Couple Chase Ram Biker: దంపతుల క్రూరత్వం.. సైడ్ మిర్రర్ విరగ్గొట్టారని కారుతో వెంబడించి..
ABN , Publish Date - Oct 30 , 2025 | 03:45 PM
ఓ భార్యాభర్తల జంట క్రూరత్వం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కారు సైడ్ మిర్రర్ విరగ్గొట్టారన్న కోపంతో ఇద్దరు యువకులు ప్రయాణిస్తున్న బైకును ఆ దంపతులు తమ కారుతో ఢీకొట్టారు. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు.
కారు సైడ్ మిర్రర్ విషయంలో గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ యువకుడిని భార్యాభర్తల జంట కారుతో ఢీకొట్టి చంపేసింది. ఈ దారుణ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన మనోజ్ కుమార్, ఆర్తీ శర్మ భార్యాభర్తలు. అక్టోబర్ 25వ తేదీ రాత్రి భార్యాభర్తలిద్దరూ కారులో రోడ్డుపై వెళుతూ ఉన్నారు. అదే రోడ్డుపై దర్శన్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి బైకుపై వెళుతూ ఉన్నాడు. దర్శన్ బైకు నడుపుతుండగా వరుణ్ వెనకాల కూర్చున్నాడు.
ఈ నేపథ్యంలోనే పుట్టెనహళ్లి ఏరియాలో వీరి బైకు మనోజ్ దంపతులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. సైడ్ మిర్రర్ విరిగింది. ఇది గుర్తించిన దర్శన్ బైకును ఆపకుండా వేగంగా ముందుకుపోనిచ్చాడు. మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. కారుతో బైక్‌ను ఛేజ్ చేశాడు. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ఛేజింగ్ జరిగింది. ఓ వీధిలో మనోజ్ తన కారుతో బైకును ఢీకొట్టాడు. బైకు గాల్లోకి ఎగిరి దూరంగా పడింది. బైకుపై ఉన్న ఇద్దరూ కూడా దూరంగా వెళ్లి రోడ్డుపై పడ్డారు. దర్శన్, వరుణ్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దర్శన్ అక్కడికక్కడే చనిపోయాడు.
బైకును ఢీకొట్టిన తర్వాత మనోజ్ దంపతులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చే సమయానికి తీవ్రంగా గాయపడ్డ వరుణ్‌ను రోడ్డుపై వెళుతున్న వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత దర్శన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మొదట రోడ్ యాక్సిడెంట్‌గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీలు పరిశీలించి చూడగా అది మర్డర్ అని తేలింది. మర్డర్ కేసు నమోదు చేశారు. మనోజ్, ఆర్తీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ ఆహారాలు తీసుకున్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?.. అయితే జాగ్రత్త..
వరంగల్‌ను ముంచెత్తిన తుపాను.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు