Share News

Indian security: 3 రోజుల్లో 11 మంది పాక్‌ గూఢచారుల అరెస్ట్‌

ABN , Publish Date - May 20 , 2025 | 05:20 AM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత భద్రతకు సంబంధించి పాకిస్థాన్‌కు సున్నిత సమాచారం అందిస్తున్న 11 మందిని పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ వారిలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా, సెక్యూరిటీ గార్డు, యాప్ డెవలపర్, విద్యార్థులు ఉన్నారు.

Indian security: 3 రోజుల్లో 11 మంది పాక్‌ గూఢచారుల అరెస్ట్‌

పంజాబ్‌, హరియాణా, యూపీలో అదుపులోకి

న్యూఢిల్లీ, మే 19: పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్‌ గూఢచర్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన మూడు రోజుల్లోనే 11 మంది ‘పాక్‌ గూఢచారుల’ను అరెస్ట్‌ చేశారు. భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హరియాణాకు చెందిన ట్రావెల్‌ వ్లాగర్‌ జ్యోతి మల్హోత్రాతోపాటు ఓ సెక్యూరిటీ గార్డు, యాప్‌ డెవలపర్‌, విద్యార్థులు, సామాన్యులు ఉన్నారు.

గజాలా, యమీన్‌: జ్యోతితో పాటు పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు చెందిన 32 ఏళ్ల వితంతువు గజాలా, యమీన్‌ మహమ్మద్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. యమీన్‌ ఆర్థిక కార్యకలాపాలు, వీసా సంబంధిత అంశాల్లో పాక్‌ హైకమిషన్‌ మాజీ ఉద్యోగి డాని్‌షతో కలిసి పనిచేసినట్లు పోలీసులు తెలిపారు.

తారిఫ్‌: నుహ్‌కే చెందిన తారి్‌ఫను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తనకు సిమ్‌ కార్డులు అందించినట్లు విచారణలో చెప్పాడన్నారు. అతను తరచుగా పాకిస్థాన్‌ వెళ్లేవాడు.

నౌమాన్‌ ఇలాహీ: ఐఎ్‌సఐ ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతున్న నౌమాన్‌ ఇలాహీ(24)ని పానిపట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను యూపీకి చెందినవాడు. ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని, పాక్‌కు సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇలాహీ చాలాసార్లు పాక్‌ పర్యటనకు వెళ్లాడన్నారు.


మహ్మద్‌ ముర్తజా అలీ: పంజాబ్‌లోని జలంధర్‌లో యాప్‌ డెవలపర్‌ మహ్మద్‌ ముర్తజా అలీని పోలీసులు అరెస్టు చేశారు. అతను స్వయంగా అభివృద్ధి చేసిన మొబైల్‌ యాప్‌ ద్వారా గూఢచర్య కార్యకలాపాలను నిర్వహించాడని చెప్పారు.

దేవేందర్‌ సింగ్‌: పంజాబ్‌ పటియాలాలోని ఖల్సా కళాశాలకు చెందిన 25 ఏళ్ల పొలిటికల్‌ సైన్స్‌ విద్యార్థి. పటియాలా సైనిక కంటోన్మెంట్‌ చిత్రాలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఐఎ్‌సఐ ఏజెంట్లకు అందించినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్‌లో పాకిస్థాన్‌ వెళ్లి వచ్చాడని చెప్పారు.

షెహజాద్‌: ఉత్తరప్రదేశ్‌ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌ పోలీసులు షెహజాద్‌ను అరెస్టు చేశారు. ఇతను పాకిస్థాన్‌కు అనేకసార్లు వెళ్లాడని, సౌందర్య సాధనాల స్మగ్లింగ్‌ రాకెట్‌ను గూఢచర్య కార్యకలాపాల కోసం వినియోగించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐఎ్‌సఐ ఏజెంట్లతో ఇతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వివరించారు.

సుఖ్‌ప్రీత్‌ సింగ్‌: ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు సున్నితమైన సమాచారాన్ని అందజేశారనే ఆరోపణలతో పంజాబ్‌ పోలీసులు గురుదా్‌సపూర్‌లో సుఖ్‌ప్రీత్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. పంజాబ్‌, హిమాచల్‌, కశ్మీర్‌లో భారత దళాల కదలికలతోపాటు వ్యూహాత్మక ప్రదేశాల వివరాలను నిందితుడు ఐఎ్‌సఐకి చేరవేసినట్లు పంజాబ్‌ డీజీపీ తెలిపారు.


కరణ్‌బీర్‌ సింగ్‌: గురుదా్‌సపూర్‌లోనే మరో నిందితుడు కరణ్‌బీర్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. ఇతనికి ఐఎ్‌సఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని.. మన సైనిక బలగాలకు చెందిన సున్నిత సమాచారాన్ని వారికి చేరవేశాడని పోలీసులు తెలిపారు.

అర్మాన్‌: మరో గూఢచారి, నుహ్‌కు చెందిన అర్మాన్‌(26)ను అదుపులోకి తీసుకున్నారు. ఇతని ఫోన్‌ నుంచి పాక్‌ నంబర్లతో జరిపిన సంభాషణలు, పంపిన ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. భారత సైనిక కార్యకలాపాల వివరాలను వాట్సాప్‌ ద్వారా పంపాడన్నారు.

జ్యోతి మల్హోత్రా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను పాక్‌ ఏజెంట్లు తమకు కీలకమైన వ్యక్తిగా మార్చుకున్నారని పోలీసులు తెలిపారు. ‘ట్రావెల్‌ విత్‌ జో’ పేరిట ఆమె యూట్యూబ్‌ చానెల్‌ నడుపుతోందని, 3.85 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారని చెప్పారు. ఆమె 2023, 2024, 2025 మార్చిలో పాకిస్థాన్‌ వెళ్లి వచ్చిందని.. పహల్గాం ఉగ్రదాడికి ముందు కూడా పాక్‌కు వెళ్లిందని వివరించారు. భారత్‌లోని పాక్‌ హైకమిషన్‌ ఉద్యోగి డాని్‌షతో సంప్రదింపులు జరిపిందన్నారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 05:56 AM