Building Collapses: ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద జనం..
ABN , Publish Date - Jul 12 , 2025 | 09:09 AM
ఢిల్లీ ఆజాద్ మార్కెట్‌లో ఓ బిల్డింగ్ కూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది. శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం ఉన్నట్లుండి కుప్పకూలింది.
ఢిల్లీ: ఈ మధ్య కాలంలో భవనాలు కుప్పకూలుతున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఓ సంఘటన మరువక ముందే మరో సంఘటన చోటు చేసుకుంటోంది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో రెండు బిల్డింగులు కూలిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున ఆజాద్ మార్కెట్ ఏరియాలో ఓ బిల్డింగ్ కూలిపోయింది. 45 ఏళ్ల పప్పు అనే వ్యక్తి చనిపోయాడు. బిల్డింగ్ సమీపంలో మెట్రో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మెట్రో పనుల కారణంగా బిల్డింగ్ కుప్పకూలిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
గంటల్లోనే మరో ఘటన..
ఆజాద్ మార్కెట్‌లో బిల్డింగ్ కూలిన 30 గంటల్లోనే సీలమ్‌పూర్ ఏరియాలో మరో బిల్డింగ్ కూలిపోయింది. శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల ఓ బిల్డింగ్ ఉన్నట్లుండి కుప్పకూలింది. 10 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన నలుగురిని రక్షించారు. వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
శిథిలాల కింద ఇంకా ఆరుగురు ఉన్నట్లు సమాచారం. వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలోని భీకర దృశ్యాలు కలచి వేస్తున్నాయి. నాలుగు అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి పక్కన ఉన్న ఇళ్లపై పడింది. దీంతో ఆ ఇళ్లులు కూడా బాగా దెబ్బతిన్నాయి. స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
వీడు మామూలోడు కాదు.. ఆడవేషంలో 1000 మంది మగాళ్లను..
విమాన ప్రమాదం.. నివేదికలో బయటపడ్డ సంచలన విషయాలు