Share News

ఏడాదికోసారి ‘కట్టే’స్తారు.. ఈ విచిత్ర వంతెన గురించి తెలుసుకోండిలా..

ABN , Publish Date - Sep 07 , 2025 | 09:56 AM

వర్షాకాలం నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ఆ సమయంలో నది దాటాలంటే వంతెన ఉండాల్సిందే. కానీ విచిత్రంగా కాంబోడియావాసులు మాత్రం వర్షాకాలం ప్రారంభం కావడంతోనే అక్కడి మెకాంగ్‌ నదిపై ఉన్న వెదురు వంతెనను తొలగిస్తారు. నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టాక తిరిగి వెదురు వంతెన నిర్మించుకుంటారు.

 ఏడాదికోసారి ‘కట్టే’స్తారు.. ఈ విచిత్ర వంతెన గురించి తెలుసుకోండిలా..

వర్షాకాలం నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. ఆ సమయంలో నది దాటాలంటే వంతెన ఉండాల్సిందే. కానీ విచిత్రంగా కాంబోడియావాసులు మాత్రం వర్షాకాలం ప్రారంభం కావడంతోనే అక్కడి మెకాంగ్‌ నదిపై ఉన్న వెదురు వంతెనను తొలగిస్తారు. నదిలో నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టాక తిరిగి వెదురు వంతెన నిర్మించుకుంటారు. బాగున్న వంతెనను ఎందుకు తొలగిస్తారు? తిరిగి ఎందుకు నిర్మించుకుంటారు?

కాంబోడియాలోని మెకాంగ్‌ నది మధ్యలో కొహ్‌పెన్‌ దీవి ఉంటుంది. మెకాంగ్‌ నది ఆ ప్రాంతంలో రెండు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. వాటి మధ్యలోనే కొహ్‌పెన్‌ దీవి ఉంటుంది. ఆ దీవి ప్రజలు దగ్గరలో ఉన్న కాంపాంగ్‌ చామ్‌కు చేరుకోవడానికి వెదురు కర్రలతో నిర్మించిన వంతెనను ఉపయోగిస్తుంటారు. కిలోమీటరు పొడవున్న ఆ వంతెనపై నుంచే ఆ దీవిలో నివసించే వారంతా రాకపోకలు సాగిస్తుంటారు. వెదురు వంతెనే అయినా కార్లు, జీపులు, మోటరు సైకిళ్లు దానిపై నుంచి భేషుగ్గా వెళ్తుంటాయి. ఈ వెదురు వంతెన నిర్మాణంలో దాదాపు 50 వేల వెదురు కర్రలను ఉపయోగించారు. కొహ్‌పెన్‌ దీవిలో సుమారు వెయ్యి కుటుంబాల దాకా నివసిస్తున్నాయి. వారికి ఇదొక్కటే దారి. అయితే వర్షాలు సమృద్ధిగా కురిసి, నది ఉప్పొంగి ప్రవహించే సమయం రాగానే వంతెనను తొలగిస్తారు. ఆ సమయంలో నదిని పడవలపై దాటుతుంటారు.


book5.2.jpg

ఏటా ఇదే తంతు

ప్రతి ఏటా వర్షాలు కురిసి, నదికి వరదలు వచ్చే సమయానికి వంతెనను తొలగించే పనులు ముమ్మరం చేస్తారు. నిజానికి నది ఉగ్రరూపం దాల్చినప్పుడే వంతెన అవసరమవుతుంది. కానీ ఇక్కడ మాత్రం భిన్నం. నది ఉప్పొంగితే ప్రజలు పడవలపై ప్రయాణం చేస్తారు. ఆ సమయంలో అక్కడ వంతెన ఉండదు. ఎందుకంటే భారీ వరదలు వస్తే వెదురు వంతెన మొత్తం కొట్టుకుపోతుంది. అందుకే దీవిలోని వారంతా వరదలు రాకముందే కర్రలను జాగ్రత్తగా తొలగిస్తారు. ఆ వెదురు కర్రలను పక్కన పెడతారు. లేదంటే వాటిని ఇతర నిర్మాణాలకు వాడతారు. వరదలు తగ్గి ఇసుక మేటలు బయటపడి, ఇక పడవ ప్రయాణం వీలు కాదు అన్నప్పుడు తిరిగి వంతెన నిర్మాణం చేసుకుంటారు. ఈ వెదురు వంతెనను ప్రతీసారి స్థానికులే నిర్మించుకుంటారు. మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు వెదురు వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తారు. ప్రపంచంలోనే అతి పొడవైన ‘బ్యాంబూ బ్రిడ్జ్‌’గా ఈ వంతెనకు పేరుంది.


వాహనాలు కూడా వెళ్తాయి...

వంతెన నిర్మాణశైలి కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దూరం నుంచి చూస్తే అగ్గిపుల్లలతో చేసిన నిర్మాణంలా కనిపిస్తుంది. వెదురు కర్రలు కదా వంతెన బలంగా ఉండదనుకుంటే పొరపాటే. ద్విచక్రవాహనాతో పాటు కార్లు, జీపులు, గుర్రపుబండ్లు కూడా ఈ వెదురు వంతెనపై ప్రయాణిస్తాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే... వంతెనపై ఎక్కువ ఒత్తిడి పడినప్పుడు వెదురు కర్రలు వంగుతాయే తప్ప విరగవు. నాలుగు టన్నుల వరకు బరువున్న వాహనాలు కూడా ఈ వంతెనపై వెళ్లవచ్చు.


కాకపోతే కాస్త నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. ఏటా ఈ కర్ర వంతెనను చూసేందుకు పర్యాటకులు ఆసక్తిగా అక్కడికి వెళ్తుంటారు. వంతెనపై ప్రయాణానికి స్థానికులకైతే (భారత కరెన్సీలో) రూ. 2 వసూలు చేస్తారు. విదేశీ పర్యాటకులైతే సుమారు రూ.90 చెల్లించాల్సి ఉంటుంది. రోజూ ఈ వంతెన ద్వారా సుమారు 20 వేల నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తుందట. ఈ వంతెనకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక కాంక్రీటు వంతెన కూడా ఉంది. కానీ స్థానికులు మాత్రం దగ్గరిదారిగా చెప్పుకుంటూ ఈ వెదురు వంతెననే వాడుతుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..

ఆ రాశి వారికి ఈ వారం అంతా డబ్బే డబ్బు..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 07 , 2025 | 09:56 AM