Dubai: దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చలు..
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:49 PM
ప్రపంచ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్‌లో మంగళవారం ప్రారంభమైంది. గ్లోబల్ గవర్నెన్స్‌కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరులను ఒక చోట చేర్చడమే ఈ సమ్మిట్ ఉద్దేశం.

ప్రపంచ గవర్నమెంట్స్ సమ్మిట్ (WGS 2025) కు సంబంధించిన 12వ సమావేశం దుబాయ్‌లో మంగళవారం ప్రారంభమైంది. గ్లోబల్ గవర్నెన్స్‌కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరులను ఒక చోట చేర్చడమే ఈ సమ్మిట్ ఉద్దేశం. యూఏఈ క్యాబినెట్ వ్యవహారాల మంత్రి, ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ ఛైర్మన్ మహ్మద్ అబ్దుల్లా అల్ గెర్గావి ఈ సమ్మిట్‌ను నిర్వహించారు. ఈ సమ్మిట్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పు, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, విద్య, ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందుతున్న ధోరణుల గురించి ప్రధానంగా చర్చ జరిగింది.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, చైనా, అమెరికాల మధ్య పోటీ గురించి ఈ సమ్మిట్‌లో ప్రధానంగా చర్చించారు. ఈ సమ్మిట్‌కు 30 మంది దేశాధినేతలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అందరూ ఎక్కువగా ఏఐ ప్రభావం పైనే తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ``ఏఐ ఒక అద్భుతమైన టూల్. ప్రపంచ ప్రభుత్వాలు కలిసి పనిచేయడానికి ఏఐ చక్కని అవకాశం కల్పిస్తుంది. గోప్యతా, సైబర్ భద్రతా నియమాలను ఉల్లంఘించకుండానే ఏఐ ప్రపంచ అభివృద్ధికి దోహదపడుతుంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఏఐలో మార్పులు మంచికే ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. ఆరోగ్య సంరక్షణ రంగంలో, అంటు వ్యాధి ట్రాకింగ్ కోసం, వ్యక్తిగత ఔషధాల సూచనలో ఏఐ అద్భుతంగా పని చేస్తుంద``ని ఒరాకిల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మైక్ సిసిల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల వేగంగా విస్తరించిన ఏఐ యాప్ డీప్‌సీక్ గురించి కూడా చర్చ జరిగింది. ఐబీఎమ్ సీఈవో అరవింద్ కృష్ణ ఈ సమావేశంలో పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేశారు. ``డీప్‌సీక్ అందరినీ స్పృహలోకి తీసుకొచ్చింది. టెక్నాలజీ రంగంలో ఏం జరుగుతోందో చూపించింది. గత 70 ఏళ్లుగా టెక్నాలజీ ట్రెండ్ అతి వేగంగా మారుతోంది. ఖర్చు తగ్గుతోంది. పోటీ పెరుగుతోంది. ప్రతి ఒక్కరికీ తక్కువ ఖర్చు, శ్రమతోనే పనులు జరుగుతున్నాయి. టెక్నాలజీ మరింత చౌకగా అందరికీ అందుబాటులో ఉండేందుకు మనం మార్గాలను అన్వేషించాల``ని అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..