Air India Plane Crash: విమాన ప్రమాదం.. రూ.70 లక్షల బంగారం, డబ్బు దొరికింది..
ABN , Publish Date - Jun 18 , 2025 | 08:33 PM
Air India Plane Crash: రాజు గతంలో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగినపుడు కూడా వాలంటీర్‌గా పని చేశారు. ఈ విమాన ప్రమాదం తన జీవితంలో చూసిన దారుణమైన సంఘటన అని ఆయన అన్నారు.
జూన్ 12వ తేదీన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో నేలకూలిన సంగతి తెలిసిందే. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ మీద విమానం కుప్పకూలగానే అక్కడి జనం.. విమానంలోని వారిని రక్షించడానికి పరుగులు తీశారు. వారిలో 56 ఏళ్ల వ్యాపారవేత్త రాజు పాటెల్ కూడా ఉన్నాడు. ప్రమాదం జరిగిన 5 నిమిషాలకే రాజు, అతడి టీం సంఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడికి చేరుకునే సమయానికి ఆ ప్రాంతం మొత్తం భారీ పొగ, మంటలతో నిండిపోయి ఉంది. లోపల చిక్కుకున్న జనం సాయం కోసం కేకలు వేస్తూ ఉన్నారు. అయితే, విపరీతమైన పొగ, మంటల కారణంగా వారి దగ్గరకు వెళ్లటం కుదరలేదు.
15 నుంచి 20 నిమిషాల వరకు దగ్గరకు వెళ్లటం కుదరలేదు. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు రావటం మొదలవ్వగానే రాజు టీం రంగంలోకి దిగింది. మెడికల్ స్ట్రెచర్ లేకపోవటంతో.. బెడ్ షీట్లు, చీరల్లో గాయపడ్డ వారిని వేసుకుని అంబులెన్సుల దగ్గరకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం 4 గంటల తర్వాత రాజు టీం.. బాధితులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు సేకరించటం మెదలెట్టింది. రాత్రి 9 గంటల వరకు సేకరించారు. రాజు టీంకు సంఘటన జరిగిన ప్రదేశంలో.. 70 తులాల బంగారం..
80 వేల రూపాయల నగదు.. గాజులతో పాటు ఇతర నగలు.. పాస్ పోర్టులు, ఇతర విలువైన డాక్యుమెంట్లు, ఓ భగవద్గీత దొరికాయి. దొరికిన వాటన్నింటిని రాజు పటేల్ పోలీసులకు అప్పగించారు. రాజు గతంలో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగినపుడు కూడా వాలంటీర్‌గా పని చేశారు. ఈ విమాన ప్రమాదం తన జీవితంలో చూసిన దారుణమైన సంఘటన అని ఆయన అన్నారు. ఇక, ప్రమాద స్థలంలో సేకరించిన వాటిని బాధితుల కుటుంబాలకు అప్పగిస్తామని హోంశాఖ మంత్రి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
నీటిపైకి ఓర్ చేప.. ప్రళయం రాబోతోందా?
కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..