The year 2025: ఈ ఏడాది.. వీటిని చుట్టొచ్చారు!
ABN , Publish Date - Dec 28 , 2025 | 08:47 AM
2025 వెళ్లిపోతూ ఎన్నెన్నో జ్ఞాపకాలను అందించి వెళుతోంది. పర్యాటకరంగం పరంగా భారతదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మార్మోగడానికి కారణం ‘కుంభమేళా’. ఈ అరుదైన మేళా గురించి అత్యధికంగా ఇంటర్నెట్లో వెదికారు. దీనితో పాటు ఇంటా బయటా అనేక ప్రదేశాల గురించి మనవాళ్లు సెర్చ్ చేశారు. ఈ ఏడాది భారతీయులు ఇంటర్నెట్‌లో అత్యధికంగా వెదికిన టాప్ టెన్ డెస్టినేషన్స్ ఏమిటో చూద్దాం...
విద్యుత్ వెలుగుజిలుగులు (ఫుకెట్)
గత పదేళ్లుగా బ్యాంకాక్‌తో పోటీ పడుతూ వినిపిస్తోన్న నగరం పేరు ఫుకెట్. థాయిలాండ్‌లోని ఈ దీవి ట్రావెల్ డెస్టినేషన్స్ వెదుకులాటలో ఏడో స్థానాన్ని ఆక్రమించింది. సాహస కృత్యాలు, మంచి ఆహారం, చక్కని వినోదం కావాలని అనుకునేవాళ్లు ఫుకెట్‌ను ఎంచుకుంటున్నారు. ఇక్కడ కొన్ని దీవులు ప్రత్యేకంగా కుటుంబ విహారాలుగా పేరు తెచ్చుకున్నాయి. మరికొన్ని ప్రకాశవంతమైన నైట్ లైఫ్‌కు చిరునామాగా మారాయి. ఈ- వీసా సదుపాయం, చేరువలోనే ఉండడం వల్ల భారతీయులు పుకెట్‌ను ట్రావెల్ లిస్టులో చేర్చుకుంటున్నారు.
ఒత్తిడిని పోగొట్టే సాగరతీరాలు (మారిషస్)

సాధారణంగా రొటీన్‌కు భిన్నంగా, కాస్త రిలాక్స్ కలిగించే ప్రదేశాలకే టూరిస్టులు ఎక్కువగా వెళుతుంటారు. అలాంటి సాగర తీరాల్లో మారిషస్ ఒకటి. ఫ్యామిలీ రిసార్టులు, స్నోర్కెల్లింగ్ స్పాట్స్, హనీమూన్ ప్యాకేజ్‌ల వంటి వాటితో ఆ దేశం టూరిస్టులను బాగా ఆకట్టుకుంటోంది. ‘లగ్జరీ ఎస్కేప్’, వాటర్ స్పోర్ట్స్ కోసం ఆ దేశం వైపు చూస్తున్న వాళ్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
తక్కువ బడ్జెట్ (ఫూ క్వక్)
ఇటీవల వియత్నాంకి వెళుతోన్న భారతీయ టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. సెర్చింగ్‌లో నెమ్మదిగా ముందుకు కదులుతోంది ఫూక్వక్. వియత్నాం రాజధాని హనాయి, హోచిమిన్ సిటీ, దనాంగ్‌లను పక్కకి నెట్టేస్తూ ‘ఫూ క్వక్’ అంతర్జాతీయంగా ప్రసిద్ధ డెస్టినేషన్‌గా మారుతోంది. ఇతర ఆగ్నేయాసియా దీవులతో పోలిస్తే ఫూ క్వక్ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ బీచ్ పక్కన బస, ప్రత్యేకమైన కేబుల్ రైడ్లు భలే ఆనందాన్ని కలిగిస్తున్నాయి. విభిన్నమైన ఈ నగరాన్ని తక్కువ బడ్జెట్‌లోనే చుట్టేయవచ్చు. అందుకే భారతీయ పర్యాటకులు ఇటు వైపు దృష్టి సారిస్తున్నారు.
భువిపై వెలసిన స్వర్గలోకం (కశ్మీర్)
దేశీయ టూరిస్ట్ ప్రదేశాల సెర్చింగ్‌లో కశ్మీర్ రెండో స్థానంలో (కుంభమేళా తర్వాత) నిలిచింది. ఓవరాల్‌గా ఐదో స్థానాన్ని దక్కించుకుంది. తులిప్ పూలు, మంచువానలు, స్కీయింగ్, పెరిగిన రహదారుల సంఖ్య వల్ల భువిపై వెలసిన స్వర్గం ఇదే అంటూ అంతా కశ్మీర్ బాట పడుతున్నారు.
సైకిల్ సవారీ (పాండిచ్చేరి)
తక్కువ బడ్జెట్‌లో ఫ్రెంచ్ జీవన విధానాన్ని దగ్గరగా చూడాలనుకునేవారు పాండిచ్చెరీకి వెళుతున్నారు. 2025లో పాండిచ్చేరి గురించి తెలుసుకునేందుకు భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేశారు. ప్రశాంత జీవనం, కెఫే కల్చర్, యోగా, సైకిల్ సవారీలకు ఒకప్పటి ఈ ఫ్రెంచ్ కాలనీ ప్రసిద్ధి చెందింది.
ముత్యాల్లాంటి బీచ్‌లు (ఫిలిప్పీన్స్)

