Hypersonic Missile: హైపర్‌సానిక్ అణు క్షిపణి మినిట్ మ్యాన్3ని పరీక్షించిన అమెరికా
ABN , Publish Date - May 23 , 2025 | 04:59 AM
అణుదాడి సామర్థ్యం గల మినిట్‌మ్యాన్ 3 ఖండాంతర క్షిపణిని అమెరికా వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 15 వేల మైళ్ల వేగంతో 4200 మైళ్ల దూరాన మార్షల్ దీవుల్లోని టెస్ట్ సైట్‌ను విజయవంతంగా తాకింది.
వాషింగ్టన్, మే 22: ప్రపంచంలో ఎక్కడైనా అణుదాడి చేసే సామర్థ్యం ఉన్న హైపర్‌సానిక్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘మినిట్‌మ్యాన్ 3’ని.. అమెరికా వాయుసేన బుధవారం పరీక్షించింది. ఎలాంటి ఆయుధాలూ లేకుండా ప్రయోగించిన ఈ క్షిపణి గంటకు 15 వేల మైళ్ల వేగంతో ప్రయాణించి.. 4200 మైళ్ల దూరాన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మార్షల్ దీవుల్లో.. అమెరికా ఆర్మీ ‘స్పేస్ అండ్ మిసైల్ డిఫెన్స్ కమాండ్’కు చెందిన రోనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్‌కు చేరింది. క్యాలిఫోర్నియాలోని వాండెర్‌బెర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్టు అమెరికా వాయుసేన ఒక ప్రకటనలో వెల్లడించింది. శత్రుదేశాల అణ్వస్త్రాలను అడ్డుకునే శక్తిసామర్థ్యాలను చాటేందుకు రొటీన్‌గా, తరచుగా నిర్వహించే పరీక్షల్లో ఇది ఒక భాగమని వివరించింది. ఈ పరీక్షకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకూ ఎలాంటి సంబంధమూ లేదని అందులో స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News