Share News

Boss: టీనేజ్‌లోనే ‘బాస్‌’లవుతున్నారు...

ABN , Publish Date - Dec 14 , 2025 | 10:19 AM

పద్దెనిమిది ఏళ్ల వయసప్పుడు... కంప్యూటర్స్‌ అంటే మక్కువ ఉన్న ఓ సాధారణ సైన్స్‌ విద్యార్థి దీపక్‌ రవీంద్రన్‌. అప్పుడే తొలి స్టార్టప్‌ వెంచర్‌ ‘ఇన్నోజ్‌ టెక్నాలజీస్‌’ను ప్రారంభించాలని ఇంజనీరింగ్‌ చదువును మధ్యలో మానేశాడు. అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిశారు.

Boss: టీనేజ్‌లోనే ‘బాస్‌’లవుతున్నారు...

ఉదయం నిద్రలేవగానే బిజినెస్‌ రిపోర్ట్స్‌ చూస్తారు. మార్నింగ్‌వాక్‌లోనే ముఖ్యమైన నోట్స్‌ ‘స్మార్ట్‌’గా పరిశీలిస్తారు. అర్జెంట్‌ ఫైల్స్‌ను కాఫీ తాగుతూనే క్లియర్‌ చేస్తారు. ఆఫీస్‌ మీటింగ్‌... బిజినెస్‌క్లాస్‌లో విదేశాలకు ప్రయాణం... ఎంవోయూలు... క్షణం కూడా తీరికుండదు. ఇదంతా ‘బిగ్‌’బాస్‌ల బిజీ లైఫ్‌ అనుకుంటే పొరపడినట్టే. ఇప్పుడు వ్యాపారరంగంలో ‘టీనేజ్‌’ బాస్‌లూ ఇరగదీస్తున్నారు. టీనేజ్‌లోనే పెద్ద పెద్ద సంస్థలను స్థాపించి, మిలియనీర్లుగా మారుతున్నారు. వారి సక్సెస్‌గ్రాఫ్‌ చూసి, ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే...

చిట్టి అనుభవమే వ్యాపారంగా...

తిలక్‌ మెహతా

ఫౌండర్‌ - పేపర్స్‌ ఎన్‌ పార్శిల్స్‌, కోఫౌండర్‌ ఎంఅండ్‌ఎ అనలిస్ట్‌

ఓసారి సెలవులకి మేనమామ ఇంటికి వెళ్లాడు తిలక్‌ మెహతా. లెక్కల పుస్తకం అక్కడే మరచిపోయినట్టుగా ఇంటికి వచ్చాకే తెలుసుకున్నాడు. కొరియర్‌ ద్వారా తెప్పించుకోవాలని చూస్తే చాలా ఖరీదైన వ్యవహారం అనిపించింది. నాన్నని అడిగితే ముంబై మహానగరంలో అంతదూరం వెళ్లిరావడం కష్టమని చేతులెత్తేశారు. ఏం చేయాలని ఆలోచిస్తున్న తిలక్‌కు వచ్చిన ఆలోచనే ‘పేపర్స్‌ ఎన్‌ పార్శిల్స్‌’ సంస్థను ఏర్పాటుచేసేలా పురిగొల్పింది. అప్పుడు తిలక్‌ వయసు 13 ఏళ్లు. ఏదైనా సంస్థ అంటే ఉద్యోగులు, వేతనాలు, ఖర్చులు మామూలే. ఇవన్నీ లేకుండా తిలక్‌ ముంబైలో లంచ్‌ బాక్సులను అందించే ‘డబ్బావాలా’లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.


డబ్బావాలాల మొబైల్‌ యాప్‌లో ఎప్పటికప్పుడు పార్సిల్‌ డెలివరీ నోటిఫికేషన్‌ వస్తుంది. ఆ పార్శిల్‌ను అందజేసినందుకు వాళ్లకి కమీషన్‌ అందుతుంది. అలాగే సంస్థకు కూడా. ఏ రోజుకి ఆరోజే డెలీవరీ అన్నది ఈ సంస్థ ముఖ్యోద్దేశం. పైగా రుసుములు తక్కువ. కరోనా సమయంలో వీళ్ల బిజినెస్‌ ఆకాశమే హద్దుగా సాగింది. ఆ సమయంలోనే వాళ్ల కంపెనీ రూ.100 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంది. ఈ బాలమేధావిని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ‘టెడెక్స్‌ టాక్స్‌’లో కూడా మాట్లాడాడు. ప్రసిద్ధ ‘ఫోర్బ్స్‌’ మ్యాగజైన్‌లో తిలక్‌ ఇంటర్య్వూ అచ్చయింది.


