Gaza reconstruction: గాజా మళ్లీ కోలుకుంటుందా?
ABN , Publish Date - Jan 23 , 2025 | 05:02 AM
గాజాలో ఎటు చూసినా విధ్వంస ఛాయలే. కుప్పలుగా పేరుకుపోయిన శిథిలాలు, కూలిపోయిన లక్షల భవంతులు, ధ్వంసమైన రోడ్లు అక్కడ దర్శనం ఇస్తున్నాయి.
ఎటు చూసినా యుద్ధఛాయలే.. కుప్పకూలిన భవంతులు, ధ్వంసమైన రోడ్లు
శిథిలాలను తొలగించాలంటేనే 1.2 బిలియన్ డాలర్ల ఖర్చు
గాజా అభివృద్ధి 69 ఏళ్లు వెనక్కి: ఐరాస
న్యూఢిల్లీ, జనవరి 22: గాజాలో ఎటు చూసినా విధ్వంస ఛాయలే. కుప్పలుగా పేరుకుపోయిన శిథిలాలు, కూలిపోయిన లక్షల భవంతులు, ధ్వంసమైన రోడ్లు అక్కడ దర్శనం ఇస్తున్నాయి. ఈ ప్రాంతం పునర్నిర్మాణం సాధ్యమేనా? ఎంత సమయం పడుతుంది? ఎంత ఖర్చు అవుతుంది.? కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. గాజా కోలుకోవాలంటే దశాబ్దాల కాలం పడుతుందని ఐక్యరాజ్యసమితి తాజాగా తేల్చి చెప్పింది. దిగ్బంధనాలు కొనసాగితే.. యుద్ధానికి ముందు ఆర్థిక పరిస్థితికి చేరడానికి గాజాకు కనీసం 350 ఏళ్లు పడుతుందని ఐరాస అంచనా వేసింది. తాజాగా వేసిన అంచనాల ప్రకారం 10 శాతం ఆర్థిక వృద్ధి ఉంటుందని భావిస్తే.. 2050 నాటికి గత పరిస్థితికి గాజా చేరుకుంటుందని పేర్కొంది. అది కూడా మిలటరీ చర్యలు లేకుండా, సరుకుల రవాణా స్వేచ్ఛగా జరిగి, పెట్టుబడులు వచ్చి, ఏటా 2.8ుజనాభా పెరుగుదల ఉన్నపుడు మాత్రమే సాధ్యమని అభిప్రాయపడింది.
శిథిలాల తొలగింపునకు 21 ఏళ్లు..
ఇక్కడి భవన శిథిలాల తొలగింపుపై ఇటీవల ఐరాస ఒక అంచనా వేసింది. యుద్ధం కారణంగా పేరుకుపోయిన 50 మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపునకు కనీసం 21 ఏళ్లు పడుతుందని, 1.2 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని లెక్కగట్టింది. హింస కారణంగా గాజా అభివృద్ధి 69 ఏళ్లు వెనక్కి పోయిందని ఐరాస అభివృద్ధి కార్యక్రమం అధికారి ఒకరు చెప్పారు. 2023 అక్టోబరు 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్‌పై దాడితో గాజాలో యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ లెక్కల ప్రకారం హమాస్ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెలీలు కన్నుమూశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఆ ప్రాంత పౌరులు 46 వేల మంది చనిపోయారు.
ఇళ్ల నిర్మాణం ఇప్పట్లో సాధ్యపడదు..
కూలిపోయిన ఇళ్ల పునర్మిర్మాణం ఇప్పట్లో సాధ్యపడదని గతేడాదే ఐరాస వెల్లడించింది. గత డిసెంబరులో యూఎన్ శాటిలైట్ డేటా ప్రకారం యుద్ధానికి ముందు ఉన్న భవనాల్లోని మూడింట రెండు వంతులు.. అంటే 1.70 లక్షలకు పైగా ధ్వంసమయ్యాయి లేదా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 18 లక్షల మంది ప్రజలకు వెంటనే ఆవాసాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఐరాస మానవతా సంస్థ అంచనాల ప్రకారం కనీసం 68 శాతం రోడ్డు నెట్‌వర్క్ నాశనమైంది. 75 శాతం పైగా నీటి పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఇక శరణార్థులు ఎక్కువగా నివసించే ఉత్తర గాజాలోని జబాలియా పట్టణం మొత్తం శిఽథిలాల కుప్పగా మారిపోయింది. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో సగానికి పైగా వ్యవసాయ భూమి ధ్వంసమైంది. 95 శాతానికి పైగా పశువులు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
ఇది కూడా చదవండి..
Delhi Assembly Elections: ఆప్ మధ్యతరగతి మేనిఫెస్టో
State Govt: సొంతంగా విమానం కొనుగోలు చేయడం లేదు
influential Indians : సత్యం.. సుందరం!
Read More National News and Latest Telugu News