భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా 25 మంది మృతి
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:32 AM
భారీ వర్షాల కారణంగా ఆదివారం 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 25 మంది మరణించారు. పిడుగుపాటు, కరెంటు షాక్‌లు, నీటిలో మునిగిపోవడం వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయారు.
పిడుగుపాటు, కరెంటు షాక్‌లతో మరణాలు
న్యూఢిల్లీ, జూన్ 15: భారీ వర్షాల కారణంగా ఆదివారం 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 25 మంది మరణించారు. పిడుగుపాటు, కరెంటు షాక్‌లు, నీటిలో మునిగిపోవడం వంటి కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఈ దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో పిడుగు పడి 13 ఏళ్ల బాలిక మరణించింది. బిజ్నోర్ జిల్లాలో మరో బాలిక వర్షం నీటిలో స్నానం చేస్తుండగా, ఆకస్మికంగా డ్రెయిన్ పొంగడంతో అందులో కొట్టుకుపోయింది. యమునానగర్ జిల్లా సోన్‌బర్సా గ్రామం లో అర్ధరాత్రి పిడుగు పడడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్, పంచమహల్ జిల్లాల్లో ఆకస్మికంగా భారీ వర్షాలు కురిశాయి. రాజ్‌కోట్ జిల్లాలో కరెంటు షాక్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పంచమహల్ జిల్లాలో పిడుగుపడి ఓ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఎలాంటి నష్టం జరగలేదు. ఢిల్లీలో ఈదురుగాలుల కారణంగా సెల్ టవర్ కూలింది. విద్యుత్తు తీగలపై ఓ చెట్టు కూలడంతో సంభవించిన కరెంట్ షాక్ కారణంగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో పిడుగులుపడి 8 మంది మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో బుధవారం వరకు 40-60 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు, ఉరుములు ఉంటాయంటూ అధికారులు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.