Share News

Rajnath Singh: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:45 AM

ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార, విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా సీనియర్‌ నేతలు సుధీర్ఘంగా చర్చలు జరిపారు.

Rajnath Singh: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం

  • నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. రేసులో రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం అధికార, విపక్ష పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నివాసంలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా సీనియర్‌ నేతలు సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతోంది. ఇందులో ప్రధానంగా ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపైనే చర్చ జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రధాని మోదీతోపాటు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, తెలంగాణకు చెందిన ఎంపీ లక్ష్మణ్‌తో పాటు ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే స్పష్టతకు వచ్చిన కొన్ని పేర్లపై చర్చించి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాల ద్వారా తెలిసింది.


ఇందులో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్‌ దన్‌ఖడ్‌ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో భర్తీ చేస్తారనే ప్రచారమూ జరుగుతోంది. ప్రస్తుతం రేసులో ఉన్న గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ జాట్‌ వర్గానికి చెందిన వ్యక్తే. ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా, బిహార్‌ గవర్నర్‌ ఆరిఫ్‌ ఖాన్‌, కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, సిక్కిం గవర్నర్‌ ఓం మాథుర్‌, జమ్మూకశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌ సిన్హా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త శేషాద్రి చారి అభ్యర్థిత్వంపైనా చర్చిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబరు 21న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.

Updated Date - Aug 17 , 2025 | 05:45 AM