Share News

US Student Visa: పరిమిత కాలానికే విద్యార్థి వీసా

ABN , Publish Date - Aug 16 , 2025 | 02:50 AM

అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకొనే విదేశీ విద్యార్థులకు కొత్త గుబులు మొదలైంది. విద్యార్థి వీసాలకు పరిమిత కాల గడువు విధించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది....

US Student Visa: పరిమిత కాలానికే విద్యార్థి వీసా

  • డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదనకు వైట్‌హౌస్‌ ఓకే

న్యూఢిల్లీ, ఆగస్టు 15: అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకొనే విదేశీ విద్యార్థులకు కొత్త గుబులు మొదలైంది. విద్యార్థి వీసాలకు పరిమిత కాల గడువు విధించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎఫ్‌-1, జే-1 వీసాదారులు తమ కోర్సు మొత్తం పూర్తయ్యే వరకూ అమెరికాలో నివసించే అవకాశం ఉంది. అయితే ఈ వీసా గడువును పరిమితం చేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదించింది. దీని ప్రకారం ఇకపై కొద్దికాలంమాత్రమే చెల్లుబాటయ్యే వీసాలు జారీ చేస్తారు. సమయ పరిమితి ఎంతో కచ్చితంగా తెలియనప్పటికీ విద్యార్థులు తమ డిగ్రీ పూర్తయ్యే లోపే వీసాను పొడిగించుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది. వైట్‌హౌస్‌ ఆమోదం పొందిన ఈ ప్రతిపాదనను ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం త్వరలోనే ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురించనున్నారు. అమెరికాలోని వర్సిటీల్లో 4.2లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో చాలామంది మాస్టర్స్‌, పీహెచ్‌డీ, దీర్ఘకాలిక రిసెర్చ్‌ ప్రోగామ్స్‌ చేస్తున్నారు. కోర్సు మధ్యలో ఉండగానే వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి రావడం ఆర్థికంగా భారం కావడంతో పాటు వారిపై అదనపు ఒత్తిడిని కూడా పెంచనుంది. ఈ ప్రక్రియలో స్వల్ప జాప్యం చోటుచేసుకున్నా వారు చట్టబద్ధమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది.

Updated Date - Aug 16 , 2025 | 02:50 AM