Share News

Donald Trump Tariff on pharmaceutical imports: ఫార్మాపైనా ట్రంప్‌ కొరడా

ABN , Publish Date - Sep 27 , 2025 | 02:57 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ మరోసారి సుం కాల కత్తి ఝుళిపించారు. బ్రాండెడ్‌, పేటెంటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ డ్రగ్స్‌పై 100శాతం, కిచెన్‌ క్యాబినెట్లు, బాత్‌రూమ్‌ వ్యానిటీ...

Donald Trump Tariff on  pharmaceutical imports: ఫార్మాపైనా ట్రంప్‌ కొరడా

  • బ్రాండెడ్‌, పేటెంట్‌ ఔషధాలపై 100% టారిఫ్‌

  • అక్టోబరు1 నుంచి అమలు: డొనాల్డ్‌ ట్రంప్‌

  • తగ్గిన పలు ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్ల విలువ

  • ఈ సుంకాల పెంపు జనరిక్‌ ఔషధాలపైన కాదు

  • భారతీయ కంపెనీలపై ప్రభావం తక్కువే

  • ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయెన్స్‌ ప్రకటన

వాషింగ్టన్‌, సెప్టెంబరు 26: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ మరోసారి సుం కాల కత్తి ఝుళిపించారు. బ్రాండెడ్‌, పేటెంటెడ్‌ ఫార్మాస్యూటికల్‌ డ్రగ్స్‌పై 100శాతం, కిచెన్‌ క్యాబినెట్లు, బాత్‌రూమ్‌ వ్యానిటీ (సింక్‌, దాని కింద ఉండే స్టోరేజీ క్యాబినెట్‌)లపై 50ు, అప్‌హోల్‌స్టర్డ్‌ ఫర్నిచర్‌పై (కుషన్‌ ఉన్న సోఫాలు/కుర్చీల వంటివి) 30ు, హెవీ ట్రక్కులపై 25ు దిగుమతి సుంకాలు విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సుంకాల గురించి ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా ‘ట్రూత్‌ సోషల్‌’ పోస్టు ద్వారా వెల్లడించారు. ‘‘అక్టోబరు 1 నుంచి.. బ్రాండెడ్‌, పేటెంటెడ్‌ ఫార్మా ఉత్పత్తులపై 100శాతం సుంకం విధిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులన్నీ విదేశాల నుంచి అమెరికాను వరదలా ముంచెత్తుతున్నాయని.. ఇది చాలా అన్యాయమని.. అమెరికా జాతీయ భద్రతను కాపాడుకోవడం కోసం, ఇతర కారణాలరీత్యా, అమెరికా తయారీ రంగాన్ని రక్షించుకోవడానికే వాటిపై సుంకాలు విధిస్తున్నానని పేర్కొన్నారు. అమెరికాలో తయారీ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు (నిర్మాణం మొదలుపెట్టినవి/ఇప్పటికే జరుగుతున్నవి) ఈ సుంకాలు వర్తించవని ట్రంప్‌ తెలిపారు. ఇప్పటికే అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించిన కంపెనీలకు ఈ సుంకాలు వర్తిస్తాయా? లేదా అనే అంశంపై స్పష్టత లేదు.


మన కంపెనీలపై..

ట్రంప్‌ సుంకాల ప్రకటనతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ శుక్రవారం 2.5శాతం పతనమైంది. సన్‌ ఫార్మా షేరు ధర 4.87శాతం తగ్గి 52వారాల కనిష్ఠానికి (రూ. 1,548), గ్లాండ్‌ ఫార్మా షేరు 4.7% తగ్గి రూ. 1,880 కి.. బయోకాన్‌ షేర్‌ 3.68ు తగ్గి రూ.342.85కు చేరాయి. లారస్‌ల్యాబ్స్‌, ఇప్కా ల్యాబ్స్‌, దివీస్‌, జైడస్‌ లైఫ్‌, అల్‌కెమ్‌ ల్యాబ్స్‌, సిప్లా, అజంతా ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, టొరెంట్‌ ఫార్మా, అబ్బాట్‌ ఇండియా, గ్లెన్‌మార్క్‌ తదితర కంపెనీల షేర్లు 0.8%-3.2% పతనమయ్యాయి. ట్రంప్‌ విధించిన సుంకాలు బ్రాండెడ్‌, పేటెంటెడ్‌ ఔషధాలపైనే కాబట్టి జనరిక్‌ ఔషధాలకు మినహాయింపు ఉండటంతో ఈ సుంకాల ప్రభావం భారత కంపెనీలపై తక్షణమే పెద్దగా పడదని డాక్టర్‌రెడ్డీస్‌, సన్‌ ఫార్మా సహా దేశంలోని 23ప్రముఖ ఫార్మా కంపెనీల సమాహారమైన ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయెన్స్‌ (ఐపీఏ) సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ తెలిపారు. భారత ఫార్మా ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహించే ఫార్మాస్యూటికల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మెక్సిల్‌) చైర్మన్‌ నమిత్‌ జోషీ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మన కంపెనీల ఎగుమతుల్లో ఎక్కువ సాధారణ జనరిక్‌ ఔషధాలే కాబట్టి.. పెద్దపెద్ద భారతీయ కంపెనీలన్నీ ఇప్పటికే అమెరికాలో కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి కాబట్టి సుంకాల తక్షణ ప్రభావం అంతగా ఉండదన్నారు. భారత్‌ వీలైనంత త్వరగా అమెరికాతో, ఈయూతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ డెవల్‌పమెంట్‌ వ్యవస్థాపక సంచాలకుడు రాహుల్‌ అహ్లూవాలియా సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. భారతదేశ ఫార్మా ఉత్పత్తులకు అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌.. అమెరికానే! ఫార్మెక్సిల్‌ లెక్కల ప్రకారం.. 2024-25ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి 27.9 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి కాగా.. అందు లో అత్యధికంగా 31శాతం ఉత్పత్తులు అమెరికాకే వెళ్లాయి. ఆ ఉత్పత్తుల విలువ 8.7బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.77,138కోట్లు). ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో 3.7బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.32,505 కోట్లు) విలువైన ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతయ్యాయి. అమెరికాలో వాడే జనరిక్‌ మందుల్లో 45ు, బయోసిమిలర్‌ డ్రగ్స్‌లో (జనరిక్‌ అంటే అసలు మందుకు పూర్తిస్థాయి నకళ్లు. బయోసిమిలర్‌ అంటే.. అసలు మందుతో దాదాపు సమానమైన మిశ్రమాలుండే ఔషధాలు)15ు ఔషధాలు భారత్‌ నుంచే సరఫరా అవుతాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, అరబిందో ఫార్మా, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌, సన్‌ ఫార్మా, గ్లాండ్‌ ఫార్మా వంటి కంపెనీల మొత్తం ఆదాయంలో 30-50శాతం ఆదాయాన్ని అమెరికా నుంచే ఆర్జిస్తాయి. అమెరికా నుంచి వచ్చే ఆదాయంలో అధికభాగం ఆయా కంపెనీలకు.. జనరిక్‌ ఔషధాలతోనే వస్తుంది. భారత్‌ నుంచి ఎగుమ తయ్యే 8.7 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తుల్లో బ్రాండెడ్‌ ఔషధాల విలువ 10ులోపు ఉంటుందని అంచనా. ఈమేరకు సుంకాల ప్రభావం భారత ఫార్మాపై ఉంటుందని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


అమెరికాకే నష్టం

తాజా సుంకాల పెంపు అమెరికా ఆర్థిక వ్యవస్థపై మరో దశ అనిశ్చితికి కారణమవుతుందని.. ఆ దేశ స్టాక్‌మార్కెట్లు బలంగానే ఉన్నా, సుంకాల భారాన్ని ప్రజలపై వేయడం వల్ల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగి, ఉద్యోగాలు తగ్గుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. సుంకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం లేదని ట్రంప్‌ చెబుతున్నప్పటికీ..గణాంకాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 2.3శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం సెప్టెంబరుకు 2.9శాతానికి చేరడమే ఇందు కు నిదర్శనమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదొక్కటే కాదు.. సుంకాల దెబ్బకు ముడిపదార్థాల ధరలు పెరిగి ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతున్నాయి. దీంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం.. ఏప్రిల్‌ నుంచి ఇప్పటిదాకా ఉత్పత్తి రంగంలో 42వేల ఉద్యోగాలు, నిర్మాణ రంగంలో 8 వేల ఉద్యోగాలు పోయాయి.

Updated Date - Sep 27 , 2025 | 06:10 AM