వర్చువల్‌ అకాడమీ...

రోహిత్‌ కశ్యప్‌

ఫౌండర్‌ అండ్‌ సీఈఓ - మేట్రీ స్కూల్‌

book5.2.jpg

ఆర్థిక కారణాల వల్ల రోహిత్‌ ఏడో తరగతిలోనే స్కూల్‌ మానేశాడు. వాళ్లది బిహార్‌ రాజధాని పాట్నా. ఆ తర్వాత చదువు మీద మక్కువతో ఓపెన్‌ స్కూల్‌లో చేరాడు. కోడింగ్‌, బిజినెస్‌ల గురించీ నేర్చుకున్నాడు. 13 ఏళ్లకే ‘ఫుడ్‌కూబో’ పేరుతో ఓ ఫుడ్‌ టెక్‌ స్టార్టప్‌ని ప్రారంభించాడు. కొన్నేళ్ల తరవాత దాన్ని అమ్మేశాడు. తనలా స్కూల్‌ మానేసిన పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ‘మేట్రీ స్కూల్‌ ఆఫ్‌ ఆంత్రోప్రెన్యూర్‌షిప్‌’ ప్రారంభించాడు. అదో వర్చువల్‌ అకాడమీ. అప్పుడు రోహిత్‌కి 19 ఏళ్లు. గ్రామీణ యువతకు బిజినెస్‌, బ్రాండ్‌ కన్సల్టింగ్‌ సంస్థగా ఇది పనిచేస్తోంది. మొబైల్‌ అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేస్తోంది. వాళ్లలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తోంది. దీని వల్ల రోహిత్‌కు ఎంతో పేరు వచ్చింది. సమాజానికి సరికొత్త దారి చూపిన ప్రతిభావంతులకు ఐక్యరాజ్యసమితి అందించే ‘కర్మవీర్‌ చక్ర’ అవార్డును రోహిత్‌ అందుకున్నాడు. ఐఐటీ, ఐఐఎం, బిట్స్‌ పిలాని లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థలలో ‘కీ నోట్‌ స్పీకర్‌’గా రోహిత్‌ తన ఐడియాలు పంచుకోవడంతో పాటు యువతకు మార్గనిర్దేశం చేస్తున్నాడు.


భారతీయ జుకర్‌బర్గ్‌

దీపక్‌ రవీంద్రన్‌

కోఫౌండర్‌- ఇన్నోజ్‌ టెక్నాలజీస్‌, కోఫౌండర్‌ అండ్‌ సీఈఓ - జెనీ

పద్దెనిమిది ఏళ్ల వయసప్పుడు... కంప్యూటర్స్‌ అంటే మక్కువ ఉన్న ఓ సాధారణ సైన్స్‌ విద్యార్థి దీపక్‌ రవీంద్రన్‌. అప్పుడే తొలి స్టార్టప్‌ వెంచర్‌ ‘ఇన్నోజ్‌ టెక్నాలజీస్‌’ను ప్రారంభించాలని ఇంజనీరింగ్‌ చదువును మధ్యలో మానేశాడు. అతడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు కలిశారు. ప్రపంచంలో అతిపెద్ద ఆఫ్‌లైన్‌ సెర్చ్‌ఇంజిన్‌ అదే. చాలా ఏళ్లు విజయవంతంగా పనిచేసిన తరవాత దాన్ని 2013లో ఓపెన్‌ సోర్స్‌లో పెట్టేశారు. ఆ తరవాత 500 స్టార్టప్‌ల సహకారంతో ‘క్వెస్ట్‌’ అనే మొబైల్‌ నాలెడ్జ్‌ ప్లాట్‌ఫామ్‌ను కనుగొన్నారు. ప్రస్తుతం ఏఐ కామర్స్‌ ఇంజిన్‌ ‘జెనీ’ని నిర్మిస్తున్నాడు. ‘భారతీయ మార్క్‌ జుకర్‌బర్గ్‌’గా దీపక్‌ ప్రసిద్ధి చెందాడు. ఆసియాలో ‘21 ఎమర్జింగ్‌ లీడర్స్‌ అండర్‌ 40’లలో ఒకరిగా కేరళకు చెందిన దీపక్‌ పేరు తెచ్చుకున్నాడు.


