Travel Tips: గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే
ABN , Publish Date - Nov 28 , 2025 | 04:41 PM
గూగుల్ మ్యాప్స్‌లోని ఆఫ్‌లైన్ ఫీచర్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసుండాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో పర్యటించే వారికి ఈ ఫీచర్ అమితంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ మ్యాప్స్ గురించి తెలియని వారు ఉండరు. కొత్త ప్రాంతాలకు ఏ రూట్‌లో వెళ్లాలో తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్ మ్యాప్స్‌ను వాడతారు. అయితే, మ్యాప్స్ ఆఫ్‌లైన్‌లో పనిచేయదని కూడా కొందరు పొరపాటు పడుతుంటారు. కానీ, ఫోన్ సిగ్నల్స్ లేని సందర్భాల్లో కూడా పని చేసే విధంగా మ్యాప్స్‌ను డిజైన్ చేశారనే విషయం చాలా మందికి తెలియదు. గూగుల్ మ్యాప్స్ వాడేవారికి.. ముఖ్యంగా పర్యాటకులకు ఈ ఫీచర్ గురించి కచ్చితంగా తెలిసుండాలి (Google Maps Offline).
గూగుల్ సంస్థ చెప్పేదాని ప్రకారం, యూజర్స్ ఆఫ్‌లైన్‌లో (ఫోన్ సిగ్నల్స్ లేని సమయాల్లో..) వాడుకునేందుకు వీలుగా వివధ ప్రాంతాల మ్యాప్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మ్యాప్స్‌ను ఓ ఐకాన్‌గా సేవ్ చేసుకోవచ్చు. మీరు పర్యటించాలనుకున్న ప్రాంతాల మ్యాప్‌ను టూర్‌కు ముందే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత టూర్‌లో అకస్మాత్తుగా సిగ్నల్ ఆగిపోయినా ఎలాంటి ఆటంకం లేకుండా ఆఫ్‌లైన్ మ్యాప్‌ను వాడుకోవచ్చు. ఆఫ్‌లైన్ మ్యాప్స్‌ను వాడే సమయంలో ఫోన్‌లోని డేటాకు బదులు జీపీఎస్ సాయంతో మనం ఎక్కడున్నదీ మ్యాప్‌లో తెలుస్తుంది. ఆఫ్‌లైన్ ఫీచర్ అయినప్పటికీ ఇందులో మునుపటి వలెనే అనేక ఫీచర్స్ ఉంటాయి. అంటే ఏ సందులోకి మళ్లాలి, అది ఎంత దూరంలో ఉందీ అనే విషయాల్లో మ్యాప్స్ నుంచి మునుపటి లాగానే గైడ్‌లైన్స్ అందుతాయి.
అయితే, ట్రాఫిక్ రద్దీ, ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రజారవాణా వ్యవస్థలకు సంబంధించిన రియల్ టైమ్ అప్‌డేట్స్ మాత్రం కనిపించవు. ఇక, వైఫై లేదా మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మ్యాప్‌లోని వివరాలు వాతంతట అవే అప్‌డేట్ అవుతాయి. ఇందుకోసం ఆటో అప్‌డేట్ ఫీచర్ ఆన్‌లోనే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాలు, పర్వత ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలు లేదా సొరంగ మార్గాల మీదుగా ప్రయాణించే వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుందని అనుభవజ్ఞులు చెబుతారు.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రయాణికులకు అలర్ట్.. మీ లగేజీకి ఇలాంటి తాళం మాత్రం వేయద్దు
పర్యటనలపై వెళ్లే భారతీయులు అత్యధికంగా మర్చిపోయే వస్తువులు ఏవో తెలుసా