Share News

Maharashtra: ఆదిత్య థాకరే, ఫడ్నవిస్ మంతనాలు.. ఊపందుకున్న ఊహాగానాలు

ABN , Publish Date - Jul 20 , 2025 | 08:48 PM

బీజేపీ, శివసేన (యూబీటీ) తిరిగి చేతులు కలిపితే అది ఆశ్చర్యకరమైన పరిణామం కాదనీ, 2019లోనూ ఈ పరిణామం జరిగిందని ఎన్‌సీపీ-ఎస్పీ నేత ప్రశాంత్ జగ్‌తప్ తెలిపారు. మహారాష్ట్రలో ఏదైనా జరగవచ్చని, 2019 తర్వాత కూడా అనేక అనూహ్య పరిణామాలను చూశామని చెప్పారు.

Maharashtra: ఆదిత్య థాకరే, ఫడ్నవిస్ మంతనాలు.. ఊపందుకున్న ఊహాగానాలు

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు కొత్తేమీ కాదు. ఠాక్రే సోదరులు కలుస్తారంటూ కొద్దికాలంగా చెలరేగుతున్న ఊహాగానాలు ఇటీవల ఒకే వేదికపై ఉద్ధవ్, రాజ్ ఠాక్రే కలుసుకోవడంతో తెరిపిన పడ్డాయి. అయితే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే, సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మళ్లీ కలుస్తారనే ఊహాగానాలకు తెరలేచింది. ఇందుకు బలం చేకూరుస్తూ ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలోని ఓ హోటల్‌లో కలుసుకున్నట్టు సమాచారం.


తొలుత ఆదిత్య ఠాక్రే శనివారం సాయంత్రం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని సోఫిటెల్ హోటల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి హోటల్‌కు ఫడ్నవిస్ వచ్చారు. అక్కడ ఇద్దరు నేతలు 'రహస్య' సమావేశం జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) మాత్రం ఫడ్నవిస్ హోటల్‌కు వెళ్లడం నిజమేనని, అయితే ఆయన ఆదిత్యను కలుసుకోలేదని తెలిపింది. వేర్వేరు కార్యక్రమాలకు కోసం వారిద్దరూ వచ్చారని, వారి మధ్య ఎలాంటి సమావేశం చోటుచేసుకోలేదని సీఎం కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.


మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్‌సీపీ పొత్తు ఉంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ) విపక్ష మహా వికాస్ అఘాడిలో భాగంగా శరద్‌పవార్ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు కలిగి ఉంది.


కాగా, శనివారం సాయంత్రం ఆదిత్య ఠాక్రే, ఫడ్నవిస్ సమావేశం కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చని పలువురు శివసేన (యూబీటీ), బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీ, శివసేన (యూబీటీ) తిరిగి చేతులు కలిపితే అది ఆశ్చర్యకరమైన పరిణామం కాదనీ, 2019లోనూ ఈ పరిణామం జరిగిందని ఎన్‌సీపీ-ఎస్పీ నేత ప్రశాంత్ జగ్‌తప్ తెలిపారు. మహారాష్ట్రలో ఏదైనా జరగవచ్చని, 2019 తర్వాత కూడా అనేక అనూహ్య పరిణామాలను చూశామని చెప్పారు. రెండు పార్టీలు తిరిగి కలవాలని నిర్ణయిస్తే మహారాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయేదేమీ ఉండదన్నారు. అయితే, శివసేన (యూబీటీ) వర్గం మహా వికాస్ అఘాడితోనే ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే ప్రజలను వంచించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.


ఫడ్నవిస్ ఆహ్వానం

ఈ వారం ప్రారంభంలో శాసన మండలిలో అంబాదాస్ దావ్నే ఫేర్‌ఫెల్ సందర్భంగా దేవేంద్ర ఫడ్నవిస్ సైతం ఉద్ధవ్‌ తమ వైపు వస్తే స్వాగతిస్తామని అన్నారు. 2029 వరకూ తాము అక్కడకు (విపక్షం వైపు) వెళ్లే అవకాశం లేదని, ఉద్ధవ్ ఈవైపు (అధికార పక్షం) వచ్చే విషయం ఆలోచించుకోవచ్చని అన్నారు.


ఇవి కూడా చదవండి..

మళ్లీ మా నాన్నే సీఎం

ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 09:31 PM