Indian Embassy Advisory: థాయ్‌లాండ్ వెళుతున్న పర్యాటకులకు భారతీయ ఎంబసీ కీలక సూచన
ABN , Publish Date - Dec 14 , 2025 | 03:05 PM
థాయ్‌లాండ్ వెళ్లాలనుకునే భారతీయ పర్యాటకులకు అక్కడి భారతీయ ఎంబసీ కీలక సూచన చేసింది. సరిహద్దు వెంబడి కాంబోడియాతో ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో నిషేధిత ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది.
ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్ వెళ్లాలనుకుంటున్న భారతీయ టూరిస్టులకు బ్యాంకాక్‌లోని భారతీయ ఎంబసీ కీలక సూచన చేసింది. థాయ్‌లాండ్, కాంబోడియా మధ్య సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలను సందర్శించొద్దని సూచించింది. స్థానిక అధికారులను సంప్రదించి తాజా పరిస్థితి గురించి తెలుసుకోవాలని కూడా సూచించింది. అవసరమైతే, అక్కడి టూరిస్టు డిపార్ట్‌మెంట్‌ను కూడా సంప్రదించాలని తెలిపింది. కాంబోడియాతో ఘర్షణల నేపథ్యంలో థాయ్‌లాండ్‌లో సరిహద్దు వెంబడి ఉన్న ఏడు ప్రావిన్సుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు (Indian Embassy in Thailand Advisory).
థాయ్‌లాండ్ టూరిజం శాఖ ప్రకటన ప్రకారం, ఉబాన్ రట్చాతానీ, సీసాకెట్, సురీన్, బురీరామ్, సా కేయియో, తదితర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇక ఛంతాబురీ, ట్రాట్, సా కేయియో ప్రావిన్సుల్లోని పలు జిల్లాల్లో మర్షల్ లాను విధించారు. సరిహద్దున ఉన్న కొన్ని జిల్లాలో రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు.
అయితే, ఈ ఆంక్షల వల్ల థాయ్‌లాండ్ పర్యాటక రంగానికి, రవాణా సౌకర్యాలకు ఎలాంటి ఆటంకాలు లేవని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎప్పటిలాగే ఈ సర్వీసులు అన్నీ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ప్రముఖ పర్యాటక స్థలాలైన బ్యాంకాక్, చియాంగ్ మాయ్, ఫుకెట్, క్రాబీ, పట్టాయాల్లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని థాయ్‌లాండ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాల్లో మాత్రం రైలు, బస్సు రాకపోకల్లో స్వల్ప మార్పులు చేసినట్టు తెలిపింది.
ఇక, నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్న ప్రాంతాలకు మాత్రం వెళ్లొద్దని థాయ్ టూరిజం శాఖ స్పష్టం చేసింది. సాయం కోసం పర్యాటకులు టూరిజం శాఖ కాల్ సెంటర్ నెం: 1672, టూరిస్టు పోలీస్ హెల్ప్‌లైన్ నెం: 1155, ఎస్‌ఆర్‌టీ హాట్‌లైన్ నెం: 1690, ట్రాన్స్‌పోర్టు కంపెనీ నెం 02-936-3660 కు కాల్ చేయాలని తెలిపింది. స్థానిక అధికారుల మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని కూడా టూరిజం శాఖ పేర్కొంది.
Also Read:
వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? లైఫ్‌లో ఒక్కసారైనా ఈ టౌన్‌కు వెళ్లి రావాలి!
మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా.. ఈ విషయాలను గుర్తుంచుకోండి..
For More Lifestyle News