Tahawwur Rana: వాళ్లకు ఇలా కావాల్సిందే!
ABN , Publish Date - Apr 12 , 2025 | 05:28 AM
తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించిన సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రాణా అప్పగింతతో ముంబై ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేసే రోజు వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో అన్నారు.

ముంబై మారణహోమం అనంతరం ఉగ్రవాది హెడ్లీతో రాణా వ్యాఖ్య
తనకు పాక్ యుద్ధవీరుల అవార్డు ‘నిషాన్ ఈ హైదర్’ ఇవ్వాలన్న ఉగ్రవాది
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ‘వాళ్లకు ఇలా కావాల్సిందే..’.. 166 మంది మరణించి, 238 మంది గాయపడిన ముంబై మారణహోమం తర్వాత ఉగ్రవాది తహవ్వుర్ హుస్సేన్ రాణా చేసిన వ్యాఖ్య ఇది. అంతేకాదు.. ఈ దుష్కృత్యాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు తనకు పాకిస్థాన్ అత్యున్నత యుద్ధవీరుల పురస్కారమైన ‘నిషాన్ ఈ హైదర్’ ఇచ్చి గౌరవించాలని కూడా ఈ కరుడుగట్టిన ఉగ్రవాది డిమాండ్ చేశాడు. తనతో కలసి నాటి దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీతో రాణా ఈ విషయాలు చెప్పినట్టు అమెరికా న్యాయశాఖ తెలిపింది. తహవ్వుర్ రాణాను భారత్‌కు అప్పగించిన సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రాణా అప్పగింతతో ముంబై ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు న్యాయం చేసే రోజు వచ్చిందని అమెరికా విదేశాంగ మంత్రి రూబియో అన్నారు. ఇదిలా ఉండగా, పటియాలా హౌస్ ఎన్‌ఐఏ కోర్టు రాణాకు 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీ విధించింది. ప్రతి 24 గంటలకోసారి రాణాకు వైద్య పరీక్షలు చేయించాలని, రోజు విడిచి రోజు అతడి తరఫు న్యాయవాదిని కలిసేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు శుక్రవారం తెల్లవారుజామున రాణాను లోధీరోడ్‌లోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉన్న ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయానికి తరలించారు. రాణాను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రత్యేకమైన సెల్‌లో ఉంచినట్టు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. 14 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉన్న ఈ గదిలో 24 గంటలూ సీసీ కెమెరా నిఘా ఉంటుందని, గార్డులు నిరంతరం కాపలాగా ఉంటారని వెల్లడించాయి. ఆ గదిలోనే ఓ మూలన బాత్రూం, నేలపై బెడ్ ఉంటుందని వివరించాయి.
రాణాను తీసుకొచ్చిన విమానం విలువ 500 కోట్లు
అమెరికా నుంచి రాణాను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఎన్‌ఐఏ అధికారులు గల్ఫ్‌స్ట్రీమ్ జీ550 విమానాన్ని వినియోగించారు. ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 12,500 కిలోమీటర్ల దూరం వెళ్లగలిగే సామర్థ్యం దీని సొంతం. దీనితోపాటు విశాలమైన క్యాబిన్, మంచి భద్రతకు కూడా ఈ జెట్ విమానాలు పేరుపొందాయి. అందుకే ప్రపంచవ్యాప్తం గా సంపన్నులు, ప్రభుత్వాధిపతులు ఈ విమానాలను వినియోగిస్తారు. ఇందులో 19 మంది ప్రయాణించవచ్చు. దీని విలువ రూ.500 కోట్లు. రాణాను తీసుకువచ్చేందుకు దీనికి సుమారు రూ.4 కోట్లు అద్దె చెల్లించినట్టు అంచనా.