Age Gap Relationship: 19 ఏళ్ల యువతితో 40 ఏళ్ల వ్యక్తి ప్రేమ.. ఊహించని విషాదం..
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:34 AM
19 ఏళ్ల ఓ యువతి 40 ఏళ్ల ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం కన్నవాళ్లను కాదనుకుంది. ఇంటి నుంచి అతడితో పాటు పారిపోయింది. ఈ కారణమే ఆ వ్యక్తి ప్రాణాలు తీసింది.
ప్రేమకు వయసుతో సంబంధం లేదని తెలిపే ఎన్నో ప్రేమ కథల్ని మనం చూసే ఉంటాం. 22 ఏళ్ల యువకుడు 60 ఏళ్ల బామ్మను.. 18 ఏళ్ల యువతి 70 ఏళ్ల వృద్ధుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఈ ప్రపంచంలో చాలా జరిగాయి. ఈ మధ్యకాలంలో ఏజ్ గ్యాప్ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా, 19 ఏళ్ల ఓ యువతి 40 ఏళ్ల ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. అతడి కోసం కన్నవాళ్లను కాదనుకుంది. ఇంటి నుంచి అతడితో పాటు పారిపోయింది. ఈ కారణమే ఆ వ్యక్తి ప్రాణాలు తీసింది. యువతి తండ్రి ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ హత్య చేశాడు. గొంతు కోసి ప్రాణాలు తీసేశాడు.
ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మాగడి తాలూకా, దొనకుప్పే గ్రామానికి చెందిన 40 ఏళ్ల చులువ అనే వ్యక్తి ప్రస్తుతం తుమ్కూరు జిల్లాలోని కొత్తగేరె గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అక్కడ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడు తన బంధువైన 19 ఏళ్ల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. ఇందుకు ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని భావించారు. 15 రోజుల క్రితం యువతి ఇంట్లోనుంచి అతడితో పాటు పారిపోయింది. ఇద్దరూ మండ్య జిల్లాలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు.
యువతి కుటుంబం గ్రామ పంచాయతీని ఆశ్రయించింది. పంచాయతీ పెద్దలు యువతిని కుటుంబసభ్యులతో పాటు పంపించేశారు. మూడు రోజుల క్రితం చులువ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. తన ప్రియురాలిని ఇంట్లో వారు బంధించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో చూసిన యువతి తండ్రి కెంపన్న ఆగ్రహానికి గురయ్యాడు. తన సోదరులు రామక్రిష్ణ, మంజుల సాయంతో చులువను డిసెంబర్ 18వ తేదీన కిడ్నాప్ చేశాడు. కారులోనే ముగ్గురూ కలిసి అతడి గొంతు కోసి చంపేశారు. శవాన్ని గట్టిపూర్ గ్రామంలోని చెరువులో పడేశారు. ఆ శవాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కునిగల్ పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తర్వాత కేసు మగడి పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. మగడి పోలీసులు నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నేడే టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక.. ఏం జరగబోతోందో?
శ్రీరామ్ ఫైనాన్స్‌లో ఎంయూఎఫ్‌జీకి 20 శాతం వాటా