దూరం ఎక్కువ అంటూ ఫిలిప్పీన్స్‌ను భారతీయులు ఇంతకాలం పక్కన పెట్టారు. కానీ ఈ ఏడాది ఆశ్చర్యంగా ‘డెస్టినేషన్ సెర్చింగ్’లో ఫిలిప్పీన్స్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ముత్యాల్లాంటి ఇసుకతిన్నెల బీచ్‌లు, పగడాల దీవులు ఫిలిప్పీన్స్‌కు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. పైగా భారతీయులకు ఆ దేశం ‘వీసా ఫ్రీ’ సదుపాయాన్ని కల్పించింది. అందరూ థాయిలాండ్‌తో పోల్చడం మొదలుపెట్టారు. అందుకే ఆ దేశానికి ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య పెరిగింది.
కుటుంబంతో కలిసి.. (మాల్దీవులు)

హనీమూన్ అనగానే మాల్దీవుల వంక చూడడం భారతీయులకు మామూలైంది. పైగా సెలబ్రిటీలందరూ లగ్జరీ వెకేషన్ల కోసం ఆ దేశాన్నే ఎంచుకుంటున్నారు. అందుకే ఈ ఏడాది ట్రావెల్ డెస్టినేషన్ సెర్చింగ్‌లో మాల్దీవులు ఎనిమిదో స్థానాన్ని ఆక్రమించింది. చాలామంది తక్కువ బడ్జెట్‌లో రిసార్టు డీల్స్‌ను కుదుర్చుకుంటున్నారు. ఇక్కడ మరో ఎట్రాక్షన్ సీప్లేన్ రవాణా. అందుకే రొమాంటిక్, ఫ్యామిలీ డెస్టినేషన్స్ కోసం మాల్దీవులు టాప్ ఐలాండ్‌గా మారింది.
మునుపెన్నడూ లేని విధంగా మన దేశంలో ఆధ్యాత్మిక యాత్రలు పెరిగాయి. అందుకే ‘స్పిర్చువల్ డెస్టినేషన్స్’లో సోమ్‌నాథ్ ముందుంది. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ జ్యోతిర్లింగాలలో ప్రథమ స్థానంలో ఉంది. అరేబియా సముద్రతీరంలోని ఈ ఆలయ పరిసరాలు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చాలా కుటుంబాలు సోమ్‌నాథ్‌తో పాటు ద్వారకను కలిపి టూర్ ప్లాన్ చేసుకుంటున్నాయు. ఈ రెండు ప్రసిద్ధ ఆలయాలు ఒకే రాష్ట్రంలో ఉండడం విశేషం.
త్రివేణీ సంగమం (ప్రయాగ్‌రాజ్)
భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రాంతాలలో మొదటి స్థానాన్ని ‘ప్రయాగ్ రాజ్’ సొంతం చేసుకుంది. అంతేకాదు... మునుపెన్నడూ లేనంతగా అక్కడికి పర్యాటకులు, ఫోటోగ్రాఫర్లు వెళ్లారు. ఈ ఏడాది జరిగిన మహా కుంభమేళా ఎంతో విశిష్టమైనదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 144 ఏళ్లకు ఓసారి జరిగే క్రతువు అది. మునుపెన్నడూ లేనంతగా నేల నాలుగు చెరుగుల నుంచి అనేకమంది ఈ ఆఽధ్యాత్మిక ప్రయాణంలో పాలుపంచుకున్నారు. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశం కాబట్టి సాధారణంగానే ఇక్కడ యాత్రికుల రద్దీ ఏడాదంతా ఉంటుంది.
వైన్ టూర్లు (జార్జియా)

భారతీయ సినిమా షూటింగ్‌లకు ఇటీవల అందమైన చిరునామాగా జార్జియాను పేర్కొంటున్నారు. రాజధాని తుబులిసీ అందాలు, ప్రకృతి రమణీయత 2025 సెర్చింగ్‌లో జార్జియాను మూడో స్థానంలో నిలబెట్టాయి. వైన్ టూర్లు, కాజ్‌బేగి రోడ్డు ట్రిప్‌ల కోసం జార్జియా దేశానికి చాలామంది వెళుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News