Donald Trump Expressed Disappointment: ట్రంప్ అశాంతి
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:16 AM
రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ‘ప్రపంచ శాంతి దూత’గా అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు....
నోబెల్‌పై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి.. 8 యుద్ధాలు ఆపానన్నా దక్కని బహుమతి
అసలైన శాంతి కంటే రాజకీయాలకేనోబెల్ కమిటీ ప్రాధాన్యం అని వైట్‌హౌజ్ విమర్శ
వాషింగ్టన్, అక్టోబరు 10: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ‘ప్రపంచ శాంతి దూత’గా అవతారమెత్తిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ‘శాంతి’ లేకుండా పోయింది. ఎనిమిది యుద్ధాలు ఆపానని చెప్పినా.. వెంటనే ఒప్పందానికి రాకపోతే నరకం చూపిస్తానంటూ బెదిరించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య హడావుడిగా సంధి కుదిర్చినా కూడా ఆయనను నోబెల్ శాంతి బహుమతి వరించలేదు. దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్.. దీనితో తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. దీనిపై ట్రంప్ నేరుగా ప్రకటన చేయకపోయినా.. అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌజ్ ప్రతినిధి స్టీవెన్ చుయెంగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘నోబెల్ కమిటీ మరోసారి శాంతి కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చింది. అయినా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ఆపుతూనే ఉంటారు. శాంతి ఒప్పందాలు కుదుర్చుతూనే ఉంటారు. ప్రజల ప్రాణాలను కాపాడుతారు. ఆయనొక గొప్ప మానవతా వాది. తన సంకల్ప బలంతో పర్వతాలనైనా కదిలించగలిగే ట్రంప్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు..’’ అని పేర్కొన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని, ఆయనకు తాము మద్దతు పలుకుతున్నామని బహుమతి ప్రకటనకు ముందు రష్యా పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు పుతిన్ సన్నిహితుడు యూరి ఉషకోవ్ ప్రకటన చేశారు.
నేను అర్హుడిని.. నేనే అర్హుడిని!
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి పనిచేసిన సమయంలోనే తనకు నోబెల్ శాంతి బహుమతిపై ఆశలు ఉన్నట్టు బయటపెట్టారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక అయితే బహిరంగంగానే ప్రకటనలు చేశారు. వివిధ దేశాల మధ్య యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తానే అర్హుడినని కూడా పలుమార్లు పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్, కాంబోడియా-థాయ్‌లాండ్, కాంగో-రువాండా, ఇజ్రాయెల్-ఇరాన్, సెర్బియా-కొసావో, ఈజి్‌ప్ట-ఇథియోపియా, ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ల మధ్య యుద్ధాలను ఆపానని చెప్పుకొచ్చారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ విరమణ కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా హడావుడిగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్నీ కుదిర్చారు. మొత్తంగా ఈసారి తనకు నోబెల్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. బహుమతి ప్రకటనకు ఒక రోజు ముందు శ్వేతసౌధం ‘శాంతి అధ్యక్షుడు (ది పీస్ ప్రెసిడెంట్)’ అంటూ ట్రంప్ ఫొటోతో ఎక్స్‌లో పోస్టు కూడా పెట్టడం గమనార్హం. పాకిస్థాన్ ప్రభుత్వం నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును అధికారికంగా నామినేట్ చేసింది. ఇజ్రాయెల్, కాంబోడియా ప్రధానులు నెతన్యాహు, హున్ మానెట్ కూడా ప్రతిపాదించారు.
వింత ప్రకటనలతో పరువు పోతున్నా..
ఇంతగా ఆశపెట్టుకున్నా తనకు నోబెల్ శాంతి బహుమతి రాదని ట్రంప్ మథనపడ్డారు కూడా. తాను ఎన్ని యుద్ధాలు ఆపినా, శాంతికోసం ఎంత కృషి చేసినా తనకు నోబెల్ ఇవ్వకపోవచ్చని కూడా ఒకట్రెండు సార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్ నిర్ద్వంద్వంగా ఖండించినా కూడా.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఎన్నోసార్లు ప్రకటనలు చేశారు. ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు రూజ్‌వెల్ట్ (1906లో), వూడ్రో విల్సన్ (1919), జిమ్మీకార్టర్ (2002), బరాక్ ఒబామా (2009లో) నోబెల్ శాంతి బహుమతి పొందారు. అయితే వారందరికన్నా ప్రపంచ శాంతి కోసం తాను చేపట్టిన చర్యలు గొప్పవని ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఒబామా అసలేమీ చేయకపోయినా కూడా నోబెల్ ఇచ్చారని వ్యాఖ్యానించారు.
నోబెల్ బహుమతి ట్రంప్‌కు అంకితం: మరియా మచాడో
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి పొందిన మరియా మచాడో.. ఈ బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘వెనెజువెలాలో స్వేచ్ఛ కోసం చేస్తున్న మా పోరాటానికి నోబెల్ బహుమతి గొప్ప గుర్తింపు. గొప్ప విజయానికి మేం దగ్గరయ్యాం. వెనెజువెలా స్వేచ్ఛను పొందుతుంది. ప్రజాస్వామ్యం కోసం పోరాటంలో మాకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రజాస్వామ్య దేశాలకు కృతజ్ఞతలు. వెనెజువెలాలో బాధిత ప్రజలకు, మాకు అండగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్‌ను అంకితం ఇస్తున్నా..’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తాను ఓ పెద్ద ఉద్యమంలో భాగస్వామిని మాత్రమేనని.. ఈ బహుమతి వెనెజువెలాలో తమ పోరాటానికి గౌరవమని వ్యాఖ్యానించారు.