US Nuclear Testing: యూఎస్ మళ్లీ అణ్వాయుధ పరీక్షలకు సిద్ధమవుతోందా? క్లారిటీ ఇచ్చిన అమెరికా మంత్రి
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:47 AM
అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాలంటూ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఆదేశాలపై అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ మంత్రి క్రిస్ రైట్ వివరణ ఇచ్చారు. తాము జరపబోయే పరీక్షల్లో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండవని స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా, చైనాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అణ్వాయుధ పరీక్షలను మొదలు పెట్టాలని తమ దేశ యుద్ధ శాఖను ఆదేశించారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ విషయంపై అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ క్రిస్ రైట్ తాాజాగా స్పష్టతనిచ్చారు. తాజా పరీక్షల్లో ఎలాంటి అణు విస్ఫోటనాలు ఉండబోవని స్పష్టం చేశారు. అణ్వాయుధానికి సంబంధించి ఇతర వ్యవస్థలన్నీ లక్ష్యాల మేరకు పని చేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. పాత ఆయుధాలను భర్తీ చేయనున్న కొత్త ఆయుధాలపై ఈ పరీక్షలు నిర్వహిస్తామని కూడా వివరించారు.
ట్రంప్ ప్రకటనతో తికమక
అమెరికా దాదాపు 33 ఏళ్లుగా ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించలేదు. అయితే, గురువారం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు పెట్టారు. అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో సమావేశానికి ముందు ట్రంప్ చేసిన ఈ ప్రకటన కలకలం రేపింది. ఆ తరువాత శుక్రవారం కూడా ట్రంప్ మరోసారి అణ్వాయుధ పరీక్షలపై మళ్లీ అవే కామెంట్స్ చేశారు. అయితే, భూగర్భ అణు విస్ఫోటనాలు ఉంటాయా అన్న ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం దాటవేశారు. రష్యా, చైనాలు కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తున్నా వాటి గురించి బయటకు చెప్పట్లేదని అన్నారు. ప్రస్తుతం అణుపరీక్షలు జరపని దేశం అమెరికా మాత్రమేనని కూడా అన్నారు. దీంతో, ఈ విషయంపై మళ్లీ దృష్టి పెట్టకతప్పలేదని అన్నారు.
ఈ నేపథ్యంలో రైట్ క్లారిటీ ఇచ్చారు. 1960, 1970, 1980ల్లో జరిపిన అణు పరీక్షల్లో పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించామని అన్నారు. ఈ డేటా ఆధారంగా కంప్యూటర్‌ల సాయంతో నూతన బాంబు డిజైన్‌ల వ్యవస్థలను విశ్లేషిస్తామని వివరించారు. నియంత్రిత విధానంలో విస్ఫోటనాలను పరీక్షించినా ఇవేవీ అణు విస్ఫోటనాలు కావని తెలిపారు.
పలు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్న దాని ప్రకారం, ప్రస్తుతం రష్యా వద్ద 5,449 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న అమెరికా వద్ద 5,277 అణు వార్‌హెడ్స్ ఉన్నాయి. చైనా వద్ద 600 అణ్వాయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఉత్తరకొరియా వద్ద సుమారు 30 నుంచి 50 వరకూ అణుబాంబులు ఉండొచ్చని సమాచారం.
ఇవి కూడా చదవండి:
ఇంగ్లిష్ టెస్టులో విఫలం.. యూఎస్‌లో భారతీయ ట్రక్ డ్రైవర్లకు షాక్
చైనాతో తొలగిన ప్రతిష్టంభన.. శ్వేత సౌధం కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి