చేశాయో.. అమెరికా కలవరం ఒక్కసారిగా పతాకస్థాయికి చేరిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. తదుపరి దాడిలో భారత్‌ తమ అణు కమాండ్‌-కంట్రోల్‌ మౌలిక వసతులను టార్గెట్‌ చేయబోతోందని పాక్‌ రక్షణ నెట్‌వర్క్‌లు కూడా హడావుడిగా పరస్పరం పెద్దఎత్తున హైఅలర్ట్‌ సందేశాలు పంపుకోవడాన్ని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇదే సమయంలో పాక్‌ నాయకత్వం అత్యవసర జోక్యానికి అమెరికాను అభ్యర్థించింది. ఎప్పుడైతే వ్యూహాత్మక అణు కేంద్రాలపై భారత్‌ దాడిచేసి చేజిక్కించుకోనుందన్న సమాచారం రాగానే అమెరికా అప్రమత్తమైంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలతో ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో.. శుక్రవారం వేకువఝామున నేరుగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఎందుకంటే పాక్‌ ప్రధాని షరీఫ్‌ మాటలను ఆయన లక్ష్యపెట్టడం లేదు. తక్షణమే వెనక్కి తగ్గాలని, కాల్పుల విరమణకు అంగీకరించాలని.. లేదంటే శనివారం భారత్‌ మరింత భీకరంగా దాడిచేస్తుందని.. పాక్‌ అణ్వస్త్ర కేంద్రాలన్నిటినీ చేజిక్కించుకుంటుందని రుబియో హెచ్చరించారు. విధిలేక మునీర్‌ ఇందుకు అంగీకరించారు. అయితే నేరుగా పాక్‌ పాలకులతో గానీ, సైన్యాధిపతులతో గానీ చర్చించేందుకు భారత నాయకత్వం ససేమిరా అన్నది. కాల్పుల విరమణపై డీజీఎంవో స్థాయిలోనే మాట్లాడుకోవాలని.. పాక్‌ పాలకులతో తాము మాట్లాడేందుకు ఏమీ లేదని తెగేసి చెప్పింది. మున్ముందు ఒక్క ఉగ్ర దాడి జరిగినా దానిని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని.. ఇలాగే తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని తేల్చిచెప్పింది. దరిమిలా మునీర్‌ తన డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాషిఫ్‌ అబ్దుల్లాను రంగంలోకి దించారు. ఆయన మధ్యాహ్నం 3.35 గంటలకు భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘయీతో హాట్‌లైన్లో మాట్లాడారు. తక్షణమే కాల్పులు విరమిద్దామని ప్రతిపాదించారు. అయితే సోమవారం పూర్తిస్థాయిలో చర్చలు జరుపుదామని.. దానికి ముందు రెండ్రోజులు కాల్పుల విరమణ పాటిద్దామని రాజీవ్‌ స్పష్టంచేశారు. అందుకు పాక్‌ అంగీకరించడంతో దాడులు ఆగాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ కూడా ధ్రువీకరించారు. మరోవైపు.. సోమవారం నాటి కీలక భేటీలో కాల్పుల విరమణ షరతులపై డీజీఎంవోలు చర్చించనున్నారు.

- సెంట్రల్‌ డెస్క్‌.


జైషే హెడ్‌క్వార్టర్స్‌పైనా బ్రహ్మోస్‌ దాడి!

‘ఆపరేషన్‌ సింధూర్‌’ తొలి రోజు కూడా భారత్‌ బ్రహ్మోస్‌ క్షిపణులను ప్రయోగించిందా? భారత్‌-పాక్‌ సరిహద్దులోని బికనీర్‌లోని ఓ మారుమూల ప్రాంతంలో బ్రహ్మోస్‌ బూస్టర్‌ అవశేషం కనిపించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇది పాక్‌ బలగాలు, పాలకులను మరింత కలవరానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఉగ్రవాద స్థావరాలపైనా బ్రహ్మాస్త్రాలను ప్రయోగిస్తే వాటి ఆనవాళ్లయినా కనిపించనంతగా నాశనమైపోతాయి. ఏడో తేదీ అర్ధరాత్రి పాక్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీరుల్లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 150 మంది టెర్రరిస్టులు హతమైనట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. దాడులు చేసిన వాటిలో పంజాబ్‌లోని బహావల్‌పూర్‌ కూడా ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్‌ ఆజార్‌ సారథ్యంలోని జైషే మహమ్మద్‌ ప్రధాన స్థావరం ఇక్కడే ఉంది. అతడి కీలక బంధువులంతా ఈ దాడిలో చనిపోయారు. బ్రహ్మో్‌సతోనే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. బికనీర్‌ సమీపాన మిస్సైల్‌ బూస్టర్‌, నోస్‌క్యాప్‌ శిథిలాలు లభించడంతో ఈ అంచనాకు వచ్చారు.


అణ్వస్త్రాల కోసం కమాండ్‌ కంట్రోల్‌ స్ట్రక్చర్‌

పాకిస్థాన్‌ తన అణ్వస్త్రాల నిర్వహణ-అజమాయిషీ కోసం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ స్ట్రక్చర్‌ను ఏర్పాటుచేసుకుంది. ఇది మూడంచెలు.. నేషనల్‌ కమాండ్‌ అథారిటీ (ఎన్‌సీఏ), స్ట్రాటజిక్‌ ప్లాన్స్‌ డివిజన్‌ (ఎస్‌పీడీ), స్ట్రాటజిక్‌ ఫోర్స్‌ కమాండ్స్‌ (ఎస్‌ఎ్‌ఫసీ)గా ఉంటుంది. ప్రధాని సారథ్యంలో ఎన్‌సీఏ ఉంటుంది. జాతీయ అణువిధానం రూపకల్పన, అణ్వస్త్రాల ప్రయోగ అధికారం అప్పగింత జారీ దీని బాధ్యతలు. బ్రహ్మోస్‌ దాడులతో బెంబేలెత్తిన ప్రధాని షరీఫ్‌ శనివారం ఎన్‌సీఏ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు కూడా. అయితే భారత్‌పై అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని ఆయన మంత్రులు కొందరు ఇటీవల పదే పదే మేకపోతు గాంభీర్యంతో చేసిన వ్యాఖ్యలను ప్రజలెవరూ పట్టించుకోలేదు. దీంతో ఎన్‌సీఏ భేటీకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది.


Read Also: Ranveer Allahbadia: ఆపరేషన్ సిందూర్.. అనవసర పోస్టు పెట్టి చిక్కుల్లో పడ్డ రణవీర్ అల్లాహ్‌బాదియా

Operation Sindoor: ఉగ్రవాదుల అంతమే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం.. భారత సైన్యం
Operation Sindoor: ఆర్మీ కమాండర్లకు ఫుల్ పవర్

Updated Date - May 12 , 2025 | 05:13 AM