టెక్‌ సోదరులు

శ్రవణ్‌, సంజయ్‌

ఫౌండర్స్‌ - గో డైమెన్షన్స్‌

book5.3.jpg

శ్రవణ్‌ కుమరన్‌, సంజయ్‌ కుమరన్‌ అంటే చెన్నైలో తెలియని వారుండరు. ఈ సోదరులిద్దరూ అతి చిన్న వయసులోనే విజయాన్ని అందుకున్న టెక్‌ ఆంత్రోప్రెన్యూర్లుగా వార్తల్లో నిలిచారు. వాళ్లకి 12, 10 ఏళ్లున్నప్పుడే ‘గో డైమెన్షన్స్‌’ పేరుతో సంస్థను స్థాపించి ఒకరు సీఈఓగా, మరొకరు ప్రెసిడెంట్‌గా మారారు. వీళ్లిద్దరూ కలిసి 2011లో మొదట తయారుచేసిన యాప్‌ ‘క్యాచ్‌ మీ కాప్‌’. దొంగ పోలీస్‌ ఆట ఆధారంగా ఈ అప్లికేషన్‌ను తయారుచేశారు. ఆ తర్వాత ‘ఆల్ఫాబెట్‌ బోర్డు’, ‘కలర్‌ ప్యాలెట్‌’, ‘ఎమర్జెన్సీ బూత్‌’, ‘సూపర్‌ హీరో’, ‘కార్‌ రేసింగ్‌’ లాంటి 11 యాప్‌లను రూపొందించారు. అన్నింటినీ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్స్‌లో వినియోగించేలా రూపొందించడం విశేషం. ఇప్పటికే 60కి పైగా దేశాలలో ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని ఫోన్లలో తమ యాప్‌లు ఉపయోగించే రోజు కోసం ఈ టెక్‌ సోదరులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ... తమ మేధకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నారు.


చరిత్ర సృష్టించాడు...

అఖిలేంద్ర సాహు

ఫౌండర్‌ - ఎఎస్‌టిఎన్‌టి టెక్‌

book5.4.jpg

ప్రపంచంలోనే పిన్న వయస్కుడైన చైన్‌ ఆంత్రోప్రెన్యూర్‌గా అఖిలేంద్ర సాహు చరిత్రలోకి ఎక్కాడు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ ఇతడి సొంతూరు. 12 ఏళ్లకే సొంత యూట్యూబ్‌ ఛానల్‌ స్థాపించాడు. పదహారేళ్ల నుంచే మీడియాకు ఫ్రీలాన్సింగ్‌ చేస్తున్నాడు. 20 ఏళ్లు వచ్చేసరికి పది సంస్థలు ఏర్పాటుచేశాడు. అందులో క్విక్‌ ఎల్‌ఎల్‌సి, ఎఎస్‌టిఎన్‌టి టెక్నాలజీస్‌, స్టార్టప్‌ 199, న్యూస్‌వైర్‌ లాంటివి ఉన్నాయి. ప్రస్తుతం 645 ప్లస్‌ కంపెనీలకు బ్రాండ్‌ స్ట్రాటజిస్ట్‌గా సేవలు అందిస్తున్నాడు. వందకు పైగా న్యూస్‌ సైట్స్‌ ఇతడి సొంతం. పవర్‌ఫుల్‌ పీఆర్‌ స్టోరీటెల్లింగ్‌లో అఖిలేంద్రను మించినవారు లేరు. వివిధ కంపెనీలే కాదు... పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ కుర్రాడి అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తుంటారు.


డిజిటల్‌ బ్రాండింగ్‌...

శ్రీలక్ష్మీ సురేష్‌

ఫౌండర్‌ - ఇడిజైన్‌, టైనీలోబో

కేరళలోని కోజికోడ్‌కు చెందిన శ్రీలక్ష్మీ సురేష్‌ విజయాల్లో అన్నీ అబ్బురపరచే అంశాలే. సాధారణంగా 6 ఏళ్లకు పిల్లలు పాఠ్యపుస్తకాలను కూడా సరిగా చదవలేరు. కానీ శ్రీలక్ష్మి ఆరేళ్లకే వెబ్‌సైట్స్‌ను డిజైన్‌ చేసింది. ఎనిమిదేళ్లకు స్కూల్‌ వెబ్‌సైట్‌నూ రూపొందించింది. పదకొండేళ్లకే ‘ఇడిజైన్‌’ పేరుతో సొంతంగా సంస్థను ఏర్పాటుచేసి, సీఈఓగా మారింది. అలా పదకొండేళ్లకే సీఈఓ అయిన అమ్మాయిగా సంచలనం సృష్టించి, వార్తల్లో నిలిచింది శ్రీలక్ష్మి. ఆ తరవాత ‘టైనీలోబో’ పేరుతో డిజిటల్‌ బ్రాండింగ్‌ సర్వీసులు అందించే సంస్థను ప్రారంభించింది. అనేక స్కూళ్లు, కార్పొరేట్‌ సంస్థలు ఆమె క్లయింట్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధ మైక్రోసాఫ్ట్‌, నోకియా, కోకాకోలా లాంటి సంస్థలతో ఆమె పనిచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి నెట్‌వర్త్‌ 6 మిలియన్‌ డాలర్లు.


ఐఐటిలో గెస్ట్‌ లెక్చరర్‌

ఫర్హాద్‌ ఆసిడ్‌వాలా

ఫౌండర్‌ - రాక్‌స్టా మీడియా, కో ఫౌండర్‌- కన్య్జూమర్‌ గార్డ్‌

పదమూడేళ్లు కూడా లేని పిల్లాడు తన తల్లిదండ్రుల దగ్గర పది డాలర్లు తీసుకుని ఓ ఆన్‌లైన్‌ కమ్యూనిటీని నెలకొల్పాడు. అది ఏవియేషన్‌, ఏరో మోడలింగ్‌కు సంబంధించింది. కొన్నేళ్లకు ఆ ప్రాజెక్టును 1200 డాలర్లకు అమ్మేశాడు. అందులో 400 డాలర్లతో ‘రాక్‌స్టా మీడియా’ నెలకొల్పాడు. అదే ప్రసిద్ధ ‘సీఎన్‌ఎన్‌’కి యంగ్‌ ఆంత్రోప్రెన్యూర్‌గా ఇంటర్య్వూ ఇచ్చేలా చేసింది. ఆ టీనేజరే మహారాష్ట్రకు చెందిన ఫర్హాద్‌ ఆసిడ్‌వాలా. అప్పుడు అతడి వయసు 17 ఏళ్లు మాత్రమే. వెబ్‌ డెవలప్‌మెంట్‌, మార్కెటింగ్‌, అడ్వర్జయిజ్‌మెంట్‌, బ్రాండింగ్‌కు సంబంధించిన సంస్థ ఇది. అప్పటి నుంచి ఫర్హాద్‌కు ఎన్నో ప్రశంసలు లభించాయి. ‘జనరేషన్‌ నెక్ట్స్‌ అఛీవర్‌ అండర్‌ 25’, ‘ఇండియాలో టాప్‌ ట్విట్టర్‌ యూజర్లలో ఒకడు’, ‘25 ఇంటర్నెట్‌ సక్సెస్‌ స్టోరీస్‌ అండర్‌ 25’... ఇలాంటి చాలా సక్సెస్‌ లిస్టుల్లో ఫర్హాద్‌ పేరుంటుంది. ఇప్పటికే ‘టెడెక్స్‌ టాక్స్‌’లో మూడుసార్లు మాట్లాడిన ఘనతతో పాటు... ‘ఐఐటి ఖరగ్‌పూర్‌’లో గెస్ట్‌ లెక్చర్‌ ఇస్తున్నవారిలో అత్యంత పిన్నవయస్కుడిగా పేరు తెచ్చుకున్నాడు.


ఏది అవసరం?

అతి చిన్న వయసులోనే అద్భుతమైన ఆవిష్కరణలు చేసి, బిజినెస్‌ బాస్‌లుగా ఎదిగిన యువ విజేతల కథనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్థం అవుతాయి.

- మానసిక వైఖరి: అందరిలోకీ భిన్నంగా, కొత్తగా, సృజనాత్మకంగా, ఆ సమయానికి తగినట్టుగా వీళ్లు ఆలోచించి, విజయాన్ని అందుకున్నారు. ఈ టీనేజర్ల విషయంలో వయసు అనేది ముఖ్యం కాదని తెలుస్తోంది. అనువజ్ఞులు మాత్రమే సాధించగలరన్నది అన్నివేళలా సరికాదు.


- చిన్న అడుగు, పెద్ద ఆలోచన: ఈ పసి ఆంత్రోప్రెన్యూర్లందరూ ప్రారంభంలో బుల్లి బుల్లి అడుగులతోనే మొదలుపెట్టి, ఉన్నత శిఖరాలను అందుకున్నారు. మొదట తమ చుట్టు పక్కల తమ ఆలోచనలను ప్రవేశపెట్టి, ఆ తర్వాత తమ వ్యాపారాన్ని విస్తరించారు. ఒక్క ఉత్పత్తితో మొదలుపెట్టి, ప్రగతిని ట్రాక్‌ చేశారు. ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. ఆ విధంగా బిజినెస్‌ అభివృద్ధి చేసుకున్నారు. ఈ శైలే వాళ్లని గొప్ప వ్యాపారవేత్తలుగా మార్చింది.

