Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఎమ్మెల్యే అరెస్ట్
ABN , Publish Date - Apr 25 , 2025 | 09:59 AM
Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రదాడి కారణంగా 26 మంది మరణించారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. అలాంటి వేళ.. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కూడా ఓ ఎమ్మెల్యే.. పాకిస్థాన్‌ను సమర్థిస్తూ ఈ వీడియో చేశారు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసోం, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమయాకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను సమర్థిస్తూ అసోంలోని అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రెంట్ ( ఏఐయూడీఎఫ్)కు చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వీడియో చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు ఎస్పీ స్వప్ననీల్ దేకా వెల్లడించారు. పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడిపై ఆయన చేసిన వ్యాఖ్యల వీడియా ద్వారా వైరల్ అవుతున్నట్లు పోలీసులు గమనించారని తెలిపారు.

ఇదే విషయంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. అమాయక పౌరులను దారుణంగా హత్య చేయడాన్ని సమర్థించడం.. ఈ అంశాన్ని నీరుగార్చడం.. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని.. ఇది భారతదేశ ఆత్మకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సీఎం శర్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అమీనుల్ ఇస్లాంను ఇప్పటికే కోర్టులో హాజరుపరిచామని చెప్పారు.
ఇక ఇదే అంశంపై ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు బి అజ్మల్ మాట్లాడుతూ.. ఇది ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. అతడు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం మన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. ఇక ఉగ్రవాదులకు మతం లేదని.. ఇస్లాం మతాన్ని వారు కించపరుస్తున్నారని అజ్మల్ తెలిపారు. అదీకాక ఇప్పటికే ఈ ఉగ్రదాడి ఘటనను తమ పార్టీ ఖండించిందని ఆయన గుర్తు చేశారు.
For National News And Telugu News