Trumps Tariffs Will Backfire: ట్రంప్ సుంకాలుతో అమెరికాకే చేటు
ABN , Publish Date - Aug 10 , 2025 | 02:40 AM
ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయి..! ఇప్పుడు ఆ దేశాల నుంచి బిలియన్..
భారత్ కాస్త ఓపిక పడితేట్రంప్ గాలి మేడలు కూలిపోతాయి
ఆర్థికవేత్త ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ విశ్లేషణ
న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఆగస్టు 9: ‘‘ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయి..! ఇప్పుడు ఆ దేశాల నుంచి బిలియన్ డాలర్లు వెనక్కి వస్తాయి’’ - ట్రూత్ సోషల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టు ఇది..! ఇలా అమెరికా ఖజానాను నింపడానికి ఏ దేశానికి ఎంత టారిఫ్ విధించాలంటూ లెక్కలేసుకుంటూ ట్రంప్ ఓ గాలి మేడను నిర్మిస్తున్నారని, ఈ ధోరణితో అది పేక మేడలా కూలిపోయే ప్రమాదముందని ఆర్థికవేత్త, జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ స్టీవ్ హాంకీ హెచ్చరించారు. భారత్‌పై ట్రంప్ 50% సుంకాలు విధించడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హాంకీ విశ్లేషణతో అమెరికా భవిష్యత్‌కు ఇబ్బందులు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫెసర్ హాంకీ శనివారం ఓ జాతీయ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ట్రంప్ టారిఫ్ పూర్తిగా అర్థరహితమన్నారు. ‘‘నెపోలియన్ చెప్పినట్లు ఆయన(ట్రంప్) ధోరణి తనను తానే నాశనం చేసుకునేట్లుంది. భారత్ విషయంలో ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కాస్త ఓపికపడితే చాలు. ట్రంప్ పేకమేడ త్వరలోనే కూలిపోతుంది’’ అని హాంకీ వ్యాఖ్యానించారు. అమెరికన్లు సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, దాంతో వాణిజ్య లోటు పెరుగుతోందని గుర్తుచేశారు. ‘‘ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావం వస్త్రపరిశ్రమ, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూలంగా ఉంటుంది’’ అని ఆయన వివరించారు. చైనా రాయబారి షు ఫెహోంగ్ కూడా అమెరికా సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) నిబంధనలకు విరుద్ధమన్నారు. అటు రష్యా కూడా అమెరికా చర్యలను తీవ్రంగా విమర్శించింది. ట్రంప్ మాత్రం తన చర్యలు అమెరికా స్టాక్ మార్కెట్లకు బూస్ట్ ఇస్తున్నాయని, కోర్టు గనక సుంకాలకు వ్యతిరేకంగా తీర్పునిస్తే.. 1929 నాటి మహామాంద్యం తప్పదంటున్నారు.