Share News

US Murder Case: అమెరికా జంట హత్యల కేసు.. నిందితుడిపై భారీ రివార్డ్

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:24 PM

అమెరికాలో 2017లో జరిగిన జంట హత్యల కేసులో ఇటీవల నిందితుణ్ని గుర్తించిన అధికారులు.. ఈ కేసు పురోగతిలో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం.. నిందితుడు పరారీలో ఉండటంతో అతడిపై భారీ రివార్డ్ ప్రకటించారు.

US Murder Case: అమెరికా జంట హత్యల కేసు.. నిందితుడిపై భారీ రివార్డ్
Nazeer Hameed has been charged with the murder of Sasikala Narra

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా(America)లో ఎనిమిదేళ్ల క్రితం కుమారుడితో సహా దారుణ హత్యకు గురైన శశికళా నర్రా(Sasikala Narra) మర్డర్ కేసు నిందితుడిపై రివార్డ్(Reward) ప్రకటిస్తూ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(FBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో గత నెలలో నజీర్ హమీద్‌ను నిందితునిగా తేల్చిన దర్యాప్తు బృందం.. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో అతడి ఆచూకీ తెలిపిన వారికి యాభై వేల అమెరికన్ డాలర్ల ప్రోత్సాహకం ఇస్తామని పేర్కొంది.


అమెరికా న్యూజెర్సీలోని మాపుల్‌షేడ్‌(Maple Shade)లో 2017 మార్చి 23న.. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు చెందిన 40ఏళ్ల శశికళా నర్రా(Sasikala Narra), ఆమె ఏడేళ్ల కుమారుడు అనీశ్ సాయి(Anish Sai Narra)లు ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో తొలుత భర్త హనుమంత రావు నర్రా(Hanumantha Rao Narra)పై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు.. ఆ తర్వాత గత నవంబర్‌లో ల్యాప్‌టాప్ ఆధారంగా అసలు నిందితుడిగా నజీర్ హమీద్‌(Nazeer Hameed)ను తేల్చారు. అయితే.. అతను హత్య జరిగిన ఆరు నెలలకే భారత్‌కు తరలిపోయి.. ప్రస్తుతం అక్కడే తలదాచుకుంటున్నట్టు అమెరికా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే హమీద్‌పై అరెస్ట్ వారెంట్ జారీచేసినట్టు ఎఫ్బీఐ తెలిపింది. దీంతో పాటు అతడిని మోస్ట్ వాంటెడ్ నిందితుల జాబితాలో చేర్చి, ఆచూకీ తెలిపిన వారికి 50వేల డాలర్లు ఇస్తామని వెల్లడించింది.


అయితే.. ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి కచ్చితమైన కారణాలూ తెలియరాలేదని దర్యాప్తు బృందం తెలిపింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుండటంతో మృతురాలి భర్త హనుమంతరావు కార్యకలాపాలపై నిఘా ఉంచినట్లు బర్లింగ్టన్‌ కౌంటీ ప్రాసిక్యూటర్‌ కార్యాలయ(Burlington County Prosecutor's Office) అధికారులు స్పష్టం చేశారు. ఇండియాలో తలదాచుకుంటున్న హమీద్‌ను అమెరికాకు రప్పించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రాకు.. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ ఇటీవల ఓ లేఖ కూడా రాశారు. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా హమీద్‌ అప్పగింతకు సంబంధించి భారత విదేశాంగ శాఖ సాయం కావాలని అందులో కోరారు.


ఇవీ చదవండి:

అఫ్ఘనిస్థాన్‌లో బహిరంగ శిక్ష.. 13 ఏళ్ల బాలుడి చేత చంపించిన పోలీసులు

చైనాలో కండోమ్స్‌పై 13% పన్ను

Updated Date - Dec 03 , 2025 | 03:45 PM