Maths Miracle: వామ్మో!... ఒక పాఠశాల గోడ, 4 లీటర్ల పెయింట్.. ఖర్చు 1.07 లక్షలు
ABN , Publish Date - Jul 05 , 2025 | 09:08 PM
ప్రభుత్వ పాఠశాల గోడకు పెయింట్ వేసేందుకు 168 కార్మికులు, 65 మంది తాపీ మేస్త్రీలను ఉపయోగించారు. కేవలం 4 లీటర్ల పెయింట్‌కు వేసేందుకు అంత మందిని పనిలోకి తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పైగా పనికి చెల్లించిన బిల్లు చూస్తే కళ్లు తేలేయాల్సిందే.
షాడోల్: మ్యాథమెటిక్స్, మ్యాన్‌పవర్ కలిసి సాధించిన అద్భుతం (Miracle) చూస్తే... కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక ప్రభుత్వ పాఠశాల గోడకు 4 లీటర్ల పెయింట్ వేసేందుకు 168 కార్మికులు, 65 మంది తాపీ మేస్త్రీలను ఉపయోగించారు. ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. అలాగే ఈ మొత్తం పనికి చెల్లించిన బిల్లు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. సోషల్ మీడియాలో ఈ బిల్లు కాపీ ప్రత్యక్షమవడంతో నిర్వాహకుల 'నిర్వాకం' ఒక్కసారిగా వైరల్ అయింది. వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎడ్యుకేషన్ అధికారి ఈ మొత్తం 'గోల్‌మాల్'పై విచారణకు ఆదేశించారు.
మ్యాథ్స్ మిరాకిల్..
మధ్యప్రదేశ్‌లోని బ్యోహర్ జిల్లా సకందీ ప్రభుత్వ పాఠశాల గోడకు పెయింట్ వేసేందుకు పనులు పురమాయించారు. 168 మంది కార్మికులు, 65 మంది తాపీ మేస్త్రీలు పనిలోకి వచ్చారు. నాలుగు లీటర్ల పెయింట్‌తో పనులు పూర్తి చేశారు. ఇందుకోసం చెల్లించిన బిల్లు ఎంత అనేది అనూహ్యంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అది ఒక్కసారిగా వైరల్ అయింది. అందుకు కారణం ఏమిటంటే పాఠశాల పని కోసం అక్షరాలా రూ.1.07లక్షలు విత్‌డ్రా చేసుకోవడమే. ఇంతటితో ఆగలేదు.. నిపనియా గ్రామంలో 10 కిటికీలు, నాలుగు తలుపులకు పెయింట్ వేసేందుకు 275 మంది కార్మికులు, 150 మంది తాపీ మేస్త్రీలను వినియోగించారు. 20 లీటర్ల పెయింట్ వాడారు. దీనికి అక్షరాలా చెల్లించిన మొత్తం రూ.2.3లక్షలు. సుధాకర్ కన్‌స్ట్రక్షన్ అనే నిర్మాణ సంస్థ ఈ పనులు చేపట్టి 2025 మే 5న బిల్లు క్రియేట్ చేస్తే, దీనిని నెల రోజులకు ముందే ఏప్రిల్ 4న స్కూలు ప్రిన్సిపాల్ వెరిఫై చేశారు. రెండు పాఠశాలల బిల్లుల వ్యవహారంలో మరో మ్యాజిక్ కూడా చోటుచేసుకుంది. బిల్లుకు చట్టపరంగా ఆమోదం పొందడానికి పనులకు ముందు, తరువాత తీసిన ఫోటోలు కూడా జోడించాలి. అయితే ఒక్క ఫోటో కూడా జత చేయకుండానే బిల్లులు ఆమోదం పొందాయి.

విచారణకు ఆదేశం
రెండు స్కూళ్ల పెయింటింగ్ పనులకు అయిన ఖర్చుకు సంబంధించిన బిల్లులు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంపై జిల్లా ఎడ్యుకేషన్ అధికారి ఫూల్ సింగ్ స్పందించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని, నిజానిజాలు నిర్ధారణ కాగానే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.