Share News

Zelenskyy on NATO Membership: ఆ గ్యారెంటీ ఇస్తే నాటోలో చేరబోము.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన

ABN , Publish Date - Dec 15 , 2025 | 09:17 AM

తమ భద్రతకు పాశ్చాత్య దేశాలు హామీ ఇస్తే నాటో కూటమిలో చేరబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. అయితే, నాటో సభ్యదేశాలకు ఉన్న రక్షణలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. అమెరికా ప్రతినిధితో చర్చల అనంతరం మీడియాతో ఈ కామెంట్స్ చేశారు.

Zelenskyy on NATO Membership: ఆ గ్యారెంటీ ఇస్తే నాటోలో చేరబోము.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన
Zelenskyy NATO Statement

ఇంటర్నెట్ డెస్క్: పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇస్తే తాము నాటో కూటమిలో చేరబోమని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం కీలక ప్రకటన చేశారు. అయితే, తమ భూభాగాన్ని రష్యాకు వదులుకునే విషయంలో మాత్రం సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. యుద్ధం ముగింపు దిశగా అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, జెరెడ్ కుష్నర్‌తో జెలెన్‌స్కీ చర్చలు జరిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు (Zelensky - NATO)

నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరిక ప్రతిపాదనను అమెరికాతో పాటు కొన్ని ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయని జెలెన్‌స్కీ అన్నారు. కాబట్టి, కనీసం నాటో సభ్య దేశాల తరహాలో తమ భద్రతకు హామీని ఆశిస్తున్నట్టు తెలిపారు. మరోసారి రష్యా దాడిని అడ్డుకునేందుకు ఈ హామీ అవసరమని అన్నారు. నాటోలో చేరికపై వెనక్కుతగ్గిన తాము చాలా రాజీపడ్డామని చెప్పారు.


ఇక డొనెట్స్క్‌ ప్రాంతం నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాలని, అక్కడ సైన్యం నీడ లేని ఆర్థిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. అయితే, ఇది ఆచరణ సాధ్యం కాదని తాను స్పష్టం చేసినట్టు చెప్పారు. ‘ఇది ఒకరకంగా అన్యాయం. అయినా ఇలాంటి ప్రాంతం నిర్వహణను ఎవరు చూసుకుంటారు?’ అని ప్రశ్నించారు. ఒక వేళ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు సైన్యాన్ని తొలగించి తటస్థ పోలీసు బలగాలతో గస్తీని ఏర్పాటు చేయాని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ దళాలు సరిహద్దు నుంచి 5-10 కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినప్పుడు రష్యా సైన్యం ఇలా ఎందుకు చేయదని ప్రశ్నించారు.

డొనెట్స్క్‌ ప్రాంతంలో సైన్యం ఉపసంహణ జరిగినా అక్కడి కొన్ని ప్రాంతాల్లో రష్యా పోలీసులు, నేషనల్ గార్డులు తప్పక పహారాగా ఉంటారని రష్యా అధ్యక్షుడు పుతిన్ సలహాదారు అయిన యూరీ ఉషాకోవ్ తెలిపారు. అయితే, రాజీకుదిరేందుకు మరింత సమయం పడుతుందని అన్నారు. అమెరికా ప్రతిపాదనలకు ఉక్రెయిన్ చేస్తున్న మార్పుల వల్ల పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు.


ఇవీ చదవండి:

అమెరికా యూనివర్సిటీలో కాల్పుల ఘటన.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

నిధుల విడుదలకు కఠిన షరతులు.. పాక్‌కు చుక్కలు చూపిస్తున్న ఐఎమ్ఎఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 15 , 2025 | 11:12 AM