Air India: విమానం తలుపు నుంచి ‘బుస్సు’మంటూ చప్పుడు!
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:07 AM
ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళుతున్న ఎయిరిండియా విమానం.. ఆకాశంలో అంతెత్తున ఎగురుతుండగా దాని తలుపు వద్ద ‘బుస్సు’ మంటూ చప్పుడు మొదలైంది.. అంతేకాదు ఆ తలుపు స్వల్పంగా వణుకుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అహ్మదాబాద్ ప్రమాదానికి 12 రోజుల ముందు ఘటన
అది కూడా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ తరహా విమానమే
‘మేడే’ అంటూ బెంగళూరులో విమానం ల్యాండింగ్
ముంబై, జూన్ 21: ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళుతున్న ఎయిరిండియా విమానం.. ఆకాశంలో అంతెత్తున ఎగురుతుండగా దాని తలుపు వద్ద ‘బుస్సు’ మంటూ చప్పుడు మొదలైంది.. అంతేకాదు ఆ తలుపు స్వల్పంగా వణుకుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. భయపడొద్దు, ఏమీకాదంటూ సర్దిచెప్పిన విమాన సిబ్బంది.. కొన్ని కాగితపు న్యాప్కిన్లు తీసుకొచ్చి, తలుపు సందులో కుక్కారు. దానితో చప్పుడు ఆగిపోయింది. విమానం హాంకాంగ్ చేరుకుని సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆలస్యంగా బయటికి వచ్చిన ఈ ఘటన.. అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన జరగడానికి 12 రోజుల ముందు జూన్ 1న జరిగింది. ఆ విమానం కూడా అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ మోడల్‌దే కావడం గమనార్హం. మన ఎయిరిండియా వద్ద ఇదే మోడల్ విమానాలు 24 ఉండటం గమనార్హం. మరోవైపు గువహటి-చెన్నై ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఇంధనం అత్యంత తక్కువగా ఉండటంతో.. బెంగళూరులో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
నిజానికి ఈ విమానం చెన్నైకి చేరుకున్నా.. విమానాశ్రయం చాలా రద్దీగా ఉండటంతో ల్యాండింగ్‌కు అనుమతి రాలేదు. దీనితో విమానాన్ని కాసేపు చెన్నైపైనే తిప్పిన పైలట్.. బెంగళూరు విమానాశ్రయం వైపు మళ్లించారు. విమానంలో ఇంధనం అత్యంత తక్కువగా ఉండటంతో ‘మేడే.. మేడే..’ అంటూ ప్రమాద సంకేతాలు ఇచ్చారు. బెంగళూరు విమానాశ్రయం ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అనుమతి ఇవ్వడంతో.. అక్కడ అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ఇంధనం నింపుకొని తిరిగి చెన్నైకి వెళ్లారు. ఇక శుక్రవారం చెన్నై నుంచి మదురైకి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరిగి చెన్నై మళ్లించి, అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల్లో 210 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు.