Share News

Kitchen Hacks: ఫ్రిజ్ వాటర్ బాటిల్ ప్రతి రోజూ శుభ్రం చేయాలా? వద్దా?

ABN , Publish Date - Jun 04 , 2025 | 02:41 PM

Water Bottle Cleaning Hacks: ఫ్రిజ్‌లో ఉంచే వాటర్ బాటిల్ ప్రతిరోజూ కడగాలా? వద్దా? అని సందేహంగా ఉందా. మీరు అనారోగ్యం పాలు కాకూడదంటే ఫ్రిజ్ వాటర్ బాటిల్ ఎలా శుభ్రపరచాలి? ఎన్నిసార్లు కడిగితే ఆరోగ్యకరం అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Hacks: ఫ్రిజ్ వాటర్ బాటిల్ ప్రతి రోజూ శుభ్రం చేయాలా? వద్దా?
Fridge Water Bottle Cleaning

Fridge Water Bottle Cleaning Hacks: చల్లటి నీరు తాగాలాని ప్రతిరోజూ వాటర్ బాటిల్‌ను ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు చాలామంది. కానీ మీరు ఈ బాటిల్‌ను ఎన్ని రోజుల తర్వాత కడుగుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని అడిగితే చాలా మంది గుర్తుండదనే అంటారు. ఎందుకంటే దాదాపు అందరూ వారం లేదా రెండు వారాలకు ఒకసారే బాటిల్‌ను కడుగుతారు. మరికొందరు బాటిల్‌ను కడిగిన తర్వాత నీరు నింపి పెట్టాలనే నియమాన్ని పాటించరు. తోచినప్పుడు మాత్రమే బాటిల్ శుభ్రపరుస్తుంటారు. కానీ, ఫ్రిజ్‌లో ఉంచిన బాటిల్‌ను కడగడానికి సరైన సమయం ఏమిటో మీకు తెలుసా? ఫ్రిజ్‌లో ఉంచిన బాటిల్‌ను ఎన్ని రోజుల తర్వాత కడగడం ఆరోగ్యకరం? ఇక్కడ తెలుసుకోండి..


ప్రతిరోజూ బాటిల్ కడగాలా?

ఫ్రిజ్‌లో ఉంచిన వాటర్ బాటిల్‌ను ప్రతిరోజూ తాగడానికి ఉపయోగిస్తుంటే కచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే తేమ వాతావరణంలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ. మీరు రోజూ ఉపయోగించే బాటిల్‌ను సకాలంలో కడగకపోతే దాదాపు 24 గంటల్లో మిల్లీలీటర్‌కు ఒకటి నుంచి రెండు మిలియన్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే బాటిల్ ఖాళీ చేసిన వెంటనే నీరు నింపే ముందు కచ్చితంగా కడిగి తీరాలి. ప్రతిరోజూ ముఖ్యంగా బాటిల్ మూతను క్లీన్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే, మూతలో అత్యధిక బ్యాక్టీరియా ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం నీటి సీసాలో సగటున 20 మిలియన్లకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది. కానీ, ఈ విషయం సాధారణ ప్రజలకు తెలియదు. అందుకే రోజూ బాటిల్‌ను కడగరు.


బాటిల్ కడగడానికి సరైన మార్గం ఏమిటి?

మీరు రోజూ నీరు తాగే బాటిల్‌ను కడగడానికి కొన్ని మార్గాలున్నాయి. ముందుగా బాటిల్, దాని మూతను లోపలి నుండి స్క్రబ్ లేదా బాటిల్ బ్రష్ సహాయంతో శుభ్రం చేయండి. వేడి నీరు లేదా సబ్బును కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల బాటిళ్లో ఉండే క్రిములు, బ్యాక్టీరియా నశిస్తాయి. ఇలా క్రమం తప్పకుండా కడగడం వల్ల అసహ్యకరమైన వాసనలు, నీటి రుచిలో మార్పు రాదు. క్రిములు నీటిలో పెరగకుండా ఉండాలంటే నీటి సీసాను తరచూ కడగడం అవసరం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, బాటిల్ కడిగిన తర్వాత పూర్తిగా తేమ ఆరిపోయాకే నీటిని నింపి ఫ్రిజ్ లో ఉంచాలి.


ఈ విషయంలో జాగ్రత్త..!

నీటి బాటిల్ గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచితే బాటిల్‌లో బ్యాక్టీరియా అత్యంత వేగంగా పెరుగుతుంది.


బాటిల్‌ను ఫ్రిజ్‌లో పెడితే బ్యాక్టీరియా పెరగదా?

బాటిల్ లో బ్యాక్టీరియా పెరుగుదల వేగాన్ని తగ్గించాలనుకుంటే దానిని ఫ్రిజ్ లో ఉంచాలి అనే మాట కేవలం అపోహ మాత్రమే. నిజం కాదు. మీరు వాటర్ బాటిల్ ఫ్రిజ్ లో ఉంచినప్పటికీ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఎందుకంటే చాలా బ్యాక్టీరియా నీటితో పాటు నోటి నుంచి బాటిల్ లోకి వెళుతుంది. కాబట్టి, ఫ్రిజ్ లో ఉంచే బాటిల్ ను ప్రతిరోజూ కడగడం అవసరం.


Also Read:

పీరియడ్స్ సమయంలో మహిళలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

కూకట్‌పల్లి డ్రగ్స్‌ కేసు.. కానిస్టేబుల్ కోసం ముమ్మరంగా గాలింపు

For More Lifestyle News

Updated Date - Jun 04 , 2025 | 03:15 PM