Share News

Delhi Elections: ఆప్‌ను ముంచిన కాంగ్రెస్‌!

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:10 AM

బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ఆప్‌ అవకాశాలను కాంగ్రెస్‌ దెబ్బతీసిందా? అంటే.. ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఇది నిజమేనన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి.

Delhi Elections: ఆప్‌ను ముంచిన కాంగ్రెస్‌!

బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చిన హస్తం!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉండి కూడా.. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌, కాంగ్రెస్‌ విడివిడిగా పోటీ చేయడం వల్లే బీజేపీ గెలిచిందా? బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ఆప్‌ అవకాశాలను కాంగ్రెస్‌ దెబ్బతీసిందా? అంటే.. ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఇది నిజమేనన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 48 సీట్లతో విజేతగా నిలిచిన బీజేపీకి మొత్తం 45.56 శాతం ఓట్లు రాగా, 22 సీట్లతో సరిపెట్టుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి 43.57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు మధ్య వ్యత్యాసం కేవలం 1.99 శాతం మాత్రమే. కాగా, ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలబడ్డ కాంగ్రె్‌సకు 6.34 శాతం ఓట్లు దక్కాయి. అయితే ఆప్‌, కాంగ్రె్‌సకు కలిపితే 49.91 శాతం ఓట్లు లభించాయి. ఇవి బీజేపీ కన్నా 4.35 శాతం ఎక్కువ. అంతేకాదు.. బీజేపీ అభ్యర్థులు విజయం సాధించిన 14 నియోజకవర్గాల్లో వారికి దక్కిన మెజారిటీ కన్నా ఆయా స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.


ఈ స్థానాల్లో కాంగ్రెస్‌ ఓట్లను చీల్చకపోతే మళ్లీ ఆప్‌ అధికారంలోకి రాగలిగేదని గణాంక వివరాలు చెబుతున్నాయి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, సోమ్‌నాథ్‌ భారతి, సౌరవ్‌ భరద్వాజ్‌ తోపాటు పలువురు ఆప్‌ నేతలు కాంగ్రెస్‌ ఓట్లు చీల్చడం వల్లే పరాజయం పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి సందీప్‌ దీక్షిత్‌కు వచ్చిన 4,568 ఓట్ల వల్లే కేజ్రీవాల్‌ ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌సింగ్‌ వర్మ 4,089 ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. కాగా, జంగ్‌పురాలో మనీశ్‌ సిసోడియా కేవలం 675 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఇక్కడ. కాంగ్రెస్‌ అభ్యర్థికి 7350 ఓట్లు లభించాయి. సంగం విహార్‌ నియోజకవర్గంలోనైతే బీజేపీ అభ్యర్థి చందన్‌కుమార్‌ చౌదరి కేవలం 344 ఓట్లతో ఆప్‌ అభ్యర్థిపై గెలుపొందగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 15,863 ఓట్లు వచ్చాయి.


ఇండియా కూటమిలో అనైక్యత వల్లే..

ఇండియా కూటమిలోని పార్టీల అనైక్యత ఢిల్లీలో బీజేపీ గెలుపునకు కారణమైందని వివిధ పార్టీల నేతలు అన్నారు. విడిపోతే పడిపోతామని తెలిసీ కాంగ్రెస్‌, ఆప్‌ పొరపాటు చేశాయని పేర్కొన్నారు. ఢిల్లీలో బలం ఉన్న ఆప్‌కు కాంగ్రెస్‌ సహకరించలేదని జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా విమర్శించారు. ‘ఇంకా మీలో మీరే కొట్టుకుంటూ ఉండండి’ అంటూ రెండు పార్టీలకు చురకలంటించారు. కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పోటీ చేసి ఉంటే బీజేపీ గెలిచే అవకాశమే ఉండేది కాదని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీయే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిందని సీపీఐ నేత డి.రాజా అభిప్రాయపడ్డారు. అయితే ఆప్‌ ఓటమికి తమ పార్టీ కారణం కాదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే అన్నారు. ఆప్‌ను గెలిపించడం తమ బాధ్యత కాదన్నారు. గతంలో కేజ్రీవాల్‌ కూడా గోవా, హరియాణా, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో ఆప్‌ను పోటీలో నిలిపి ప్రచారం చేశారని, ఫలితంగా ఓట్లు చీలిపోయి.. గోవా, ఉత్తరాఖండ్‌లలో తాము అధికారం దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయామని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 05:10 AM