Kolkata: లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్
ABN , Publish Date - Jun 28 , 2025 | 05:01 AM
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. లా (న్యాయశాస్త్రం) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (24) తన కాలేజీలోనే సామూహిక అత్యాచారానికి గురయ్యారు.
కోల్‌కతాలో దారుణం
కాలేజీలోని సెక్యూరిటీ గార్డ్ గదిలోనే కిరాతకం
ఓ విద్యార్థి ఘాతుకం.. మరో ఇద్దరి సహకారం
వారిలో ఒకడు పూర్వ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ నాయకుడు
బాధితురాలి తలపై హాకీ స్టిక్‌తో కొట్టి దారుణం
ముగ్గురు నిందితుల అరెస్టు
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం
కోల్‌కతా, జూన్ 27 : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దారుణం జరిగింది. లా (న్యాయశాస్త్రం) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని (24) తన కాలేజీలోనే సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అదే కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు, మరో పూర్వ విద్యార్థి కలిసి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. బాధితురాలిని కళాశాల సెక్యూరిటీ గార్డు గదిలోకి ఈడ్చుకెళ్లి వివస్త్రను చేసి.. నిందితుల్లో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మిగిలిన ఇద్దరు అతనికి సహకరించారు. ఈ క్రమంలో ఆమె ఊపిరి ఆడటం లేదంటే ఇన్‌హేలర్ ఇచ్చిన నిందితులు.. ఆమె తలపై హాకీ స్టిక్‌తో కొట్టారు. తమ మాట వినకున్నా, జరిగింది ఎవరికైనా చెప్పినా తల్లిదండ్రులను చంపేస్తామని ఆమెను బెదిరించి రాక్షసంగా ప్రవర్తించారు. నిందితుల్లో ఒకరైన పూర్వ విద్యార్థి చేసిన పెళ్లి ప్రతిపాదనను బాధితురాలు నిరాకరించడంతోనే వారు ఈ కిరాతకానికి పాల్పడినట్టు తెలిసింది. కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలోని సౌత్ కలకత్తా లా కళాశాలలో బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది. బాధితురాలు గురువారం చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు..మనోజిత్ మిశ్రా(31), జైబ్ అహ్మద్(19), ప్రమిత్ ముఖర్జీ(20) అనే ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల్లో మనోజిత్ మిశ్రా.. సౌత్ కలకత్తా కళాశాల పూర్వ విద్యార్థి. ప్రస్తుతం అదే కళాశాల ఉద్యోగైన మనోజిత్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతగా కొనసాగుతున్నాడు. జైబ్ అహ్మద్, ప్రమిత్ లా చదువుతున్నారు.
చుట్టుముట్టి ఈడ్చుకెళ్లి..
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. కళాశాల ఆవరణలో గురువారం సాయంత్రం జరిగిన టీఎంసీ విద్యార్థి సంఘం సమావేశం అనంతరం ఏడున్నర గంటలప్పుడు మనోజిత్, జైబ్, ప్రమిత్ ఆమెను అడ్డుకున్నారు. జైబ్‌తో కలిపి ఆమెను ఓ గదిలో పెట్టి గడియ వేశారు. మనోజిత్, ప్రమిత్ బయట ఉండగా.. జైబ్ ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. జైబ్‌ను ప్రతిఘటించిన బాధితురాలు తనను వదిలేయమని, తాను మరొకరితో ప్రేమలో ఉన్నానని వేడుకుంది. ఓ దశలో కన్నీళ్లు పెట్టుకుంటూ జైబ్ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడింది. ఈ క్రమంలో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా.. మనోజిత్, ప్రమిత్‌ను జైబ్ గదిలోకి పిలిచాడు. తనకు ఇన్‌హెల్లర్ కావాలని బాధితురాలు ప్రాధేయపడగా మనోజిత్ తెచ్చి ఇచ్చాడు. దీంతో కాస్త తేరుకున్న బాధితురాలు.. వారి నుంచి తప్పించుకునేందుకు బయటకు పరుగెత్తింది. అయితే, కళాశాల ప్రధాన గేటు వద్ద ఆమెను అడ్డుకున్న నిందితులు.. సెక్యూరిటీ గార్డు గదిలోకి ఈడ్చుకెళ్లారు. సెక్యూరిటీ గార్డును బయటకు పంపేశారు. ఆమెను వివస్త్రను చేసిన జైబ్... మనోజిత్, ప్రమిత్ చూస్తుండగానే అత్యాచారం చేశాడు. సెక్యూరిటీ గార్డు నిస్సహాయంగా గది బయట ఉండిపోయాడు. ఈ క్రమంలో నిందితులు బాధితురాలి తలపై హాకీ స్టిక్‌తో కొట్టారు. ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులు, బాయ్ ఫ్రెండ్‌ను చంపేస్తామని బెదిరించారు. రాత్రి 10;50 గంటలప్పుడు ఆమెను విడిచిపెట్టారు.
సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ
లా విద్యార్థినిపై అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ మూడు రోజుల్లోగా తమకు నివేదిక ఇవ్వాలని కోల్‌కతా పోలీసులను శుక్రవారం ఆదేశించింది. మరోపక్క, నిందితుల్లో ఒకరైన మనోజిత్.. టీఎంసీ విద్యార్థి విభాగం నేత కావడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. అధికార టీఎంసీపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇక, అత్యాచార ఘటనను టీఎంసీ కూడా ఖండించింది.