BJP Amar Kishore Kashyap: పార్టీ మహిళా కార్యకర్తతో బీజేపీ సీనియర్ నేత అసభ్య ప్రవర్తన
ABN , Publish Date - May 26 , 2025 | 09:03 AM
యూపీలో ఓ సీనియర్ బీజేపీ నేత పార్టీ మహిళ కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ కావడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీలో ఓ సీనియర్ బీజేపీ నేత మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఏప్రిల్ 12న గోండా నగరంలోని పార్టీ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీనియర్ నేత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అమర్ కిశోర్ కశ్యప్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మెట్లపై నిలబడి ఓ మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వీడియోలో రికార్డయ్యింది. మరో పార్టీ నేత ఈ విషయంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. కశ్యప్ ప్రవర్తన పార్టీకి తలవంపులు తెస్తోందని ఆ నేత అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం కశ్యప్‌కు షో కాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ ఆరోపణలను బీజేపీ నేత కశ్యప్ కొట్టి పారేశారు. ఇదంతా తనపై ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తనంటే గిట్టని వాళ్లు వదంతలు వ్యాపిస్తున్నారని మండిపడ్డారు. ‘‘వీడియోలోని మహిళ మా పార్టీ కార్యకర్త. ఆ రోజు ఆమెకు ఆరోగ్యం బాగాలేదు. రెస్టు తీసుకునేందుకు స్థలం చూపించమని చెప్పింది. దీంతో, ఆఫీసుకి తీసుకెళ్లాను. మెట్లు ఎక్కుతుండగా ఆమెకు కళ్లు తిరిగాయి. అప్పుడు నేను హెల్ప్ చేశాను. కానీ ఆ ఫుటేజీ సాయంతో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని కశ్యప్ అన్నారు.
వీడియో వైరల్ అయిన వెంటనే కశ్యప్ తన వివరణ ఇచ్చుకున్నా కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకుంది. పార్టీ జనరల్ సెక్రెటరీ గోవింద్ నారాయణ్ శుక్లా కశ్యప్‌కు షో కాజ్ నోటీసులు జారీ చేశారు. పార్టీ ఇమేజీపై ఈ ఉదంతం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ‘‘వైరల్ వీడియోతో వెలుగులోకొచ్చిన ఉదంతం పార్టీ పరువుకు భంగం కలిగించేలా ఉంది. కాబట్టి, ఇది క్రమశిక్షణ రాహిత్యం కిందకు వస్తుంది’’ అని నోటీసుల్లో రాసుంది. ఈ లేఖకు ఏడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం చెప్పాలని కూడా రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేసింది. సంతృప్తికరమైన జవాబు ఇవ్వని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది.
ఇవీ చదవండి:
జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు
సాటి సైనికుడిని కాపాడే క్రమంలో ఆర్మీ ఆఫీసర్ మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి