Share News

విజ్ఞానం.. వినోదం.. ఒకేచోట

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:25 AM

కొండలపైన దేవాలయాలు ఉండటం సాధారణమే. కానీ కొండపై గ్రంథాలయం ఉండటం ఎక్కడైనా చూశారా? చైనాలోని ‘మియాన్హువా’ గ్రామానికి వెళితే... కొండ అంచుల్లో ఉన్న గ్రంథాలయం పుస్తక ప్రియులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది.

విజ్ఞానం.. వినోదం.. ఒకేచోట

గ్రంథాలయాలు, బుక్‌స్టోర్‌లు ఎన్నో ఉండొచ్చు... కానీ కొన్ని మాత్రం విభిన్న అంశాలతో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాంటివే చైనాలోని ఈ పుస్తక భాండాగారాలు. ఒకటేమో కొండ అంచున ఉంటే... మరొకటి ఎక్కడి నుంచి చూసినా ఇంకా ఎంతో ఉంది అనిపిస్తూ ఇల్యూషన్‌తో కనిపిస్తుంది. వీటిని చూసేందుకు పర్యాటకులు సైతం తెగ ఉత్సాహం చూపుతుంటారు. ఆ విశేషాలే ఇవి...

కొండలపైన దేవాలయాలు ఉండటం సాధారణమే. కానీ కొండపై గ్రంథాలయం ఉండటం ఎక్కడైనా చూశారా? చైనాలోని ‘మియాన్హువా’ గ్రామానికి వెళితే... కొండ అంచుల్లో ఉన్న గ్రంథాలయం పుస్తక ప్రియులకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ‘మీ ఊర్లో గ్రంథాలయం ఎక్కడుంది?’ అని ఎవరైనా అడిగితే స్కూల్‌ భవనంలో అని, లేదంటే పంచాయతీ ఆఫీసు పక్కనో అని చెబుతారు. కానీ చైనాలోని మియాన్హువా ఊరికెళ్లి అదే ప్రశ్న అడిగితే ‘అదిగో ఆ కొండపైన ఉంది’ అని చూపిస్తారు. సాధారణంగా లైబ్రరీలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావు. కానీ చైనాలో ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఈ లైబ్రరీ మాత్రం నెట్టింట్లో తెగ వైరలయ్యింది. ఇది పుస్తకప్రియులతో పాటు పర్యాటకులనూ తెగ ఆకర్షిస్తోంది.


చుట్టూ పచ్చిక పరచినట్టుగా ప్రకృతి సౌందర్యం, మధ్యలో కొండ అంచున పుస్తకాల అరలతో లైబ్రరీ... ఈ దృశ్యం అక్కడికొచ్చే పర్యాటకులకు, పుస్తక ప్రియులకు కనువిందు చేస్తుంది. ఈ లైబ్రరీని చేరుకోవాలంటే కలపతో నిర్మించిన మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. పుస్తకాలు అమర్చేందుకు వీలుగా కొండను చెక్కారు. సందర్శకులు కూర్చునేందుకు వీలుగా బాల్కనీ ఉంటుంది. పుస్తక ప్రియులు అక్కడ కూర్చుని ఎంచక్కా కావాల్సిన బుక్స్‌ చదువుకోవచ్చు. ఈ గ్రంథాలయంలో కొన్ని వందల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రాత్రుళ్లు ఈ లైబ్రరీ ప్రాంతం విద్యుద్దీపాల వెలుగులో మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అందుకే పర్యాటకులు పగలుతో పాటు, రాత్రుళ్లు సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.


book8.2.jpg

అద్దాల మహల్‌...

అదొక ప్తుసకాలు షాపు. ఆ షాపులోకి వెళ్లిన సందర్శకులు ఏదైనా నచ్చిన పుస్తకం కనిపించిందని, తీద్దామని అనుకుంటే చేతికి అద్దం తగులుతుంది. నిజానికి అక్కడ కనిపి స్తున్నట్టుగా పుస్తకం లేదు. పుస్తకం ఉన్నట్టుగా భ్రమకు లోనవుతారంతే. ఇంకా చెప్పాలంటే ఆ పుస్తకాల షాపులో నిజమైన పుస్తకాన్ని వెతికిపట్టుకోవడం అంత సులువు కాదు. కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ ఒక్కటీ చేతికి దొరకదు. ఇక షాపు ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో అర్థం కాదు. అదంతా అద్దాల మహిమ.


చైనాలోని డ్యుజింగ్యాన్‌లో ఉన్న ‘జాంగ్స్‌హ్యూజ్‌ బుక్‌స్టోర్‌’ ప్రత్యేకత ఇది. షాంఘైకి చెందిన ఆర్కిటెక్చర్‌ లి జియాంగ్‌ ఈ బుక్‌స్టోర్‌ని డిజైన్‌ చేశారు. వంపుతిరిగిన మెట్లు, షెల్ఫ్‌లు, క్రమపద్ధతిలో అమర్చిన అద్దాలతో ఒక అంతుచిక్కని లైబ్రరీలాగా కనిపిస్తుంది. బుక్‌స్టోర్‌ యజమాని జాంగ్స్‌హ్యూజ్‌ చాలా ఏళ్లుగా పుస్తకాల షాపును నిర్వహిస్తున్నారు. పెద్దగా గిరాకీ లేకపోవడంతో ఏదైనా కొత్తగా ప్రయత్నించి జనాలను ఆకర్షించాలనుకున్నారు. పాత బుక్‌స్టాల్‌ను తొలగించి, కొత్తగా ఇప్పుడున్న అద్దాల బుక్‌స్టోర్‌ని డిజైన్‌ చేయించారు. ఐదు నెలల పాటు శ్రమించి దాన్ని అద్దాల మహల్‌లా తీర్చిదిద్దారు. మొత్తానికి ఎగ్జిక్యూషన్‌ పర్‌ఫెక్ట్‌గా చేశారు.


book8.3.jpg

ఈ బుక్‌స్టోర్‌లో అద్దాలతో పాటు లైటింగ్‌ పాత్ర కూడా కీలకం. ఇక్కడ సందర్శకులకు ఏ ర్యాక్‌ ఎక్కడ మొదలవుతుందో అర్థం కాదు. ఇల్యూజన్‌ వల్ల అంతు చిక్కని లైబ్రరీలా కనిపిస్తుంది. ఫ్లోర్‌ నుంచి సీలింగ్‌ వరకు పుస్తకాలతో నిండి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ షాపులో 80 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అంతుచిక్కని బుక్‌స్టోర్‌ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి కనబరుస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే స్వీటీ (అనుష్క) అంటే గౌరవం..

ఆ రాశి వారికి ఈ వారం అంతా డబ్బే డబ్బు..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 07 , 2025 | 11:25 AM