Share News

Woman Assasinated For Gold: వృద్ధురాలి హత్య.. రెండు రోజుల పాటు శవాన్ని ఇంట్లో పెట్టుకుని..

ABN , Publish Date - Nov 09 , 2025 | 08:13 AM

బంగారు నగల కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఓ వృద్ధురాలిని గొంతునులిమి చంపేసింది. తర్వాత శవాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది.

Woman Assasinated For Gold: వృద్ధురాలి హత్య.. రెండు రోజుల పాటు శవాన్ని ఇంట్లో పెట్టుకుని..
Woman Assasinated For Gold

కర్ణాటకలో అత్యంత దారుణమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మహిళ బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలిని హత్య చేసింది. అనంతరం ఆమె శవాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకుంది. రెండు రోజుల తర్వాత శవాన్ని చెరువులో పడేసింది. మర్డర్ కేసు నుంచి తప్పించుకోవటానికి నాటకాలు ఆడింది. చివరకు పాపం పండి అరెస్ట్ అయింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, అనేకల్ తాలూకాలోని కూగూరుకు చెందిన 68 ఏళ్ల భద్రమ్మ అక్టోబర్ 30వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది.


అక్టోబర్ 31వ తేదీన ఆమె కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భద్రమ్మ కోసం వెతకటం మొదలెట్టారు. ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలోనే కేసును మలుపు తిప్పే విషయం ఒకటి నవంబర్ 6వ తేదీన పోలీసులకు తెలిసింది. భద్రమ్మ చనిపోవడానికి ముందు అదే గ్రామానికి చెందిన దీప అనే మహిళ ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఈ సమాచారంతో పోలీసులు దీపను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో దీప విస్తుపోయే విషయాలు చెప్పింది.


‘కజ్జాయ స్వీట్స్ ఇస్తానని చెప్పి భద్రమ్మను ఇంటికి తీసుకెళ్లాను. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత గొంతు నులిమి చంపేశాను. ఆమె బంగారు చైన్‌ను దొంగిలించాను. తర్వాత శవాన్ని ఓ పెద్ద సంచిలో కుక్కి ఇంట్లోనే పెట్టుకున్నాను. రెండు రోజుల పాటు శవం ఇంట్లోనే ఉంచాను. శవం కుళ్లి వాసన వస్తుండటంతో వేరే బ్యాగ్‌లోకి మార్చాను. తర్వాత నా కొడుకును పిలిచాను. బ్యాగులో చెత్త ఉందని, దాన్ని దూరంగా పడేయాలని చెప్పాను.


అతడు నా మాటలు నమ్మాడు. ఇద్దరం కలిసి ఆ బ్యాగును దొడ్డతిమ్మనసంద్ర చెరువులో పడేశాము. తర్వాత ఏమీ జరగనట్లు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. భద్రమ్మ కుటుంబం నన్ను అడిగినపుడు నాకేమీ తెలీదని అన్నాను. నా దగ్గరినుంచి తిరిగి వెళ్లిపోయిందని చెప్పాను’ అని అంది. ఇక, పోలీసులు నిందితురాలు ఇచ్చిన సమాచారంతో చెరువులోంచి భద్రమ్మ శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.


ఇవి కూడా చదవండి

ఆఫీసులో రీల్స్ చేస్తూ ఎస్‌బీఐ మేనేజర్ వీడియో వైరల్

పోలీసులను గూండాలంటారా?: పట్టాభిరామ్‌

Updated Date - Nov 09 , 2025 | 08:13 AM