Share News

Zelensky: 500 కాదు.. 100 బిలియన్‌ డాలర్లే!

ABN , Publish Date - Feb 25 , 2025 | 04:42 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినట్టు అది రూ.43 లక్షల కోట్లు(500 బిలియన్‌ డాలర్లు) కాదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. ఆ 8.67 లక్షల కోట్లను అప్పుగా పరిగణించేందుకూ తాను సిద్ధంగా లేనన్నారు.

Zelensky: 500 కాదు.. 100 బిలియన్‌ డాలర్లే!

యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా సాయంపై జెలెన్‌స్కీ ప్రకటన

ప్రతిగా ఖనిజ సంపదను ఇచ్చేందుకు సిద్ధం: జెలెన్‌స్కీ

కీవ్‌, ఫిబ్రవరి 24: రష్యాతో తాము యుద్ధం కొనసాగిస్తున్న ఈ మూడేళ్లలో అమెరికా నుంచి తమకు రూ.8.67 లక్షల కోట్లు (వంద బిలియన్‌ డాలర్లు) మాత్రమే సాయం అందిందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినట్టు అది రూ.43 లక్షల కోట్లు(500 బిలియన్‌ డాలర్లు) కాదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తేల్చి చెప్పారు. ఆ 8.67 లక్షల కోట్లను అప్పుగా పరిగణించేందుకూ తాను సిద్ధంగా లేనన్నారు. తమ దేశం ఇస్తున్నవి గ్రాంట్లు అని, అప్పు కాదని నాటి అధ్యక్షుడు బైడెన్‌తోపాటు అమెరికా కాంగ్రెస్‌ కూడా స్పష్టంగా చెప్పినట్టు తెలిపారు. సోమవారం ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ ‘అమెరికా నుంచి సాయం 100 బిలియన్‌ డాలర్లు మాత్రమే. 500 బిలియన్‌ డాలర్లు కాదు. ఉక్రెయిన్‌కు అందింది 100 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అందుకు మేం కృతజ్ఞత తెలుపుతున్నాం. యుద్ధంలో ఇప్పటి వరకు 320 బిలియన్‌ డాలర్ల వ్యయం అయ్యింది. అందులో 120బిలియన్‌ డాలర్లు ఉక్రెయిన్‌ తన ప్రజల నుంచే సమకూర్చుకుంది. 100బిలియన్‌ డాలర్లు ఐరోపా నుంచి అందింది’ అన్నారు. రక్షణ సాయం అందిస్తున్నందుకు ప్రతిగా అమెరికాకు సహజ వనరులను అందించేందుకు ట్రంప్‌ తో తాను చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. అయితే, ఉక్రెయిన్‌ ప్రజలు పదితరాలపాటు అమెరికాకు తిరిగి చెల్లించేలా ఎలాంటి ఒప్పందంపైనా తాను సంతకం చేయబోనన్నారు. ఒప్పందం ఉక్రెయిన్‌కు భద్రతా పరమైన గ్యారెంటీలు ఉండాలని, ఇరుదేశాలకూ ప్రయోజనకరంగా ఉండాలని పేర్కొన్నారు.


యుద్ధ ఖైదీలందరి విడుదల! రష్యాకు జెలెన్‌స్కీ ప్రతిపాదన యుద్ధాన్ని ముగించేందుకు పరస్పరం యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేద్దామని రష్యాకు జెలెన్‌స్కీ ప్రతిపాదన చేశారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభమై మూడేళ్లయిన సందర్భంగా సోమవారం కీవ్‌లో ఓ సదస్సులో జెలెన్‌స్కీ మాట్లాడారు. ఉక్రెనియన్లందరినీ రష్యా విడుదల చేయాలని, బదులుగా తమ వద్ద బందీగా ఉన్న రష్యన్లందరినీ విడుదల చేసేందుకు సిద్ధమన్నారు.


ఇవి కూడా చదవండి..

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 25 , 2025 | 04:42 AM