Share News

Kamaraj Plan BJP: బీజేపీలో కామరాజ్‌ ప్లాన్‌

ABN , Publish Date - Sep 07 , 2025 | 06:23 AM

జాతీయ స్థాయిలో బీజేపీ కామరాజ్‌ ప్లాన్‌ను అమలు చేయనుందా!? పదేళ్లుగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వారిని పార్టీలోకి.. పార్టీలో ఉన్న....

Kamaraj Plan BJP: బీజేపీలో కామరాజ్‌ ప్లాన్‌

  • పదేళ్లుగా క్యాబినెట్లో ఉన్నవాళ్లు పార్టీలోకి.. పార్టీలో సీనియర్లు ప్రభుత్వంలోకి

  • ప్రజల్లోకి తరం మార్పు జరిగిందనే సంకేతాలు.. ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతల ఆలోచన

  • న్యూఢిల్లీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో బీజేపీ కామరాజ్‌ ప్లాన్‌ను అమలు చేయనుందా!? పదేళ్లుగా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న వారిని పార్టీలోకి.. పార్టీలో ఉన్న ముఖ్య నాయకులను ప్రభుత్వంలోకి తీసుకోనుందా!? తద్వారా, ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ కొత్త వారికి అవకాశం కల్పించనుందా!? ఈ ప్రశ్నకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసిన తర్వాత పార్టీ అగ్ర నేతలు ఈ అంశంపై దృష్టి సారించనున్నారని వివరించాయి. ప్రభుత్వంలో చిరకాలం ఉన్న నాయకులు పార్టీలోకి.. పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులు ప్రభుత్వంలోకి వెళ్లినప్పుడే కొత్త వారికి అవకాశాలు లభిస్తాయంటూ ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ అధ్యక్షుడు కామరాజ్‌ రూపొందించిన ప్రణాళికను ఇప్పుడు బీజేపీ తనదైన శైలిలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. మోదీ క్యాబినెట్లో మొదటి నుంచీ కొనసాగుతున్న.. అధికార యంత్రాంగం నుంచి మంత్రి వర్గంలోకి చేరిన మంత్రుల్లో అత్యధికులను తప్పించి.. ఇప్పటి వరకూ పార్టీ సేవకే అంకితమైన వారిని క్యాబినెట్లో చేర్చుకునే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ ప్రణాళికకు తుది రూపకల్పన జరిగిన వెంటనే మోదీ తన మంత్రివర్గ సభ్యులతో రాజీనామా చేయించే అవకాశాలున్నాయని, ఆ తర్వాత సాధ్యమైనంత మేరకు కొత్త ముఖాలతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే, క్యాబినెట్లోనే కాకుండా పార్టీలోనే కొనసాగుతున్న మరి కొంతమందికి వివిధ స్థాయుల్లోనూ అవకాశాలు కల్పిస్తారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువకులు, అనుభవజ్ఞులకు సమానంగా అవకాశం ఇవ్వాలని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తరం మార్పు జరిగిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు.


  • ఇప్పటి వరకూ పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించే పద్ధతి బీజేపీలో ఉందని, కానీ, పార్టీ నుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి పార్టీకి నాయకులను బదిలీ చేసి వారి సేవలను ఉపయోగించుకునే ప్రక్రియను అంతగా అమలు చేయలేదని పార్టీ నేత ఒకరు చెప్పారు. తద్వారా, పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా మరింత బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన వివరించారు. కాగా, ఈ ప్రణాళికను అమలు చేస్తే కేంద్ర క్యాబినెట్లో దాదాపు 30 మంది మంత్రులను తప్పించాల్సి వస్తుందని తెలుస్తోంది. వీరిలో అత్యధికులు 2014 నుంచీ మంత్రి పదవిలో ఉన్నవారు ఉండవచ్చని సమాచారం. ఇక, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం చర్చలో ఉన్న పేర్లు కాక కొత్త వ్యక్తిని ముందుకు తీసుకువచ్చినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకూ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితరుల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడి టీమ్‌లో కూడా అనేక కొత్త ముఖాలకు ఆస్కారం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం

అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్

For More National News And Telugu News

Updated Date - Sep 07 , 2025 | 08:55 AM