Boeing Aircraft: ప్రమాదాల బోయింగ్..!
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:51 AM
Boeing Aircraft: అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటనతో బోయింగ్ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
ఎగిరే శవపేటికల్లా విమానాలు..
కొన్నేళ్లుగా వరుసగా దుర్ఘటనలు..
నాణ్యత, భద్రతా ప్రమాణాల్లో లోపాలు
ఆ సంస్థ ఉద్యోగులే స్వయంగా బయటపెట్టినా మారని తీరు
సునీతా విలియమ్స్ ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోవడానికీ ఇదే కారణం
ప్రస్తుతం భారత ఎయిర్‌లైన్స్ సంస్థల వద్ద 185 బోయింగ్ విమానాలు..
మరో 645 విమానాలకు ఆర్డర్లు
అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయిన ఘటనతో బోయింగ్ సంస్థ విమానాల పనితీరుపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవలికాలంలో విమానాల్లో సాంకేతిక లోపాల నుంచి తలుపులు ఊడిపోవడం వంటి నిర్మాణ లోపాల దాకా వరుస ఘటనలు ఆ విమానాల భద్రతా ప్రమాణాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాస్తవానికి బోయింగ్ సంస్థలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులే.. విమానాల భద్రతా ప్రమాణాల పట్ల ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును బయటపెట్టారు. ఆ ఘటనలతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) బోయింగ్ విమానాల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ క్రమంలో భద్రతా ప్రమాణాల లోపాన్ని అంగీకరిస్తూ.. బోయింగ్ సీఈవో డేవ్ కాల్హోన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థలో 737 విమానాల విభాగం చీఫ్ ఎడ్ క్లార్క్ కూడా వైదొలిగారు.
సీఈవోలు మారినా.. భద్రత లేక..
వాస్తవానికి డేవ్ కాల్హోన్‌కు ముందు డెన్నిస్ ములెన్‌బర్గ్ బోయింగ్ సీఈవోగా పనిచేశారు. 2018, 2019లలో రెండు 737 మ్యాక్స్ 8 విమానాలు కూలిపోయి 346 మంది మరణించడంతో.. బోయింగ్ విమానాల భద్రతపై విమర్శలు చెలరేగాయి. ఆ రెండు విమానాలు కూడా టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడం గమనార్హం. దీనితోబోయింగ్ సంస్థ డెన్నిస్ ములెన్‌బర్గ్‌ను తొలగించింది. సీఈవోగా డేవ్ కాల్హోన్‌ను నియమించింది. భద్రతా ప్రమాణాలను పెంచి సంస్థపై నమ్మకాన్ని తిరిగి నిలబెడతానంటూ పదవిని చేపట్టిన ఆయన.. అదే భద్రతా లోపంతో రాజీనామా చేయడం గమనార్హం. 2024 జనవరిలో అమెరికాలోని అలాస్కాలో ప్రయాణిస్తున్న బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం గాలిలో ఉండగానే దాని డోర్ ఊడిపోయింది. అదే ఏడాది డిసెంబర్‌లో దక్షిణ కొరియాలో బోయింగ్ 737-800 విమానం కూలిపోయి 179 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్‌లో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కూలిపోయింది. ప్రస్తుతం బోయింగ్ సీఈవోగా కెల్లీ ఓర్ట్‌బెర్గ్ పనిచేస్తున్నారు.
సునీతా విలియమ్స్ చిక్కుకుపోవడానికీ..
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు తొమ్మిది నెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎ్‌స)లో చిక్కుకుపోవడానికి కూడా బోయింగ్ సంస్థ వైఫల్యమే కారణం. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రా్‌ఫ్టలో థ్రస్టర్లు సరిగా పనిచేయకపోవడం, హీలియం లీకేజీ సమస్యలు తలెత్తాయి. వాటిని సరిదిద్దడానికి బోయింగ్, నాసా ఎంతగా ప్రయత్నించినా వీలుకాలేదు. చివరికి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన క్రూ-9 మిషన్ సాయంతో వారిని భూమ్మీదికి తీసుకురావాల్సి వచ్చింది.
మన ఎయిర్‌లైన్స్‌లో బోయింగ్ విమానాలెన్నో..
