Share News

Bengaluru Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:48 AM

Air India Express: విమానంలో ఎలాంటి సమస్య కనిపించలేదు. కొంత సమయం తర్వాత ఆ విమానం గ్వాలియర్ నుంచి బెంగళూరు బయలు దేరింది. అక్కడ ఎలాంటి ఇబ్బందిలేకుండా సేఫ్‌గా ల్యాండ్ అయింది.

Bengaluru Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం..
Air India Express

ఎయిర్ ఇండియా విమానాల్లో తరచుగా సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. సమస్యల కారణంగా విమానం క్యాన్సిల్ అయిన, గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే నిలిచి పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా, బెంగళూరు నుంచి గ్వాలియర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో ల్యాండింగ్ సమస్య తలెత్తింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వలేకపోయింది.


మొదటి ప్రయత్నంలో విమానం ల్యాండ్ అవ్వలేకపోవటంతో పైలట్లు విమానాన్ని గాల్లోకి లేపారు. కొద్దిసేపటి తర్వాత మరో సారి ప్రయత్నించారు. రెండవ ప్రయత్నంలో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. దీంతో లోపల ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో మొత్తం 160 మంది ప్రయాణికులు ఉన్నారు. గ్వాలియర్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత టెక్నీషియన్స్ విమానాన్ని పరీక్షించారు.


అయితే, విమానంలో ఎలాంటి సమస్య కనిపించలేదు. కొంత సమయం తర్వాత ఆ విమానం గ్వాలియర్ నుంచి బెంగళూరు బయలు దేరింది. అక్కడ ఎలాంటి ఇబ్బందిలేకుండా సేఫ్‌గా ల్యాండ్ అయింది. గ్వాలియర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఏ కే గోస్వామి మాట్లాడుతూ.. ‘విమానం ల్యాండ్ అయిన వెంటనే టెక్నికల్ సిబ్బంది విమానాన్ని పరీక్షించారు. ఎలాంటి సమస్య లేదని తేల్చారు. విమానం బెంగళూరు ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది.


మొదటి సారి ల్యాండ్ అవ్వలేకపోవటం వంటిది తరచుగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ప్రయాణికులు ల్యాండింగ్ ఫెయిల్యూర్‌పై ఎయిర్‌పోర్టు, ఎయిర్ లైన్ అధికారులకు ఫిర్యాదు చేశారు’ అని అన్నారు. ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘మా విమానాల్లో ఒకటి ల్యాండింగ్ సమస్య కారణంగా మళ్లీ గాల్లోకి లేచింది. సేఫ్ ల్యాండింగ్ కోసమే ఇలా చేస్తూ ఉంటారు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

ఉగ్రవాది నూర్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..

జమ్మూకాశ్మీర్‌లో మరో విషాదం.. క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి..

Updated Date - Aug 17 , 2025 | 11:54 AM