Share News

Bihar Seat Distribution Tensions: బిహార్‌లో ముదిరిన సీట్ల పేచీ

ABN , Publish Date - Oct 10 , 2025 | 05:07 AM

బిహార్‌లో అసెంబ్లీ సీట్ల పంపకాల పేచీ ముదురుతోంది. శుక్రవారం నుంచే నామినేషన్ల పర్వం మొదలవుతున్నా..

Bihar Seat Distribution Tensions: బిహార్‌లో ముదిరిన సీట్ల పేచీ

  • ఎన్డీయేలో పాశ్వాన్‌, మాంఝీతో.. మహాఘట్‌బంధన్‌లో సీపీఐ ఎంఎల్‌తో తలనొప్పి

  • నేటి నుంచే నామినేషన్లు

  • ఇప్పటికీ తేలని సీట్ల పంపకాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): బిహార్‌లో అసెంబ్లీ సీట్ల పంపకాల పేచీ ముదురుతోంది. శుక్రవారం నుంచే నామినేషన్ల పర్వం మొదలవుతున్నా.. ఇంకా అధికార ఎన్డీయేలోగానీ, ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌లోగానీ సీట్ల పంపకాలు తేలలేదు. ఎన్డీయేలో లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నేత చిరాగ్‌ పాశ్వాన్‌ 30 సీట్లకు తగ్గనని పట్టుబడుతుండగా, హిందూస్తాన్‌ ఆవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) నేత జితిన్‌రాం మాంఝీ కనీసం 15 సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఎల్‌జేపీకి 20, హెచ్‌ఏఎంకు 8 సీట్లు ఇస్తామని బీజేపీ, జేడీయూ ప్రతిపాదించాయి. సీట్ల కేటాయింపుపై ఢిల్లీలో చిరాగ్‌ పాశ్వాన్‌తో బీజేపీ బిహార్‌ ఎన్నికల ఇన్‌చార్జి ధర్మేం ద్ర ప్రధాన్‌, ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే, బిహార్‌ నేత మంగళ్‌పాండే చర్చలు జరుపుతున్నారు. మరోవైపు జితిన్‌రాం మాంఝీని బుజ్జగించేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రయత్నిస్తున్నారు.


ఈ నెల 12కల్లా మిత్రపక్షాలతో చర్చలు ముగుస్తాయని, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై 13న అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీయే కూటమి వర్గాల ప్రకారం.. జేడీయూ 102 సీట్లలో, బీజేపీ 101, ఎల్‌జేపీ 20-25, హెచ్‌ఏఎం 8-10, రాష్ట్రీయ లోక్‌ మోర్చా 5-7 సీట్లలో పోటీ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు ప్రతిపక్ష మహాఘట్‌బంధన్‌ కూటమిలో కీలకమైన ఆర్జేడీ, కాంగ్రెస్‌ మధ్య ఎక్కువ సీట్ల కోసం పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గురువారం సాయంత్రం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో చర్చలు జరిపారు. ఇక సీపీఐఎంఎల్‌కు 19 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధమైనా.. 30 సీట్లు కావాల్సిందేనని ఆ పార్టీ పట్టుబడుతోంది. కూటమి వర్గాల మేరకు.. ఆర్జేడీ, సీపీఐఎంఎల్‌ కలసి 130-133, కాంగ్రెస్‌ 55-58, వీఐపీ 14-1,8 జేఎంఎం 2-3 సీట్లు, ఆర్‌ ఎల్‌జేపీ 0-2 సీట్లలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనాలను దుర్వినియోగం చేయవద్దని ఈసీ పేర్కొంది.

Updated Date - Oct 10 , 2025 | 05:12 AM