Bomb Threat On IndiGo Flight: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వకుండానే..
ABN , Publish Date - Nov 01 , 2025 | 05:53 PM
ఈ మధ్య కాలంలో విమానాలకు బాంబు బెదిరింపులు బాగా పెరిగిపోయాయి. తాజాగా, జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానం దారి మళ్లింది.
మానవ బాంబు బెదిరింపుల నేపథ్యంలో జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం దారి మళ్లింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వకుండానే ముంబైకి వెళ్లిపోయింది. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టు తెలిపిన వివరాల మేరకు.. ఎయిర్ పోర్టు అధికారులకు శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో.. ‘జెడ్డానుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్ 6ఈ 68లో మానవ బాంబు ఉంది.
1984లో మద్రాస్ ఎయిర్ పోర్టులో జరిగిన బాంబు దాడి స్టైల్లో ఈ దాడి జరుగుతుంది. ఎల్‌టీటీఈ.. ఐఎస్ఐ ఈ దాడికి ప్లాన్ చేసింది’ అని రాసి ఉంది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. సదరు విమానానికి సమాచారం ఇచ్చారు. మానవ బాంబు దాడి బెదిరింపుల నేపథ్యంలోనే ఆ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వలేదు. అటు నుంచి అటే ముంబై వెళ్లిపోయింది.
ఇండిగో అధికార ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో.. ‘ నవంబర్ 1వ తేదీన ఇండిగో ఫ్లైట్ 6ఈ 68కు బాంబు బెదిరింపు వచ్చింది. జెడ్డా నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం ముంబై వెళ్లిపోయింది. ప్రోటాకాల్ ప్రకారం మేము సంబంధిత అధికారులకు విషయం చెప్పాము. వారికి పూర్తిగా సహకరించాము. సెక్యూరిటీ చెక్స్ పూర్తి చేశాం’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? అయితే, ఈ స్మూతీ ట్రై చేయండి..
ట్రక్కు నిండా కుప్పలుగా డబ్బు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరేశాడు..