Share News

Donald Trump: బ్రిక్స్‌ దేశాలపై 10% అదనపు సుంకం

ABN , Publish Date - Jul 09 , 2025 | 03:14 AM

బ్రిక్స్‌ సభ్యదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు విరుచుకుపడ్డారు.

Donald Trump: బ్రిక్స్‌ దేశాలపై 10% అదనపు సుంకం

  • డాలర్‌ను బలహీన పరిచేందుకు బ్రిక్స్‌ యత్నం

  • అందుకే అదనపు సుంకం

  • భారత్‌కు మినహాయింపు ఉండదు: ట్రంప్‌

వాషింగ్టన్‌, జూలై 8: బ్రిక్స్‌ సభ్యదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోమారు విరుచుకుపడ్డారు. మంగళవారం వైట్‌హౌస్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో పలు నిర్ణయాలను వెల్లడించారు. డాలర్‌ను బలహీన పరిచేందుకు బ్రిక్స్‌ ప్రయత్నిస్తోందని, దానికి ప్రతిగా ఆ దేశాలపై 10% అదనపు దిగుమతి సుంకం విధిస్తానని పునరుద్ఘాటించారు. ఇందులో భారత్‌ కూడా ఉంటుందని, ఎవరికీ మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ‘‘అమెరికా డాలర్‌ రారాజు. అది అలాగే కొనసాగుతుంది. దాన్ని సవాలు చేయాలనుకున్న వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘‘అసలు బ్రిక్స్‌ అనేది ఏర్పాటైందే అమెరికాకు నష్టం కలిగించడానికి..! డాలర్‌ను క్షీణింపజేయడానికి..! అయితే.. బ్రిక్స్‌ దేశాలు అమెరికాకు నిజమైన ప్రమాదం కాదని నేను విశ్వసిస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.


ఇటీవల 14 దేశాలకు ట్రంప్‌ సుంకాలను విధిస్తూ లేఖలు రాసిన విషయం తెలిసిందే..! ఈ క్రమంలో భారత్‌తో ఒప్పందం జరుగుతుందని ఆయన ప్రకటించారు. ఆగస్టు తర్వాత భారత ప్రధాని మోదీతో కలిసి తుది ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలున్నట్లు వివరించారు. ఆయా దేశాలపై ఈ నెల 9 నుంచి సుంకాలు అమలవుతాయని ట్రంప్‌ ప్రకటించగా.. ఆ తేదీని ఆగస్టు 1కి పొడిగించారు. అంతలోనే బ్రిక్స్‌ దేశాలపై 10% అదనపు సుంకాన్ని ప్రకటిస్తూ.. భారత్‌ మినహాయింపు కాదని పేర్కొనడం గమనార్హం..! ఔషధ రంగంపై 200% బాదుడు ఫార్మాస్యూటికల్‌ దిగుమతులపై కూడా ట్రంప్‌ భారీగా-- 200% వరకు సుంకం విధించనున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. అయితే, ఈ సుంకాలను వెంటనే అమలు చేయకుండా.. 18 నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ గడువు కాలం ముగిసే లోపు ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాలో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ వారంలోనే విదేశీ రాగి దిగుమతులపై 50% సుంకం విధించే ఉత్తర్వుపై సంతకం చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Jul 09 , 2025 | 03:14 AM