ప్రస్తుతం మన దేశ ఎయిర్‌లైన్స్ సంస్థలు సుమారు 185 బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నాయి. బోయింగ్ 737 మ్యాక్స్, 777-200 ఎల్‌ఆర్, 777-300ఈఆర్, 787-8 డ్రీమ్‌లైనర్, 787-9 డ్రీమ్‌లైనర్ విమానాలను వాడుతున్నాయి. విదేశాలకు సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా వద్ద మొత్తం 198 విమానాలుంటే అందులో 40 బోయింగ్‌వే, దేశీయ సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వద్ద ఉన్న మొత్తం 104 విమానాలూ బోయింగ్‌వే. ఇండిగో సంస్థ 437 విమానాలతో సర్వీసులు నిర్వహిస్తుండగా అందులో ఎనిమిది, స్పైస్‌జెట్ వద్ద ఉన్న 62 విమానాల్లో 33 విమానాలు (లీజుకు తీసుకున్నవి కలిపి) బోయింగ్ కంపెనీవే. అంతేకాదు ఈ సంస్థలు పెద్ద సంఖ్యలో బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు కూడా పెట్టాయి. ఎయిర్ ఇండియా సుమారు 290 విమానాలకు ఆర్డర్ పెట్టింది. స్పైస్‌జెట్ గతంలోనే 205 విమానాలకు ఆర్డర్ పెట్టగా.. గత ఏడాది డిసెంబర్ నాటికి 13 విమానాలు డెలివరీ అయ్యాయి. తర్వాత స్పైస్‌జెట్‌కు ఆర్థిక ఇబ్బందులతో నిలిచిపోయింది. విమానాల కొనుగోలును పునరుద్ధరించుకోవాలని తాజాగా ఆ సంస్థ నిర్ణయించింది. ఇక కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్ సంస్థ కూడా 150 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ చేసింది.
ఆఖరి సెల్ఫీ..

ఎయిరిండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ఓ కుటుంబం దుర్మరణం చెందింది. రాజస్థాన్‌లోని బన్సవారాలో పేరొందిన వైద్యురాలైన డాక్టర్ కోని వ్యాస్.. తన భర్త ప్రదీప్ జోషి, తమ ముగ్గురు పిల్లలతో కలిసి లండన్‌లో స్థిరపడాలని ఎంతోకాలంగా అనుకుంటున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి కావడంతో రెండ్రోజుల క్రితమే వ్యాస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. లండన్ వెళ్లేందుకు కుటుంబం అంతా కలిసి అహ్మదాబాద్‌లో గురువారం విమానం ఎక్కారు. ఆ వెంటనే వారంతా ఓ సెల్ఫీ తీసుకుని కుటుంబసభ్యులు, స్నేహితులకు పంపి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాసేపటికే ఆ విమానం కూలడంతో వారంతా లోకాన్ని వీడారు.
మిగతా సర్వీసులపై ప్రభావం..
అహ్మదాబాద్, జూన్ 12: గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే కూలిపోవడంతో మిగతా విమాన సర్వీసులపై ప్రభావం పడింది. ప్రయాణ సమయాల్లో తాజా మార్పులకు సంబంధించి ప్రయాణికులు తమ ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించాలంటూ అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రయాణికులు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్ల తాలూకు మొత్తాన్ని తమ వెబ్‌సైట్ ద్వారా తిరిగి పొందవచ్చని ఇండిగో ఎక్స్‌లో పోస్ట్ చేసింది. టికెట్‌లు మళ్లీ బుక్ చేసుకోవాలని కూడా సూచించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో అన్ని విమాన సర్వీసులను నిలిపివేసినట్లు స్పైస్ జెట్ ప్రకటించింది. విమానాలకు సంబంధించిన తాజా సమాచారం తమ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవాలని సూచించింది. మరోవైపు కోల్‌కతా నుంచి బయలుదేరి అహ్మదాబాద్‌లో దిగాల్సిన ఇండిగో 6ఈ- 318 విమానం.. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నేపథ్యంలో తిరిగి వెనక్కు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ల్యాండయింది. మధ్యాహ్నం 1:49కు కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి తిరిగి కోల్‌కతాలో 2:52కు దిగింది.
ప్రయాణికుల కుటుంబ సభ్యుల కోసం సహాయక విమానాలు
విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు, సిబ్బంది కుటుంబ సభ్యుల కోసం ఎయిర్ ఇండియా రెండు ప్రత్యేక విమానాలు నడపనుంది. ఢిల్లీ, ముంబై నుంచి అహ్మదాబాద్‌కు సహాయక విమాన సర్వీసులు ఏర్పాటు చేసింది.