Old Age Home: పాపం వృద్ధులు.. అలా చేయడానికి మనసెలా వచ్చింది..
ABN , Publish Date - Jun 27 , 2025 | 07:09 PM
Old Age Home: ఆ గదులు కంపుకొడుతూ ఉన్నాయి. కొంతమంది ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఇక్కడ దారుణం ఏంటంటే.. ఆ ఆశ్రమం వారు వృద్ధుల కుటుంబసభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు.
కనీ పెంచిన తల్లిదండ్రులు బిడ్డలకు భారం అయిపోయారు. తోడుగా ఉండాల్సిన వయసులో వారిని వృద్ధాశ్రమాలకు పంపేస్తున్నారు. ఆ వృద్ధాశ్రమాల్లో చేరిన వారి జీవితం నరకంలా మారుతోంది. ఇందుకు ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఓ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. నోయిడాలోని సెక్టార్ 55లో ఆనంద్ నికేతన్ వ్రింద ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో 39 మంది దాకా వృద్ధులు ఉన్నారు. వారిలో మగవారు, ఆడవారు కూడా ఉన్నారు. అయితే, ఆ ఆశ్రమ నిర్వాహకులు, సిబ్బంది 39 మందితో దారుణంగా ప్రవర్తించారు.
వృద్ధులకు నరకం చూపించారు. కొంతమందిని కట్టేసి హింసించారు. ఆశ్రమంలోని దారుణ దృశ్యాలను ఓ వ్యక్తి ఫొటోలు, వీడియోలు తీసి గత వారం సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారుల దృష్టికి కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర ప్రదేశ్ స్టేట్ ఉమెన్స్ కమిషన్ అధికారులు, నోయిడా పోలీసులు శుక్రవారం ఆశ్రమంపై రైడ్ చేశారు. అక్కడి దృశ్యాలను చూసి వారు షాక్ అయ్యారు. 39 మంది వృద్ధులు ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలిసి వారి కళ్లు తడయ్యాయి.
అది ఆశ్రమంలా కాకుండా.. నరకంలా ఉందని వారు గుర్తించారు. ఆ వృద్ధులు చిన్న చీకటి గదుల్లో బంధీలుగా ఉన్నారు. ఆ గదులు కంపుకొడుతూ ఉన్నాయి. కొంతమంది ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఇక్కడ దారుణం ఏంటంటే.. ఆ ఆశ్రమం వారు వృద్ధుల కుటుంబసభ్యుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. సంవత్సరానికి 2.5 లక్షల రూపాయలు వన్ టైమ్ డొనేషన్‌తో పాటు నెలకు ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారు. అంత డబ్బు తీసుకుని కూడా వృద్ధులను దారుణంగా చూస్తున్నారు. దీంతో అధికారులు ఆశ్రమ యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆ 39 మంది వృద్ధులను ప్రభుత్వం నిర్వహిస్తున్న సీనియర్ సిటిజెన్స్ కేర్ సెంటర్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి
73 ఏళ్ల బామ్మ కడుపులో.. 30 ఏళ్ల పిండం
కరెంట్ విషయంలో గొడవ.. కర్రలతో చావగొట్టిన సిబ్బంది..