Donald Trump: భారత్‌పై 500% సుంకం..పూర్తిగా నా అభిమతమే
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:37 AM
ష్యా నుంచి ముడి చమురు, ఇతర ఇంధనాలను కొనుగోలు చేసే భారత్, ఇతర దేశాల దిగుమతులపై ఏకంగా..
రష్యా నుంచి చమురుకొనే దేశాలపై భారీ సుంకాల బిల్లుకు ట్రంప్ మద్దతు
వాషింగ్టన్, జూలై 10: రష్యా నుంచి ముడి చమురు, ఇతర ఇంధనాలను కొనుగోలు చేసే భారత్, ఇతర దేశాల దిగుమతులపై ఏకంగా 500% సుంకాలు విధించే బిల్లు తన అభిమతం ప్రకారం రూపొందినదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన సన్నిహితుడు, రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ప్రతిపాదించిన ‘శాంక్షనింగ్ రష్యా యాక్ట్-2025’ బిల్లుకు మద్దతు తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు భారీగా ఆంక్షలు, సుంకాలు విధించేలా లిండ్సే గ్రాహమ్ ఈ బిల్లును ప్రతిపాదించారు. రష్యా కు కీలక ఆదాయ వనరులైన ముడి చమురు, సహజవాయువు, యు రేనియం, తదితర ఇంధనాలను ఇతర దేశాలు కొనుగోలు చేయకుండా నియంత్రించడం కూడా ఇందులో భాగం. అలా రష్యా నుంచి ఇంధనాలు కొనుగోలు చేసే దేశాలపై 500% సుంకాలు విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. రష్యా ఇంధన ఎగుమతుల్లో సుమారు 70% భారత్, చైనాలే కొనుగోలు చేస్తున్నాయి. రష్యాపై ఆంక్షల బిల్లు చట్టంగా మారితే.. రష్యాతోపాటు భారత్, చైనాలపై ప్రభావం పడుతుంది. యూర్‌పకు చెందిన ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అంచనాల ప్రకారం.. ఈ ఏడాది ఒక్క మే నెలలోనే రష్యా నుంచి భారత్ చేసిన ఇంధన కొనుగోళ్లు సుమా రు రూ.42 వేల కోట్ల (420 కోట్ల యూరోలు) పైమాటే.