7 Month Pregnant: ఏడో నెలలో గర్భంతో వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు.. పతకం సాధించిన లేడీ కానిస్టేబుల్
ABN , Publish Date - Oct 27 , 2025 | 09:42 PM
ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె 145 కేజీల డెడ్ లిఫ్ట్‌లో పాల్గొంది. డెడ్ లిఫ్ట్‌తో పాటు 125 కేజీల స్క్వాట్స్, 80 కేజీల బెంచ్ ప్రెస్‌లోనూ పాల్గొంది. 145 కేజీల డెడ్ లిఫ్ట్ విభాగంలో కాంస్య పతకం సాధించింది.
సాధించాలన్న కసి మనలో ఉంటే అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఢిల్లీకి చెందిన ఓ లేడీ కానిస్టేబుల్ పట్టుదలకు, కార్య దీక్షకు ప్రతీకగా నిలిచింది. ఆమె ఏడు నెలల గర్భంతో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. కాంస్య పతకం సాధించింది. లేడీ కానిస్టేబుల్ విజయ గాథకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన సోనికా యాదవ్ పోలీస్ కానిస్టేబుల్‌గా(Delhi Police Constable) విధులు నిర్వహిస్తోంది. సోనికాకు వెయిల్ లిఫ్టింగ్ అంటే మక్కువ ఎక్కువ. చాలా పోటీల్లో పాల్గొని పతకాలు సైతం సాధించింది.
పెళ్లైనా కూడా వెయిట్ లిఫ్టింగ్ ఆపలేదు. ప్రతీరోజూ జిమ్‌కు వెళుతూ ఉండేది. ఎక్కడైనా పోటీలు జరిగితే పాల్గొనేది. ఈ నేపథ్యంలోనే ఆమె ఏప్రిల్ నెలలో గర్భం దాల్చింది. అయినా కూడా ఆమె జిమ్ముకు వెళ్లటం ఆపలేదు. డాక్టర్ల పర్య వేక్షణలో వెయిల్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండేది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ‘ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025 - 2026’(All India Police Weightlifting Championship)లో పాల్గొంది. ఏడు నెలల గర్భంతో ఆమె పోటీల్లో పాల్గొనటంతో అందరూ ఆశ్చర్యపోయారు. తక్కువ బరువు విభాగంలో పాల్గొంటుందేమో అనుకున్నారు.
అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె 145 కేజీల డెడ్ లిఫ్ట్‌లో పాల్గొంది. డెడ్ లిఫ్ట్‌తో పాటు 125 కేజీల స్క్వాట్స్, 80 కేజీల బెంచ్ ప్రెస్‌లోనూ పాల్గొంది. 145 కేజీల డెడ్ లిఫ్ట్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. ఏడు నెలల గర్భంతో (7 Month Pregnant) డెడ్ లిఫ్ట్ చేసి పతకం సాధించి చరిత్ర సృష్టించింది. సోనికా యాదవ్ విజయ గాథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదనడానికి సోనికా ఓ ఉదాహరణ అంటున్నారు.
ఇవి కూడా చదవండి
పది వేల బిల్లు చేసి కాస్ట్‌లీ కారులో పరార్.. కట్ చేస్తే..
అనంతపురంలో దారుణం.. భార్యతో గొడవలు పెడుతున్నారని..