- డిజిటల్‌ సాయంతో: సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా... సాంకేతికత, సోషల్‌ మీడియా ఆధారంగా వీళ్లు తమ వ్యాపారాలను వృద్ధి చేసుకున్నారు. కస్టమర్లతో ప్రత్యక్షంగా అనుసంధానం ఏర్పరచుకోవడానికి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించారు. సేల్స్‌ పెరిగేలా చూసుకున్నారు.


ఎలా మొదలుపెట్టాలి?

స్కూలు, కాలేజీల్లో చదువుతున్నప్పుడే ఆంత్రోప్రెన్యూర్లుగా జీవితాన్ని మొదలుపెట్టిన చిచ్చరపిడుగులు ఎందరో మన కళ్ల ముందే ఉన్నారు. వీళ్లంతా ‘పర్ఫెక్ట్‌’ మూమెంట్‌ కోసం ఎదురుచూడకుండా... తమ ఆలోచనలకు వెంటనే కార్యరూపం ఇచ్చి విజయాన్ని అందుకున్నారు. ఇంటా బయటా గుర్తింపును సాధించారు. ఇలా చిన్న వయసులోనే సమాజానికి మార్గనిర్దేశం చేసిన వాళ్ల దారిలో మీరూ నడవాలని అనుకుంటే, ఈ విషయాలపై దృష్టిసారించాలి...


- సమస్యలను గుర్తించి, వాటిని తీర్చే దారులను వెతకాలి: ‘ఆవశ్యకతే ఆవిష్కరణలకు తల్లి’ అన్నది తెలిసిందే. సమస్యకు పరిష్కారంగా మొదలైనవే అన్ని ఆవిష్కరణలు. అందుకే ప్రజల అవసరాలు, సమస్యలు ఏమిటో తెలుసుకోవాలి? దీని కోసం ఎప్పటికప్పుడు ప్రజలతో కలవడం అవసరం. వాళ్ల జీవితాలను సుఖమయం చేయడానికి ఎలాంటి సృజనలు చేయాల్సిన అవసరం ఉందన్న కోణంలో ఆలోచనలను మొదలుపెట్టాలి. ఆ సృజనలు సమాజానికి పనికొచ్చేవిగా ఉండాలి. సృజనాత్మకంగానే కాకుండా, తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో చేయగలిగేలా ఉండాలి. అప్పుడే అందరికీ అందుబాటులోకి వస్తాయి.


- నైపుణ్యం పెంపొందించుకోవాలి: కేవలం ఐడియా ఉంటే సరిపోదు... లక్ష్యాన్ని సాధించే నైపుణ్యత అవసరం. ద్రవ్య వినిమయం, కస్టమర్లను అర్థం చేసుకోవడం, ఐడియాలను మార్కెటింగ్‌ చేయగల స్కిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలి. కస్టమర్లతో మీ ఐడియాలను సరిచూసుకోవడానికి మినీ బిజినెస్‌ ఎక్స్‌పరిమెంట్స్‌ సహాయపడతాయి. అవసరమమైతే ఫ్రీలాన్స్‌ ప్రాజెక్టులు కూడా చేయవచ్చు. ‘స్టార్ట్‌ స్మాల్‌’ అనేది ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ బుడిబుడి అడుగులే మిమ్మల్ని జాగ్రత్తగా ముందుకు నడిపిస్తాయి. తొందరగా పాఠాలు నేర్పిస్తాయి. తక్కువ ఖర్చుతో మొదలుపెట్టడం వల్ల ఒకవేళ ఫెయిల్‌ అయినా మీ మీద అంతగా ప్రభావం చూపదు. ఒకవేళ సక్సెస్‌ అయితే మీ వ్యవహారాలను విస్తృతపరచుకోవచ్చు.


book5.5.jpg

- ఫీడ్‌బ్యాక్‌ ముఖ్యం: మార్కెట్లోకి వచ్చిన వెంటనే ఏ ఉత్పత్తి కూడా విజయం సాధించదు. అందరికీ రీచ్‌ అయ్యేలా ప్రమోట్‌ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ ఉత్పత్తి గురించి పలు రకాల సమూహాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి. ఆ డేటాను బట్టి మెరుగులు దిద్దుకోవాలి. అయితే దీని కోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ను బాగా ఉపయోగించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్లను పొందాలంటే బ్రాండ్‌ ఇమేజ్‌ను మెరగుపరచుకోవడమే కాదు... సోషల్‌ మీడియాలో విజిబిలిటీ పెంపొందించుకోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇండియా కూటమిని ఏకం చేస్తాం

మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నా గృహ రుణం రావటం లేదా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2025 | 10:19 AM